Friday, September 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరా‌న్‌‌పై వైమానిక దాడిలోఅమెరికా 'యుద్ధ నేరం'

ఇరా‌న్‌‌పై వైమానిక దాడిలోఅమెరికా ‘యుద్ధ నేరం’

- Advertisement -

మినాబ్‌లోని పాఠశాలపై దాడి
లామెర్డ్‌లో స్పోర్ట్స్ కాంప్లెక్స్, నివాస ప్రాంతంపై మరో దాడి
చిన్నారులు సహా 178 మంది మృతి: అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం

టెహ్రాన్ : ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయిల్ దాడుల విషయంలో మరో కీలక అంశం తెరపైకి వచ్చింది. ఫిబ్రవరి 28న జరిగిన రెండు వైమానిక దాడుల్లో అమెరికా యుద్ధ నేరానికి పాల్పడి ఉండొచ్చని ఐరాస మానవ హక్కుల సంస్థ ( యూఎన్ హెచ్ఆర్సీ) నియమించిన అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం తెలిపింది. ఆ దాడుల్లో 178 మంది పౌరులు చనిపోయినట్టు పేర్కొంది. మృతుల్లో మహిళలు, చిన్నారులూ ఉన్నట్టు వెల్లడించింది. ఆ ఆరోపణల్లో ప్రధానంగా దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ నగరంలోని షజరెహ్ తయ్యెబెహ్ పాఠశాలను అమెరికాకు చెందిన ఓ క్షిపణి తాకినట్టు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ గతంలో నిర్వహించిన దర్యాప్తులో వెల్లడైంది. ఆ ఘటనలో 168 మంది చనిపోయినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా అప్పట్లో తెలిపింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులేనని పేర్కొంది. అయితే ఆ దాడికి సంబంధించి ఇప్పటివరకు పూర్తి స్థాయి అధికారిక లెక్కలు బయటకు రాలేదు. ట్రంప్ ప్రభుత్వం కూడా ఆ పాఠశాలపై జరిగిన దాడికి బాధ్యతను నేరుగా అంగీకరించలేదు. అదే విధంగా ఆ ఘటనపై పెంటగాన్ నిర్వహించిన దర్యాప్తు నివేదిక కూడా ఇప్పటివరకు బయటకు వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో నిజనిర్థారణ బృందం తాజాగా పలు వ్యాఖ్యలు చేసింది. పాఠశాల స్పష్టంగా గుర్తించగలిగే పౌర ప్రాంతంలో ఉన్నప్పటికీ దానిపై టోమాహాక్ క్షిపణులతో దాడి జరిగినట్టు పేర్కొంది. ఈ ఘటనపై అందు బాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత అమెరికా విచక్షణారహిత దాడికి పాల్పడిందని భావించడానికి కారణాలు ఉన్నాయని తెలిపింది.

స్పోర్ట్స్ కాంప్లెక్స్‌పై మరో దాడి
దక్షిణ ఇరాన్‌లోని లామెర్డ్ నగరంలో అదే రోజు మరో దాడి జరిగినట్టు అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం తెలిపింది. స్పోర్ట్స్ కాంప్లెక్స్, దాని చుట్టుపక్కల నివాస ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్టు పేర్కొంది. ఆ దాడిలో కచ్చిత లక్ష్యాలను ఛేదించే క్షిపణులను ఉపయోగించినప్పటికీ, అవి పెద్ద సంఖ్యలో టంగ్‌స్టన్ లోహపు ముక్కలను చుట్టుపక్కల ప్రాంతంలోకి విసిరినట్టు నిపుణులు తెలిపారు. ఆ ఘటనలో 22 మంది పౌరులు, పురుషులు, మహిళలు మరణించినట్టు వెల్లడించారు. అయితే ఈ దాడికీ అమెరికా బాధ్యతను అంగీకరించలేదు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా లామెర్డ్ దాడికి తాము బాధ్యులం కాదని గతంలో స్పష్టం చేసింది. దీంతో ఈ ఘటనపై బాధ్యత ఎవరిపై ఉందన్న అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆ రెండు ఘటనలను పరిశీలించిన నిజనిర్ధారణ బృందం, అమెరికా జరిపిన దాడులు పౌరుల ప్రాణాలు, పౌర ఆస్తులకు నష్టం కలిగించే విచక్షణారహిత దాడులుగా ఉండొచ్చని పేర్కొంది. అందువల్ల యుద్ధ నేరాలు జరిగి ఉండేందుకు సహేతుకమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది. అయితే ఇది తుది న్యాయస్థాన తీర్పు కాదు. స్వతంత్ర నిపుణులతో కూడిన నిజనిర్ధారణ బృందం చేసిన పరిశీలన, అందుబాటులో ఉన్న ఆధారాలపై ఆధారపడి వ్యాఖ్యలు చేసింది.

ఇరాన్ ప్రభుత్వంపైనా ఆరోపణలు
అంతర్జాతీయ నిజనిర్ధారణ బృందం అమెరికా, ఇజ్రాయిల్ దాడులపై మాత్రమే కాక ఇరాన్‌ ప్రభుత్వంపైనా ఆరోపణలు చేసింది. అక్కడి భద్రతా బలగాలు పెద్ద ఎత్తున ప్రజలను చంపిన ఘటనలు తమ పరిశీలనలో వెల్లడైనట్టు తెలిపింది. అంతేకాక మానవత్వానికి వ్యతిరేకంగా ఇరాన్ ప్రభుత్వం నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలు చేసింది. అయితే ఈ బృందానికి బంగ్లాదేశ్‌కు చెందిన న్యాయ నిపుణురాలు సారా హొస్సేన్ అధ్యక్షత వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 2022లో ఈ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ తాజా నివేదికతో ఇరాన్ యుద్ధంలో పౌరుల భద్రత, దాడుల్లో అంతర్జాతీయ చట్టాల పాటింపు అంశాలు మరోసారి చర్చకు వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -