Saturday, September 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంయూఎస్ కు షాక్

యూఎస్ కు షాక్

- Advertisement -

తీర్మానంపై రష్యా, చైనా వీటో
​ఇరాన్‌పై ఆంక్షల కొనసాగింపునకు అమెరికా ప్లాన్

​ఇరాన్‌పై ఆంక్షల కొనసాగింపునకు అమెరికా ప్లాన్..తీర్మానంపై రష్యా, చైనా వీటో

జెనీవా :పశ్చిమాసియా యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికాకు రష్యా, చైనాలు షాక్ ఇచ్చాయి. యూఎస్ శత్రు దేశం ఇరాన్‌కు అండగా నిలిచాయి. ఇరాన్‌పై అంతర్జాతీయ ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఉద్దేశించిన ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ గడువును మరో ఏడాది పాటు పొడిగించాలనే అమెరికా ప్రతిపాదనను రష్యా, చైనాలు వీటో చేశాయి. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలుగా వీటో అధికారాలు ఉన్న ఈ రెండు దేశాలు గురువారం జరిగిన ఓటింగ్‌లో అమెరికా తీర్మానాన్ని పూర్తిగా వ్యతిరేకించాయి. యూఎన్‌లో అమెరికా తీర్మానంపై ఓటింగ్‌ జరగ్గా, ఈ ప్రతిపాదన 11-2 ఓట్ల తేడాతో ఓడిపోయింది. కాగా, రష్యా, చైనాల వీటో అధికారాన్ని వాడుకోగా, సోమాలియా, పాకిస్తాన్‌లు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. ఆరునెలలుగా ఇరాన్‌తో భీకరంగా యుద్ధం సాగుతున్న నేపథ్యంలో టెహ్రాన్‌ను ఆర్థికంగా ఏకాకిని చేసేందుకు అగ్రరాజ్యం అమెరికా విస్తృతంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకేల మధ్య 2015లో కుదిరిన అణు ఒప్పందం నిబంధనలను ఇరాన్ ఉల్లంఘిస్తోందని యూరప్ దేశాలు ఆరోపించాయి. ఈ క్రమంలో ఐరాస కీలక నిర్ణయం తీసుకుంది. 2025 సెప్టెంబరులో స్నాప్‌బ్యాక్ మెకానిజం కింద ఇరాన్‌పై చర్యలు తీసుకుంది. ఇరాన్‌పై ఆంక్షల అమలును పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీకి అధికారం కల్పించింది. కాగా, ఇరాన్‌పై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆంక్షలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి. ఇరాన్ విదేశీ ఆస్తులను స్తంభింపజేయడం, టెహ్రాన్‌తో ఆయుధ ఒప్పందాలను నిలిపివేయడం, ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమ అభివృద్ధిని నిరోధించడం వంటి ఇతర చర్యలు ఈ ఆంక్షల్లో ఉన్నాయి.

​చైనా, రష్యాకు కృతజ్ఞతలు తెలిపిన ఇరాన్
తమ దేశానికి వ్యతిరేకంగా యూఎస్‌ తీసుకొచ్చిన తీర్మానాన్ని వీటో చేసినందుకు చైనా, రష్యాలకు ఇరాన్ మిషన్ కృతజ్ఞతలు తెలిపింది. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఐరాస భద్రతా మండలిని దుర్వినియోగం చేయడానికి అమెరికా, దాని మిత్రదేశాలు చేస్తున్న మరో నీచ ప్రయత్నాన్ని ఈ దేశాలు అడ్డుకున్నాయని పేర్కొంది. ఐరాస భద్రతా మండలిలో అమెరికా తీర్మానికి వ్యతిరేకంగా చైనా, రష్యాలు వీటో చేయడంపై హర్షం వ్యక్తం చేసింది.

​ఇరుదేశాలపై అమెరికా ఆగ్రహం
మరోవైపు, తమ తీర్మానికి వ్యతిరేకంగా రష్యా, చైనాలు వీటో చేయడంపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా డిప్యూటీ అంబాసిడర్ జెన్నిఫర్ లోసెట్టా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై విధించిన ఆంక్షలపై నిపుణుల పర్యవేక్షణను, అలాగే ప్యానెల్ సభ్యుల నియామకాన్ని అడ్డుకోవడానికి జరుగుతున్న విస్తృత ప్రయత్నంలో భాగమే ఈ వీటోలు అని పేర్కొన్నారు.

​ఈ ఆంక్షలు చట్టవిరుద్ధం : రష్యా
మరోవైపు, ఇరాన్‌పై ఆంక్షలను తిరిగి విధించడం చట్టవిరుద్ధమని ఇరాసలో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా అభిప్రాయపడ్డారు. అందువల్ల ఐక్యరాజ్యసమితి నిపుణుల కమిటీ పదవీకాలాన్ని పొడిగించే తీర్మానం వీగిపోయిందన్నారు. ఈ తీర్మానం తీవ్రమైన లోపాలతో కూడుకున్నదని, దానికి ఎటువంటి చట్టపరమైన ఆధారం లేదని ఆరోపించారు. ఈ తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టవద్దని రష్యా, చైనాలు అమెరికాను, దాని మిత్రదేశాలను గట్టిగా కోరాయని గుర్తు చేశారు.

​అమెరికాలో ఇజ్రాయిల్ అధ్యక్షుడు పర్యటన
పశ్చిమాసియా యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. వచ్చే వారం న్యూయార్క్‌ నగరంలో జరగబోయే ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ (యూఎన్‌జీఏ) 81వ సమావేశాల్లో పాల్గొనేందుకు ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, విదేశాంగ మంత్రి అబ్బాస్ ఆరాగ్చీ సహా ఇతర కీలక నేతలు అమెరికా వెళ్లనున్నారు. యుద్ధం వేళ ఆ నేతల వీసాలకు అమెరికా ఆమోదం తెలపడం గమనార్హం.

​పాలస్తీనా అధ్యక్షుడికి నో
ఇరాన్ అధ్యక్షుడు, ఇతర ప్రతినిధుల వీసాలు ఆమోదించిన అమెరికా పాలస్తీనాకు షాకిచ్చింది. పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్, ఆయన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందానికి మాత్రం వీసాలను తిరస్కరించింది. ఇజ్రాయిల్‌తో శాంతి ఒప్పందం విషయంలో తమ వాగ్దానాలను నిలుపుకోవడంలో పాలస్తీనా అధ్యక్షుడు మహమ్మద్‌ అబ్బాస్‌ సహా ఇతర ఉన్నతాధికారులు విఫలయ్యారని ఈ సందర్భంగా అమెరికా విదేశాంగ శాఖ ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -