స్పీకర్ ఆర్డర్ ను రద్దు చేసిన హైకోర్టు
తీర్పు ప్రతులను అసెంబ్లీ కార్యదర్శి,
కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని ఆదేశం
నవతెలంగాణ బ్యూరో -
హైదరాబాద్
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయనపై దాఖలైన అనర్హత పిటిషన్లను తిరస్కరిస్తూ అసెంబ్లీ స్పీకర్ (ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో) ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిన నాటి (ఏప్రిల్ 23, 2024) నుంచే దానం నాగేందర్ తెలంగాణ శాసనసభ సభ్యుడిగా అనర్హుడని ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్టు స్పష్టం చేసింది. తీర్పు ప్రతులను అసెంబ్లీ స్పీకర్ కార్యదర్శికి, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపాలని రిజిస్ట్రీని ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్లతో కూడిన డివిజన్ బెంచ్ శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ అదే సభ్యత్వంలో కొనసాగుతూనే కాంగ్రెస్ బీ–ఫారం తీసుకుని 2024 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం పదో షెడ్యూల్ కింద అనర్హతకు దారితీస్తుందని ధర్మాసనం తేల్చి చెప్పింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 191(2), పదో షెడ్యూల్లోని 2(1)(ఎ) నిబంధనల ప్రకారం మరో పార్టీ తరఫున చట్టసభ ఎన్నికల్లో అభ్యర్థిగా నిలవడం, ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయడమనేది పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా పరిగణించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపునకు పాల్పడలేదన్న వాదనలను ధర్మాసనం తోసిపుచ్చింది. మరోవైపు, దానం తరఫు న్యాయవాదులు ఆయన బీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని, అసెంబ్లీ రికార్డుల్లో ఆయన అ దే పార్టీకి చెందిన సభ్యుడిగానే ఉన్నారని వాదించారు. కాంగ్రెస్ నేతలను కలవడం, ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం, కండువా ధరించడం వంటి అంశాలతో స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకున్నట్లు నిర్ధారించలేమని, కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినంత మాత్రాన అసెంబ్లీ సభ్యత్వం ఆటోమేటిక్‌గా రద్దు కాదని పేర్కొన్నారు. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే కాంగ్రెస్ బీ–ఫారంతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం అనర్హతకు చట్టపరమైన ఆధారమని హైకోర్టు స్పష్టం చేసింది.
తీర్పు వెలువడిన వెంటనే దానం నాగేందర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుని, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సహేతుకమైన సమయం ఇవ్వాలని, అప్పటివరకు తీర్పు అమలును నిలిపివేయాలని కోరారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. అనర్హతకు గురైన వ్యక్తి ఒక్కరోజు కూడా ఎమ్మెల్యేగా కొనసాగడానికి వీల్లేదని, దానం నాగేందర్ ఇప్పటికే సుదీర్ఘకాలంగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని వాదించారు. సుప్రీంకోర్టు గతంలో నిర్దేశించిన న్యాయసూత్రాలను కూడా ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అప్పీల్ దాఖలు చేసుకునే వరకు తీర్పును నిలిపివేయాలన్న దానం తరఫు న్యాయవాదుల అభ్యర్థనను డివిజన్ బెంచ్ తిరస్కరించింది. కాగా ఈ వ్యవహారంలో తొలినుంచి కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా గెలిచారు.
అనంతరం ఆయన కాంగ్రెస్‌లో చేరినట్టు పిటిషనర్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడాన్ని ప్రధాన ఆధారంగా చూపుతూ పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు. మరో పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయడం ద్వారా అసలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు స్పష్టమవుతోందని వారు వాదించారు. దానం నాగేందర్ తరఫు న్యాయవాదులు మాత్రం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నట్టు అధికారికంగా ప్రకటించలేదని, వ్యక్తిగత పరిచయాల నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ నాయకులను కలిశారని, నియోజకవర్గ అభివృద్ధి కోసం మంత్రులు, ముఖ్యమంత్రిని కలవడం పార్టీ మారినట్లుగా పరిగణించలేమని పేర్కొన్నారు.
దానం నాగేందర్‌తోపాటు కాంగ్రెస్‌లో చేరిన ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత అంశంపైనా తొలుత హైకోర్టు సింగిల్ జడ్జి వద్ద విచారణ జరిగింది. స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న అనర్హత పిటిషన్లను నిర్ణయ ప్రక్రియకు తీసుకెళ్లాలని సింగిల్ జడ్జి ఆదేశించారు. అనంతరం ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్లగా, స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్న పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను నిర్ణీత కాలంలో పరిష్కరించాలంటూ 2025 జూలై 31న సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ దానం నాగేందర్‌పై దాఖలైన పిటిషన్లను విచారించి స్పీకర్ తిరస్కరించారు. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కౌశిక్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయిన అనంతరం చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌ల ధర్మాసనం ఆగస్టు 21న తీర్పును రిజర్వు చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు వెలువరించనున్నట్టు ప్రకటించినా, అనంతరం సెప్టెంబర్ 18న తీర్పు ప్రకటించింది. తాజాగా స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేసి దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది.
కాంగ్రెస్ ద్వంద్వ నీతిని బట్టబయలు : మాజీమంత్రి హరీశ్‌రావు
దానం నాగేందర్ వ్యవహారంలో కాంగ్రెస్ ద్వంద్వనీతిని హైకోర్టు తీర్పు బట్టబయలు చేసిందని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత, మాజీమంత్రి టి హరీశ్‌రావు అన్నారు. పార్టీ ఫిరాయింపులపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ శ్రీరంగ నీతులేనని తెలిపారు. ఫిరాయింపుదారులకు రక్షణ కల్పించే ప్రయత్నాలకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు అని విమర్శించారు. రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్‌కు చెంపపెట్టు : ప్రశాంత్‌రెడ్డి
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసిన హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టు అని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన ప్రభుత్వానికి ఇది గుణపాఠమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలకూ న్యాయస్థానంలో భంగపాటు తప్పదని హెచ్చరించారు. హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తోందని తెలిపారు. సత్యమేవ జయతే ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య విజయం : పాడి కౌశిక్‌రెడ్డి
ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యం సాధించిన విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డికి చెంపపెట్టులాంటిదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తరపున హైకోర్టుకు ధన్యవాదాలు ప్రకటించారు. ఇది బీఆర్ఎస్ విజయమని తెలిపారు. రెండున్నరేండ్లుగా చేస్తున్న తమ పార్టీకి విజయం దక్కిందని పేర్కొన్నారు. రేవంత్‌కు కోర్టు బ్రేక్ వేసిందని తెలిపారు. దానం నాగేందర్‌లాగే పార్టీ మారిన మిగతా ఎనిమిది మందిపై కూడా అనర్హత వేటు పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖైరతాబాద్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ ఘనవిజయం ఖాయమని తెలిపారు. పార్టీ మారిన కడియం శ్రీహరిది అనైతికమా తనది అనైతికమా ఎథిక్స్ కమిటీ తేల్చాలని కోరారు.
సుప్రీంకు వెళ్లే ఆలోచన లేదు : దానం నాగేందర్
తనపై హైకోర్టు అనర్హత వేటేసిన నేపథ్యంలో.. సుప్రీంకోర్టుకు వెళ్లే ఆలోచన లేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. న్యాయస్థానం తీర్పు అనంతరం శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లోనే కొట్లాడుతానని అన్నారు. ఎలక్షన్లలో పోరాడటం తనకు కొత్తకాదని, అలా పోరాడే తాను ఈ స్థాయికి ఎదిగానని వ్యాఖ్యానించారు. ప్రజాక్షేత్రంలో పోరాడుతా.. కచ్చితంగా విజయం సాధిస్తానంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు.
మిగతా ఫిరాయింపు ఎమ్మెల్యేలకూ ఇదే గతి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
దానం నాగేందర్ అనర్హత వేటుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం ఎక్స్ ద్వారా స్పందించారు. తెలంగాణ హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన మిగతా ఎమ్మెల్యేలకూ ఇదే గతి పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘సత్యమేవ జయతే’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.



