Sunday, September 20, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుకేంద్రం రూ.30 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి

కేంద్రం రూ.30 వేల కోట్ల కరువు ప్యాకేజీ ప్రకటించాలి

- Advertisement -

ఎండిన పంటలకు ఎకరానికి రూ.25 వేల పరిహారం ఇవ్వాలి
రైతులను ఆదుకోకుంటే ఉద్యమమే..22-ఏ భూములపై నిజాలు నిగ్గుతేల్చాలి
బుల్లెట్‌ ట్రైన్‌ సూర్యాపేట మీదుగానే వెళ్లాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌ వెస్లీ

నవతెలంగాణ-సూర్యాపేట
‘‘ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల తో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.. పంట నష్టంపై సమగ్రంగా అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి.. నష్టపోయిన ప్రతి రైతుకూ ఎకరానికి రూ.25 వేల చొప్పున పరిహారం చెల్లించాలి.. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 50 శాతం పంటలు ఎండిపోయిన నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు కేంద్రం రూ.30 వేల కోట్ల ప్రత్యేక కరువు ప్యాకేజీ ప్రకటించాలి.. లేదంటే ఉద్యమం చేపడతాం’’ అని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ హెచ్చరించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంవీఎన్ భవన్ లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు కనీసం 14 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయాలని, సాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. రిజిస్ట్రేషన్‌ తో సంబంధం లేకుండా అర్హులైన రైతులందరికీ పంటల బోనస్‌ అందించాలని కోరారు. కరువు పరిస్థితుల్లో వ్యవసాయ కూలీలకు ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధి హామీ చట్టం కింద ఏడాదికి 200 రోజుల పని కల్పించాలని అన్నారు. ఇందుకు అయ్యే వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టకపోతే ప్రజలను సమీకరించి ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

​ ​22-ఏ పేరుతో పేదల భూములను లాక్కోవద్దు
22-ఏ పేరుతో రాష్ట్రంలో మూడు లక్షల ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం చెబుతోందని, వాస్తవంగా దాదాపు 30 లక్షల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని జాన్‌వెస్లీ తెలిపారు. ఈ వ్యవహారంపై రాజకీయ ఆరోపణలకు తావులేకుండా సమగ్ర కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. 22-ఏ పేరుతో పేదల భూములను లాక్కోవద్దని కోరారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబం, మాజీ మంత్రులకు సంబంధించిన 300 ఎకరాల భూముల వ్యవహారంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారని, మైహోమ్‌ సంస్థకు సంబంధించి 2,400 ఎకరాల భూముల అంశాన్ని కూడా సభలో ప్రస్తావించారని తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబం 400 ఎకరాల భూములను ఆక్రమించిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తు న్నాయన్నారు. ఎవరు ఆక్రమించినా, ఎక్కడ భూములు ఆక్రమణకు గురైనా సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు తేల్చాలని డిమాండ్‌ చేశారు. ఆ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని కోరారు. భూ ఆక్రమణలపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే పేదల పక్షాన సీపీఐ(ఎం) ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని జాన్‌ వెస్లీ స్పష్టం చేశారు.

​​ఫిరాయింపులపై చర్యలు తీసుకోవాలి
​పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటును సీపీఐ(ఎం) స్వాగతిస్తోందని జాన్‌ వెస్లీ తెలిపారు. పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలపైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను చేర్చుకుని ఫిరాయింపులను ప్రోత్సహించిందని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా వివిధ పార్టీల ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు తీసుకొచ్చి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష సభ్యులు వ్యక్తిగత విమర్శలు, దూషణలకు దిగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. రైతులు, కూలీలు, పేదలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర చర్చ జరిపి పరిష్కారాలు చూపాలని డిమాండ్‌ చేశారు. సూర్యా పేట జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నందున జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. సూర్యాపేట మీదుగా బుల్లెట్‌ ట్రైన్‌ అలైన్‌మెంట్‌ను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. బుల్లెట్‌ ట్రైన్‌ సాధన ఉద్యమానికి సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తోందని, ఇప్పటికే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నామని తెలిపారు.

​హామీల అమలులో జాప్యం తగదు : మల్లు లక్ష్మి
సూర్యాపేట జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేల పరిహారం చెల్లించాలని ​సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. రైతులకు 14 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు ఉన్నవారికే ఇండ్లు నిర్మిస్తున్నదని, ఇండ్ల స్థలాలు లేని పేదలందరికీ న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ కార్మికులకు రూ.12 వేల ఆర్థిక సహాయం, మహిళలకు రూ.2,500ను వెంటనే ఇవ్వాలని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, ములకలపల్లి రాములు, చెరుకు ఏకలక్ష్మి, నాగరపు పాండు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -