– 312 మంది ప్రొఫెసర్లు అప్లై
– అంబేద్కర్ వర్సిటీకి అధికంగా 208 అప్లికేషన్లు
– అత్యల్పంగా ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి 51 దరఖాస్తులు
– ముగిసిన సమర్పణ గడువు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు ఉపకులపతుల (వీసీ) పోస్టులకు భారీగా దరఖాస్తులొచ్చాయి. పది వర్సిటీలకు కలిపి 320 మంది ప్రొఫెసర్లు 1,382 దరఖాస్తులను సమర్పించారు. సోమవారంతో దరఖాస్తు సమర్పణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. అత్యధికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (బీఆర్‌ఏఓయూ)కు 208, ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ)కు 193, పాలమూరు విశ్వవిద్యాలయం (పీయూ)కు 159, శాతవాహన విశ్వవిద్యాలయం (ఎస్‌యూ)కు 158, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ)కు 157, కాకతీయ విశ్వవిద్యాలయం (కేయూ)కు 149, తెలంగాణ విశ్వవిద్యాలయం (టీయూ)కు 135, జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) హైదరాబాద్ కు 106, పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ (పీఎస్‌టీయూ) 66 దరఖాస్తులొచ్చాయి. అత్యల్పంగా జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం (జేఎన్‌ఏఎఫ్‌ఏయూ)కు 51 దరఖాస్తులను సమర్పించారు. వీసీల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల నియామకానికి అనుసరించిన విధానాన్నే వీసీల నియామకానికి వర్తింపచేసింది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఆ పది వర్సిటీలకు 2021, మే 22న వీసీలను నియమించిన విషయం తెలిసిందే. వారి పదవీకాలం ఈ ఏడాది మే 21న ముగియనుంది. దరఖాస్తులు రావడంతో త్వరలోనే వర్సిటీల వారీగా సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తులను ఆ కమిటీ పరిశీలిస్తుంది. అర్హులైన వారి జాబితాను రూపొందిస్తుంది. అనంతరం ముగ్గురు ప్రొఫెసర్ల పేర్లను రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. వాటిని గవర్నర్ ఆమోదానికి ప్రభుత్వం పంపిస్తుంది. ఆ తర్వాత వీసీలను ప్రకటిస్తుంది.