– చెకుముఖి తాతకు పలువురి నివాళులు..
నవతెలంగాణ-ఓయూ
జేవీవీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.ఆదినారాయణ అంత్యక్రియలు మంగళవారం పూర్తయ్యాయి. ఆయన ఆదివారం తెల్లవారుజామున మృతిచెందిన విషయం విదితమే. హైదరాబాద్ తార్నాకలోని కిమితి కాలనీలో ఆయన నివాసం నుంచి ఉదయం 11 గంటల సమయంలో మృతదేహాన్ని మల్లాపూర్ శ్మశాన వాటికకు తరలించారు. ఆదినారాయణ కుమారుడు అశోక్ అంత్యక్రియలు చేశారు. అంతకుముందు పలువురు జేవీవీ నేతలు, ప్రజా సంఘాల నాయకులు, ఓయూ సైన్స్ కళాశాల ప్రొఫెసర్లు ఆదినారాయణ మృతదేహానికి నివాళ్లర్పిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఆయనతో ఉన్న గత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. నివాళ్లర్పించిన వారిలో సీసీఎంబీ మాజీ డైరెక్టర్ డా. మోహన్‌రావు, జేవీవీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కోయ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనాధ్, కోశాధికారి రావుల వరప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి రాజా, రాష్ట్ర నాయకులు జితేందర్, చెలిమెల రాజేశ్వర్, జేవీవీ హైదరాబాద్ నగర అధ్యక్ష, కార్యదర్శులు చంద్రశేఖరరావు, లింగస్వామి, ఔట అధ్యక్షుడు ప్రొ.మనోహర్ తదితరులు ఉన్నారు.