– సాధ్యాసాధ్యాలు పరిశీలించనున్న విద్యాశాఖ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (కేజీబీవీ)ల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైంస్కేల్‌ను వర్తింపచేయాలని ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు తెలిసింది. వారిని రెగ్యులరైజ్ చేయడం లేదంటే మినిమం టైంస్కేల్‌ను వర్తింపజేసే అంశాల పట్ల సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. నిబంధనల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందో చూడాలని కోరింది. అయితే కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్ చేయాలనీ, మినిమం టైంస్కేల్ వర్తింపచేయాలంటూ గతేడాది డిసెంబర్ తొమ్మిదిన తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్ల సంఘం (టీఎస్‌జీహెచ్‌ఎంఏ) రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 495 కేజీబీవీలున్నాయి. 245 కేజీబీవీల్లో ఇంటర్ వరకు, మిగిలిన 230లో పదో తరగతి వరకు విద్యార్థినిలు చదువుతున్నారు. 2014లో కేవలం 391 కేజీబీవీలుండేవి. 2017-18లో కొత్తగా 84 కేజీబీవీలను ప్రభుత్వం మంజూరుచేసింది. దీంతో రాష్ట్రంలో వాటి సంఖ్య 475కి చేరింది. ఇటీవల మరో 20 కేజీబీవీలను ప్రభుత్వం మంజూరు చేయడంతో వాటి సంఖ్య 495కు చేరింది. వాటిలో సుమారు 1.50 లక్షల మంది విద్యార్థినిలు విద్యనభ్యసిస్తున్నారు. కేజీబీవీల్లో స్పెషల్ ఆఫీసర్లు (ఎస్‌వో), పీజీసీఆర్టీ, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్‌ఎం, అకౌంటెంట్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్లకు రూ.32,500, పీజీసీఆర్టీలకు రూ.29,900, సీఆర్టీలకు రూ.26,000, పీఈటీలకు రూ.15,600, అకౌంటెంట్లకు రూ.14,300, ఏఎన్‌ఎంలకు రూ.14,300 వేతనం ఇస్తున్నారు. వారికి మినిమం టైంస్కేల్‌ను వర్తింపచేస్తే వేతనాలు పెరుగు తాయి. సమాన పనికి సమాన వేతనమివ్వాలనీ, ఎస్‌వోను ప్రిన్సిపాల్‌గా, పీజీసీఆర్టీలను జేఎల్స్‌గా, సీఆర్టీలను స్కూల్ అసిస్టెంట్లుగా, పీఈటీలను పీడీలుగా గుర్తించి ఆ పోస్టుకు ఇస్తున్న బేసిక్‌పేను మినిమం టైంస్కేల్‌గా చెల్లించాలని పలు ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. దీన్ని పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే.