నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీటీజీడీఏ) నాయకులు సమస్యలపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రితో పాటు కార్యదర్శి క్రిస్టీనా చొంగ్తూతో చర్చించారు. బుధవారం హైదరాబాద్‌లో ఆ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను ఆయన నివాసంలో టీటీజీడీఏ అధ్యక్షులు డాక్టర్ అన్వర్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ తిరుపతి రావు, ఉపాధ్యక్షులు డాక్టర్ కిరణ్ మాదాల, కోశాధికారి డాక్టర్ కిరణ్ ప్రకాశ్ కలిశారు. ఈ సందర్భంగా మంత్రి, టీటీజీడీఏ క్యాలెంజర్, వైబ్‌సైట్‌ను ఆవిష్కరించారు. సమయాన్ని కేటాయించి చర్చించినందుకు నాయకులు మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం వారు క్రిస్తీనాతో సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సాధారణ బదిలీలుంటాయనీ, పే ఫిక్సేషన్, కన్వర్షన్ అంశాలను పరిశీలిస్తానని ఆమె హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు. మెడికల్ కాలేజీల్లో మౌలిక సదుపాయాలు, కనీస వసతులు, మానవ వనరుల సమస్యలపై అన్ని మెడికల్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో కార్యదర్శి గురువారం చర్చించనున్నారని చెప్పారు. ఆర్థిక అంశాలపై మంత్రితో చర్చిస్తానంటూ ఆమె హామీ ఇచ్చినట్టు వారు తెలిపారు.