ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీరని అన్యాయం

– రోస్టర్‌ పాయింట్లు లేకుండా సమాంతర రిజర్వేషన్ల అమలు
– తక్కువ పోస్టులుంటే 33 శాతం పోస్టులు వచ్చేది కష్టమే
– ప్రభుత్వ నిర్ణయంతో మహిళల్లో ఆందోళన
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళలకు తీరని అన్యాయం జరిగే అవకాశమున్నది. వారికి సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రత్యక్ష నియామకాల పద్ధతిలో మహిళలకు ప్రత్యేకంగా రోస్టర్‌ పాయింట్లను మార్కు చేయకుండా ఓపెన్‌, రిజర్వుడు కేటగిరీల్లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం ఈనెల ఒకటో తేదీన ఉత్తర్వులను జారీ చేసింది. టీఎస్‌పీఎస్సీ సహా రాష్ట్రంలోని వివిధ నియామక బోర్డులు ఈ విధానాన్ని ఉద్యోగాల భర్తీకి వర్తింపజేయాల్సి ఉంటుంది. దీంతో మహిళా నిరుద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ప్రభుత్వ సర్వీసు నిబంధనల ప్రకారం మహిళలకు ఉద్యోగాల్లో 33 1/3 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలి. అందుకనుగుణంగానే సమాంతర రిజర్వేషన్లను వర్తింపచేయాలి. కానీ అందుకు భిన్నంగా రోస్టర్‌ పాయింట్లను మార్కు చేయకుండానే మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలన్న నిర్ణయంతో వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదమున్నది. ఓపెన్‌, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీల్లో రాజ్యాంగ నిబంధనల ప్రకారం మహిళలకు 33 1/3 శాతం సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో భవిష్యత్తులో ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మహిళా నిరుద్యోగులు కనీసం పది శాతం కూడా రిజర్వేషన్లు పొందే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే ఓపెన్‌తోపాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఒక్కో కేటగిరీలో వంద పోస్టులుంటేనే 33 1/3 రిజర్వేషన్లను మహిళలకు అమలు చేయడానికి అవకాశముంటుంది. పది పోస్టులుంటే అందులో ఒక పోస్టు మహిళలకు కేటాయిస్తారు. అంతకంటే తక్కువ పోస్టులుంటే మెరిట్‌లో ఎవరుంటే వారికే ఉద్యోగాలు దక్కుతాయి. అంటే తక్కువ పోస్టులుంటే మహిళలకు ప్రత్యేకంగా కేటాయించే అవకాశం లేదు. అయితే గ్రూప్‌-1తోపాటు ఇతర నోటిఫికేషన్లను కొత్త రోస్టర్‌ పద్ధతి ప్రకారం టీఎస్‌పీఎస్సీ, ఇతర బోర్డులు విడుదల చేశాయి. దాని ప్రకారం రోస్టర్‌ పాయింట్‌ ఒకటి నుంచి తీసుకోవడం వల్ల మహిళలకు ఎక్కువ పోస్టులు రిజర్వు అయ్యాయి. దీనిపై ఆందోళన వ్యక్తమైంది. అందుకే ఆ నోటిఫికేషన్లను సవాల్‌ చేస్తూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. రాజస్థాన్‌ పబ్లిక్‌ సర్వీసెస్‌కు సంబంధించి రాజేష్‌కుమార్‌ దరియా కేసులో సుప్రీంకోర్టు ప్రకారం మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేయాలని ఆదేశించింది. అయితే వారికి ఎలాంటి రోస్టర్‌ పాయింట్‌ను పేర్కొనకూడదని ఆదేశించింది. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీఎస్‌పీఎస్సీతోపాటు ఇతర బోర్డులు మహిళలకు సమాంతర రిజర్వేషన్లను అమలు చేయనున్నాయి. దీనివల్ల నష్టం కలుగుతుందని పలువురు మహిళా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Spread the love