– హామీలకు, బడ్జెట్‌కు పొంతన లేదు
– బీఆర్ఎస్ సీనియర్ సభ్యులు కడియం
– సీఎం రేవంత్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మేడిగడ్డ బ్యారేజీ విషయంలో చేసిన రాజకీయం ఇక చాలనీ, తక్షణమే ఆ బ్యారేజీకి మరమ్మతులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్ఎస్ సీనియర్ సభ్యులు కడియం శ్రీహరి సూచించారు. గురువారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. బడ్జెట్లో పొందుపర్చిన సూక్తులు, పదజాలం గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే ఎక్కువ పేజీలు కేటాయించినట్టు ఉందనీ, వచ్చే బడ్జెట్ పుస్తకం సమయంలోనైనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను, బడ్జెట్లో కేటాయింపులకు అసలు పొంతనే లేదని విమర్శించారు. అధికారం చేపట్టగానే డిసెంబర్ తొమ్మిదో తేదీన చేస్తామన్న రుణమాఫీ ఏమైందని ప్రశ్నించారు. ఈ ఏడాదే నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేస్తామని బడ్జెట్లో చెప్పారనీ, 119 నియోజకవర్గాల్లో ఆ ఇండ్లు కట్టాలంటే రూ.24 వేల కోట్ల రూపాయలు అవసరమని చెప్పారు. కానీ, బడ్జెట్లో దాని కోసం రూ.7 వేల కోట్లనే ప్రతిపాదించడాన్ని బట్టే ఇండ్లు పూర్తిచేసే ఉద్దేశం ప్రభుత్వానికి లేదనిపిస్తుందోన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఆయన సూచించారు. నిధుల సేకరణపైనా స్పష్టత లేదన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకతీయ తోరణం, చార్మినార్ రాచరిక చిహ్నాలు అని చెబుతూ రాష్ట్ర చిహ్నాన్ని మార్చటం సరిగాదన్నారు. జాతీయ జెండాలోని అశోక చక్రం ఎక్కడ నుంచి తీసుకున్నారు? మూడుసింహాల చిహ్నం ఎక్కడ నుంచి తీసుకున్నారు? అని ప్రశ్నించారు. ప్రతి మహిళకూ రూ.2,500 ఇస్తామన్నారు కదా దానికి నిధులేవి అని నిలదీశారు.
రాజగోపాల్‌రెడ్డి వర్సెస్ కడియం
కడియం గతంలో రాజయ్య నుంచి ఉపముఖ్యమంత్రి పదవి లాక్కున్నారనీ, గత ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవిని కూడా గుంజుకున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడియం శ్రీహరి తనపై వ్యక్తిగతంగా మాట్లాడటం వల్లే తాను మాట్లాడానని తెలిపారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలా? వద్దా? అనేది తమ పార్టీ, సీఎం నిర్ణయిస్తారనీ, బీఆర్ఎస్ సభ్యులకు ఎందుకు అని ప్రశ్నించారు. మంత్రి పదవి రాలేదని రెచ్చగొడుతున్నారనీ, కాంగ్రెస్ సభ్యులను ఒక్కొక్కరిని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని కూల్చేయాలనే కుట్రకు బీఆర్ఎస్ సభ్యులు దిగారని ఆరోపించారు. బీసీ మంత్రిని పట్టుకుని ఏరు కూర్చో..ఏరు కూర్చో అంటావా? ఇదేం భాష కేటీఆర్ అని ప్రశ్నించారు. ఈ సమయంలో కేటీఆర్ జోక్యం చేసుకుని మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వాడిన పదజాలాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. దళిత నేతపై ఇలా మాట్లాడటం సరిగాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకుని మాజీ సీఎం నల్లగొండలోమాట్లాడిన మాటలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఏం పీకనీకి పోయారు’ అని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీకి పట్టిన చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే ఆయన అని ఆరోపించారు. రేవంత్ రేవంత్‌రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్‌గా మాట్లాడటం వేరు, సీఎం హౌదాలో మాట్లాడటం వేరన్నారు. రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరికాదన్నారు. శాసనసభలో మఖ్యమంత్రి భాష అభ్యంతరకరంగా ఉందని ఆక్షేపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు శాసనసభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు.