– ఫారెస్ట్ సిబ్బందికి సవాల్‌గా మారిన మంటలు
నవతెలంగాణ- అచ్చంపేట
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ ఫారెస్ట్ ఏరియాలో వేసవికాలం వచ్చిందంటే తరచూ అడవి మంటల్లో అహుతి అవుతున్న సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కానీ వేసవి కాలం రాకముందే ఇప్పటికే మూడునాలుగు దఫాలుగా మంటలు వ్యాపించినట్టు స్థానికులు తెలుపుతున్నారు. కాగా, రెండు రోజులుగా దోమలపెంట రేంజ్‌లోని ఉప్పునుంతల గ్రామ సమీప అడవి నుంచి కృష్ణా రివర్ సమీపంలోని వజ్రాల మడుగు వరకు మంటలు వ్యాప్తి చెందడంతో ఆదివారం వెలుగులోకి వచ్చింది. రెండు రోజులుగా మంటలు ఎగిసిపడుతుండటతో వాటిని ఆర్పడం.. అటవీశాఖ అధికారులకు సవాల్‌గా మారింది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు తాత్కాలిక సిబ్బందిని ఏర్పాటుచేసి చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు తెలుపుతున్నారు. మంటలు ఆర్పే సమయంలో సిబ్బందికి సరైన రక్షణా పరికరాలు లేకపోవడంతో కొంతమందికి గాయాలయినట్టు సమాచారం. అయితే, గత రెండు రోజులుగా 18 కి.మీపై అటవి కాలినట్టు తెలుస్తోంది. కాగా, గతేడాది వేసవిలో నాలుగు వేల హెక్టార్ల పరిధిలో అటవి కాలినట్టు అధికారిక లెక్కలు తెలుపుతున్నాయి. ప్రస్తుతం ఈ నెలలోనే మూడుసార్లు మంటలు వ్యాప్తి చెందడంతో సుమారు 3 వందల హెక్టార్లకు పైగా అడవి కాలినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.