– ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలు
– రంగారెడ్డి జిల్లా కొందుర్గులో ఘటన
నవతెలంగాణ-షాద్‌నగర్
స్కాన్ ఎనర్జీ ఐరన్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ముగ్గురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని కొందుర్గు మండల కేంద్రంలో సోమవారం జరిగింది. ఇందుకు సంబంధించి స్థానికులు, పోలీసలు తెలిపిన వివరాల ప్రకారం.. స్కాన్ ఎనర్జీ పరిశ్రమలో సోమవారం భారీ పేలుడు జరిగింది. ఈ పేలుడు ధాటికి షెడ్డు కూలిపోయింది. భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. అందులో పని చేస్తున్న బీహార్ రాష్ట్రానికి చెందిన కమల్ కిషోర్, అనిల్, పాశ్వాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే షాద్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. షెడ్డు కింద మరికొందరు కార్మికులు చిక్కుకున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరిశ్రమలలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్ణన్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులకు మెరుగైన వైద్యం అందించి, వారిని ఆదుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి.