ఇక నుంచి ఏటా రెండు సార్లు ‘టెట్‌’

From now on, 'Tet' is celebrated twice a year.– రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
– జూన్‌, డిసెంబర్‌లో నిర్వహణ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఉపాధ్యాయ అభ్యర్థులకు నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)ను ఇకనుంచి ఏటా రెండుసార్లు నిర్వహించాలనీ, రాష్ట్ర ప్రభుత్వం జూన్‌, డిసెంబర్‌ నెలల్లో ఆ పరీక్షలను నిర్వహించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలే అందుకు సంబంధించిన దస్త్రంపై సంతకం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇకనుంచి డీఎస్సీ నోటిఫికేషన్లతో సంబంధం లేకుండా ఏటా రెండుసార్లు టెట్‌ను విద్యాశాఖ నిర్వహించనుంది. టెట్‌ నిర్వహణకు 90 రోజుల సమయం పట్టనుండగా, అంతకు ముందే నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నాయి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి (ఎన్‌సీటీఈ) నిబంధనల ప్రకారం ఏటా రెండుసార్లు టెట్‌ను నిర్వహించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా టెట్‌ గడువును ఏడేండ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించింది. గతంలో అర్హత పొంది మార్కులను పెంచుకోవాలనుకునే వారు, ఇటీవలీ కాలంలో బీఈడీ, డీఐఈడీ వంటి కోర్సులను పూర్తిచేసిన వారు మాత్రమే టెట్‌ రాసేవారు.
కానీ ఇప్పుడు స్కూల్‌ అసిస్టెంట్‌ పదోన్నతులకు పేపర్‌-2లో అర్హత కావాలన్న నిబంధనను తప్పనిసరిగా పాటించాల్సి ఉన్నది. దీంతో ఇక నుంచి ఉపాధ్యాయ ఉద్యోగ కోసం ఎదురుచూసే వారే కాకుండా ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారు కూడా టెట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దీంతో టెట్‌కు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో గతేడాది ఆగస్టు ఒకటిన టెట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. సెప్టెబర్‌ 15న రాతపరీక్షలను నిర్వహించారు. అదేనెల 27న ఫలితాలను విడుదల చేశారు. టెట్‌ పేపర్‌-1కు 2,69,557 మంది దరఖాస్తు చేస్తే వారిలో 2,23,582 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో 82,489 (36.89 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-2కు 2,08,498 మంది దరఖాస్తు చేయగా, వారిలో 1,90,047 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. వారిలో 29,073 (15.30 శాతం) మంది అభ్యర్థులు ఉత్తీర్ణత పొందారు. ఇందులో మ్యాథ్స్‌, సైన్స్‌ విభాగానికి 1,01,134 మంది హాజరుకాగా, 18,874 (18.66 శాతం) మంది పాసయ్యారు. సోషల్‌ స్టడీస్‌ విభాగానికి 88,913 మంది 10,199 (11.47 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

Spread the love