– ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు
– రేపటినుంచి పరీక్షలు ప్రారంభం హాజరుకానున్న 9,80,978 మంది విద్యార్థులు
– 1,521 పరీక్షా కేంద్రాల ఏర్పాటు
– 27,900 మంది ఇన్విజిలేటర్ల నియామకం
– విద్యార్థులు ఒత్తిడికి లోనైతే టెలీమానస్ ద్వారా కౌన్సిలింగ్ : ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. వచ్చేనెల 19 వరకు జరిగే ఈ పరీక్షలను ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారు. ఉదయం తొమ్మిది తర్వాత పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులకు అనుమతి ఉండదు. ఈ పరీక్షల నిర్వహణ కోసం ఇంటర్ బోర్డు అధికారులు సర్వంసిద్ధం చేశారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పూర్తి చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 4,78,718 మంది, ద్వితీయ సంవత్సరం నుంచి 5,02,260 మంది కలిపి మొత్తం 9,80,978 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. ద్వితీయ సంవత్సరంలో 4,44,189 మంది రెగ్యులర్, 58,071 మంది ప్రయివేటు విద్యార్థులు న్నారు. రాష్ట్రంలో 1,521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 407, ప్రభుత్వ రంగ కాలేజీలు 234, ప్రయివేటు జూనియర్ కాలేజీలు 880 ఉన్నాయి. రాష్ట్రంలో 1,521 మంది చీఫ్ సూపరింటెండెంట్లు (సీఎస్), 1,521 మంది డిపార్ట్మెంటల్ అధికారులు (డీవో), 27,900 మంది ఇన్విజిలేటర్లు, 75 మంది ఫ్లైయింగ్ స్క్వాడ్లు, 200 మంది సిట్టింగ్ స్క్వాడ్లను ఇంటర్ బోర్డు నియమించింది. సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా మాట్లాడుతూ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఒత్తిడి, భయాందోళనలకు లోనుకాకుండా ఉండాలని కోరారు. ప్రశాంతంగా పరీక్షలను రాయాలనీ, విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా చూడాల్సిన బాధ్యత ఆయా యాజమాన్యాలతోపాటు అధ్యాపకులు, తల్లి దండ్రులపై ఉందన్నారు. విద్యార్థులకు మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలుంటే టెలీమానస్ ద్వారా కౌన్సిలింగ్ ఇస్తామని వివరిం చారు. టోల్‌ఫ్రీ నెంబర్ 14416 లేదా 1800-914416 నెంబర్లను సంప్రదించాలని సూచించారు. ఇప్పటి వరకు 475 మంది ఫోన్ చేశారని అన్నారు.
పరీక్షా కేంద్రాల వద్ద వసతుల కల్పన
పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామనీ, విద్యార్థులకు అవసరమైన సదుపాయాలను కల్పించామని శృతి ఓజా చెప్పారు. తాగునీరు, ఓఆర్ఎస్ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు సకాలంలో చేరేందుకు వీలుగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయాలని ఆర్టీసి అధికారులను కోరారు. పరీక్షల నిర్వహణ సమయంలో తలెత్తే సమస్యలకు సత్వర పరిష్కారం లభించే విధంగా ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షిం చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరీక్షలు సమర్థవంతంగా, పారదర్శకంగా, ఇబ్బందులు తలెత్తకుండా నిర్వహించాలని కోరారు. పరీక్షల సమయంలో విద్యుత్‌కు ఆటంకం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ ఉంటుందన్నారు. ఇంటర్ బోర్డు వెబ్సైట్ ద్వారా హాల్‌టికెట్లను డౌన్లోడ్ చేసుకునే అవకాశం విద్యార్థులకు కల్పించామని చెప్పారు. ఈ సమావేశంలో ఇంటర్ పరీక్షల నియంత్రణాధికారి జయప్రదబాయి, జాయింట్ సెక్రెటరీ శ్రీనివాస్, ప్రజాసంబంధాల అధికారి పద్మ తదితరులు పాల్గొన్నారు.