నవతెలంగాణ-నిజామాబాద్
తాగునీటి అవసరాల మేరకు మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తి శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు నీటిని విడుదల చేసినట్టు ఎస్సారెస్పీ ఎఈఈ రవి తెలిపారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి సీడబ్ల్యుసీ అధికారుల సమక్షంలో మహారాష్ట్ర, తెలంగాణ ప్రాజెక్టుల అధికారులు శుక్రవారం బాబ్లీ గేట్లు తెరిచారు. 0.6 టీఎంసీల నీరు విడుదల చేసి మూసివేయనున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మార్చి 1న దిగువకు 0.6 టీఎంసీల నీటిని తాగునీటి కోసం బాబ్లీ ప్రాజెక్టు నుంచి గోదావరి నది గుండా ఎస్సారెస్పీలోకి వదులుతారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ ఈఈఈ వెంకటేశ్వర్లు, బాబ్లీ ప్రాజెక్టు ఈఈ సిఆర్ బాన్సోధ్, ఎస్సారెస్పీ డిఈఈ గణేష్, ఎస్సారెస్పీ ఎఈఈ రవి, కడెం ప్రాజెక్టు డిఈఈ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.