5న లైబ్రరియన్‌ అభ్యర్థులకు ధ్రువపత్రాల పరిశీలన

Scrutiny of Certificates for Librarian Candidates on 5thనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని ఇంటర్‌ విద్య, సాంకేతిక విద్యలో లైబ్రరియన్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఈనెల ఐదో తేదీన హైదరాబాద్‌లోని నాంపల్లిలో ఉన్న తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ధ్రువపత్రాల పరిశీలన జరగనుంది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ అందుబాటులో ఉందని తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలనకు అవసరమైన అన్ని పత్రాలనూ తీసుకురావాలని సూచించారు. ఎవరైనా అభ్యర్థులు ఒరిజినల్‌ ధ్రువపత్రాలను తీసుకురాకపోతే ఆ తర్వాత అవకాశం ఇవ్వబోమని స్పష్టం చేశారు. ధ్రువపత్రాల పరిశీలనకు గైర్హాజరైతే తర్వాత ఈ ప్రక్రియను చేపట్టబోమని స్పష్టం చేశారు. విద్యాశాఖ పరిధిలో ఇంటర్‌ కమిషనరేట్‌లో 40, సాంకేతిక విద్యాశాఖలో 31 కలిపి మొత్తం 71 లైబ్రెరియన్‌ పోస్టుల భర్తీకి 2022, డిసెంబర్‌ 31న నోటిఫికేషన్‌ను విడుదల సంగతి తెలిసిందే. ఇతర వివరాలకు అభ్యర్థులు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.
టీఆర్టీ హిందీ ఫలితాలు విడుదల
ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) హిందీ ఫలితాలను టీఎస్‌పీఎస్సీ విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రీలింక్విష్‌మెంట్‌ తర్వాత విత్‌హెల్డ్‌లో ఉన్న ఫలితాలను విడుదల చేశామని తెలిపారు. రెండు ఖాళీలను ప్రభుత్వం విత్‌హెల్డ్‌లో ఉంచిందని పేర్కొన్నారు. గతనెల 24 నుంచి 26 వరకు రీలింక్విష్‌మెంట్‌ కోసం అవకాశం కల్పించామని తెలిపారు. అభ్యర్థులెవరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోలేదని పేర్కొన్నారు. ప్రొవిజినల్‌ జాబితాను విడుదల చేశామని తెలిపారు. ఎంపికైన అభ్యర్థుల వివరాలు www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని వివరించారు.
జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 12
మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖలో అకౌంట్స్‌ ఆఫీసర్‌ (యూఎల్‌బీ), జూనియర్‌ అకౌంట్స్‌ ఫీసర్‌ (యూఎల్‌బీ), సీనియర్‌ అకౌంటెంట్‌ (యూఎల్‌బీ)లో జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు 12 ఉన్నాయని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. 13 ఉన్న జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులను తాజాగా మున్సిపల్‌ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ సవరించిందనీ, వాటిని 12 పోస్టులకు తగ్గించిందని పేర్కొన్నారు.
టీఎస్‌పీఎస్సీ సభ్యునిగా ఆమీర్‌ ఉల్లాఖాన్‌ బాధ్యతల స్వీకరణ
టీఎస్‌పీఎస్సీ సభ్యునిగా ఆమీర్‌ ఉల్లాఖాన్‌ శుక్రవారం బాధ్యతలను స్వీకరించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్‌ ఎం మహేందర్‌రెడ్డి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. తపాలా శాఖలో రిటైర్డ్‌ అధికారిగా పనిచేసిన ఆమీర్‌ ఉల్లాఖాన్‌ను రాష్ట్ర ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీ సభ్యునిగా నియమించిన విషయం తెలిసిందే.

Spread the love