హైకోర్టు తీర్పును అమలు చేయాలి

– ప్రజాభవన్‌కు తరలి వచ్చిన డీయస్సీ 2008 బాధితులు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్ర హైకోర్టు మధ్యంతర తీర్పును అమలు చేసి తమ జీవితాల్లో వెలుగు నింపాలని డియస్సీ 2008 బాధితులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌ లోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌కు వందలాది వారు తరలివచ్చారు.వెయ్యి మంది బాధితులమున్నామనీ, తమకు న్యాయం చేయాలని కోరారు. డీయస్సీ-2008 ద్వారా ఎంపికైన అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రజావాణిలో విన్నవించుకున్నారు. మెరిట్‌ అభ్యర్థులను సెకండ్‌ గ్రేడ్‌ టీచర్లుగా నియమించాలని కోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ప్రజావాణిలో 2,095 దరఖాస్తులు నమోదయ్యాయి. వీటిలో రెవెన్యూ సమస్యలకు సంబంధించి 458, రేషన్‌ కార్డుల కోసం 134, ఇందిరమ్మ ఇండ్ల కోసం 552, మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించిన 333 దరఖాస్తులున్నాయి. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్‌ చిన్నారెడ్డి, ప్రజావాణి ప్రత్యేక అధికారి, మున్సిపల్‌ శాఖ సంచాలకురాలు దివ్య, ఇతర అధికారులు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించండంతో పాటు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీటెక్‌ , బీఈడీ చదివి ఇటీవల గురుకుల నియామక పరీక్షలో ఎంపికైన 97 మందికి నియామక ఉత్తర్వులు నిలిపివేశారని ఎంపికైన అభ్యర్థులు ప్రజావాణిలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డిని కలసి విన్నవించుకున్నారు. తాము కష్టపడి బీటెక్‌ చదివి టీచర్‌ కావాలని ఆశతో ప్రభుత్వం నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయ నియామక పరీక్ష రాసి మెరిట్‌లో ఎంపికయ్యామని తెలిపారు. న్యాయ పరమైన అంశాలుంటే వాటిని పరిష్కరించి ఎంపికైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూస్తానని ఈ సందర్భంగా చిన్నారెడ్డి హామీ ఇచ్చారు.

Spread the love