– జూన్ 2 నుండి 22 వరకు ఉత్సవాలు
– ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు భాగస్వాములు కావాలి
– ఉమ్మడి నల్గొండ జిల్లాలో విజయవంతం చేద్దాం
– రాష్ట్ర మంత్రి విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
నవతెలంగాణ-భువనగిరిరూరల్
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 9ఏండ్లు నిండి 10వవసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 2 నుండి 22 వరకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లాలో పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి పిలుపునిచ్చారు . తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై నల్గొండ,సూర్యాపేట, యాధాధ్రి భువనగిరి జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారులతో మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా సమీకృత జిల్లా అధికారుల భవన సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన సన్నాహక సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూఅమరుల ఆశయాల కనుగుణంగా తెలంగాణను తీసుకురావడం జరిగిందని, ఈ 9 ఏండ్ల కాలంలో ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా వినూత్న పథకాలు అమలు చేస్తూ అన్ని రంగాలలో రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించి అగ్ర భాగాన నిలిచిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు కోసం ఎన్నో ఉద్యమాలు నిర్వహించారని,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఎన్నో అణచి వేత లు,అవమానాలు గురై అభివృద్ధిలో వెనుక బాటుకు గురైందన్నారు. 2001 లో అందరి భాగస్వామ్యంతో అహింసా,ప్రజాస్వామ్య పద్దతిలో కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో డా.బిఅర్.అంబేడ్కర్ రాజ్యాంగం కనుగుణంగా పార్ల మెంట్ చట్టం ద్వారా రాష్ట్రం సాధించు కున్నామన్నారు. సాధించిన తెలంగాణ రాష్ట్రం తొమ్మదేండ్లకాలంలో కేసీఅర్ అద్భుత పరిపాలన తో రాష్ట్రం అనేక రంగాల్లో విజయాలు సాధించి మంచి పరిపాలనధక్షుడని విమర్శకుల ప్రశంసలు పొందారన్నారు. వ్యవసాయ రంగంలో రైతాంగానికి విశ్వాసం కలిగించారని, టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పించామన్నారు. తలసరి ఆదాయం లో దేశంలో రాష్ట్రం నెంబర్ 1 గా ఉందని తెలిపారు. కాకతీయుల కాలంలో వ్యవసాయ రంగంలో వెలుగొందిన జిల్లా ఉమ్మడి రాష్ట్రంలో 70ఏండ్లుగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకు పోయిందని.రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగం లో ఎక్కువ లాభ పడిన జిల్లా నల్గొండ జిల్లా తెలిపారు.రాష్ట్రం ఏర్పడక ముందు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసిన ఉమ్మడి జిల్లా గత 4 సం.లుగా 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేసి దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ గా ఎదిగిందని వివరించారు. ఉపాధితో పాటు, ఉద్యోగం ,వ్యవసాయం, వైద్యం లో, శాంతిభద్రతలు, పారిశ్రామిక రంగం, వ్యవసాయం ఇలా ఒకటేమిటి అన్నిరంగాలు అభివృద్ధిలో ముందున్నాయని, 2014 కు పూర్వం తెలంగాణ, 2014 తర్వాత తెలంగాణను కళ్లకు కట్టినట్టుగా ప్రజలందరికీ తెలియజేపే బాధ్యత ప్రజాప్రతినిధులతో పాటు, అధికారులందరిపై ఉందని అన్నారు. ఉత్సవాలలో భాగంగా రోజువారి నిర్వహించే కార్యక్రమాలపై మంత్రి పలు సూచనలు చేస్తూ ఉత్సవాలను అధికారులు తమదిగా తీసుకొని నిర్వహించాలన్నారు. అన్ని కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులను,రైతాంగం ను,ప్రజలను భాగస్వామ్యం చేయాలని, సంబంధిత శాసన సభ్యులు ఇతర ప్రజాప్రతినిధుల సమ్మతితో,అందరినీ భాగస్వామ్యులను చేస్తూ కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. అన్ని శాఖలు గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని నివేదికల రూపంలో తయారు చేయాలని, ఈ సమాచారం మొత్తం జూన్ రెండు లోపు ప్రజాప్రతినిధులందరికీ సమర్పించాలని ఆదేశించారు. తెలంగాణ రైతు దినోత్సవం మొదలుకొని జూన్ 22 న నిర్వహించే అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి శాఖ ఉత్సవాలను ఒక ఛాలెంజ్ గా తీసుకోవాలని కోరారు. ఆయా శాఖల్లో బాగా పని చేసి ఉత్తమ ప్రతిభ కనబర్చిన అర్హులైన వారికే అవార్డ్ లు, ప్రశంసా పత్రాలు అందచేయాలన్నారు.
నల్గొండ జిల్లా కలెక్టర్ టి.వినయ్ క్రిష్ణా రెడ్డి,యాదాద్రి భువన గిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సూర్యా పేట కలెక్టర్ వెంకట్రావ్, ఎస్పీలు అపూర్వ రావు, రాజేంద్ర ప్రసాద్, డీసీపీరాజేష్ చంద్ర మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇచ్చిన సూచనలు, ఆదేశాలను పాటిస్తూ ఉత్సవాల నిర్వహణ పై తీసుకున్న చర్యలను వివరించారు. అదే విధంగా ఆయా తేదీలలో నిర్వహించనున్న కార్యక్రమాల సందర్భంగా అవసరమైన ఏర్పాటు, ఆయా రోజుల వారి నిర్వహించే కార్యక్రమాలపై అధికారులకు ఇదివరకే ఆదేశించినట్టు తెలిపారు. సమావేశంలో పాల్గొన్న పలువురు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇన్ని రోజులు చేసిన పనిని గొప్పగా చెప్పుకునేందుకు ఇది చక్కటి అవకాశంగా మార్చుకోవాలని, అలాగే ఈ ఉత్సవాలు ప్రజాప్రతినిధులకు కూడా మంచి అవకాశం అని సలహాలు,సూచనలు అంద చేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గొంగిడి సునీత,కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి,రాష్ట్ర గీత కార్మికుల సహకార సంఘం చైర్మెన్ పల్లె రవి కుమార్,రాష్ట్ర గొర్రెల పెంపకం సహకార సంస్థ చైర్మెన్ మేకల బాల రాజు యాదవ్, ట్రై కార్ చైర్మన్ రాం చంద్ర నాయక్,రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, యాదాద్రి భువనగిరి జెడ్పీచైర్మెన్ సందీప్ రెడ్డి,శాసన సభ్యులు రవీంద్ర కుమార్, పైళ్ళ శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు,బోల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య ,నోముల భగత్,నల్గొండ జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ అర్.మల్లికార్జున రెడ్డి, మున్సిపల్ చైర్మెన్లు, ప్రజాప్రతి నిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.