– 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు చర్యలు
– 2లక్షలకు పైగా సామాజిక సంక్షేమ కార్యక్రమాల రద్దు:
అర్జెంటైనా అధ్యక్షుడి ప్రకటన
బ్రూనోఎయిర్స్: రాబోయే మాసాల్లో 70వేల మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించే ప్రణాళికలు వున్నట్లు అర్జెంటైనా అధ్యక్షుడు జేవియర్ మైలీ ప్రకటించారు. ప్రభుత్వ పరిమాణాన్ని గణనీయంగా తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఇక్కడ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, ప్రభుత్వ పనులను నిలిపివేయాలని, ప్రావిన్షియల్ ప్రభుత్వాలకు నిధులను తగ్గించాలని, 2లక్షలకు పైగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలన్నీ అవినీతితో నిండిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏ చర్యలు తీసుకున్నా ఈ ఏడాది ఎంతగానో అవసరమైన ఆర్థిక సమానతను సాధించడమే లక్ష్యంగా ఈ వ్యూహాన్ని రూపొందించినట్లు చెప్పారు. అందులో భాగంగానే ఈ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. అర్జెంటైనాలో 35లక్షలమంది ప్రభుత్వ రంగ ఉద్యోగులు వుండగా, ఇప్పుడు తొలగించేది 70వేల మందినే, అయినా ఈ చర్యలకు శక్తివంతమైన కార్మిక సంఘాల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురవగలదని భయపడుతున్నారు.