టెన్త్‌ పరీక్షల సిబ్బందిలో నలుగురిపై వేటు

– ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు కృష్ణారావు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా గురువారం ఆరోరోజు బయలాజికల్‌ సైన్స్‌ పరీక్షను నిర్వహించామని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షకు రెగ్యులర్‌ విద్యార్థులు 4,95,146 మంది దరఖాస్తు చేస్తే, 4,93,741 (99.72 శాతం) మంది పరీక్ష రాశారని పేర్కొన్నారు. 1,405 (0.28 శాతం) మంది గైర్హాజరయ్యారని వివరించారు. ప్రయివేటు విద్యార్థుల్లో 7,524 మంది దరఖాస్తు చేసుకుంటే, 6,587 (87.55 శాతం) పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 937 (12.45 శాతం) మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఆరోరోజు ఒక్క విద్యార్థిపై మాల్‌ప్రాక్టీస్‌ కేసును నమోదు చేశామని వివరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పదో తరగతి పరీక్షల సిబ్బందిలో నలుగురిపై వేటు వేశామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడేం జిల్లాలో ఒక చీఫ్‌ సూపరింటెండెంట్‌, ఒక డిపార్ట్‌మెంటల్‌ అధికారి, కరీంనగర్‌ జిల్లాలో ఒక ఇన్విజిలేటర్‌, సంగారెడ్డి జిల్లాలో ఒక ఇన్విజిలేటర్‌ను విధుల నుంచి తొలగించామని పేర్కొన్నారు. ఈ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

Spread the love