సాగునీరు లేక ఎండుతున్న పంటలు

– ఆదుకోవాలని బాధిత రైతుల వేడుకోలు
నవతెలంగాణ-గోవిందరావుపేట
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలోని లక్నవరం చెరువుకోట కాలువ రబీ తైబందీ ఆయకట్టు చివరి భూములకు సాగు నీరందక వేసిన పంటలు ఎండి పోతున్నాయి. 163వ జాతీయ రహదారి పెట్రోల్‌ బంక్‌ వెంబడి కోట కాలువ ఆయకట్టు సుమారు 50 ఎకరాల పైబడి ఉంది. ప్రస్తుతం నీరు అందక రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. సాగునీరు అందించి ఆదుకోవాలని బాధిత రైతులు వేడుకున్నారు. కాలువలు శుభ్రం చేసుకోవాలంటూ అధికారులు సలహాలిస్తే ఎకరానికి రూ.1000 చొప్పున సొంతంగా కాలువలను శుభ్రం చేసుకున్నారు. అయినా పంటలకు నీరు వదలకుండా మంత్రి చెప్పిందంటూ నీటిని వాగుకు వదులుతున్న పరిస్థితి. ఈ క్రమంలో తైబందీ ప్రకటించకుండా ఉంటే బాగుండేదని రైతులు పేర్కొంటున్నారు. వర్షాకాలం నీళ్లకు వేల రూపాయలు పెట్టి కాలువలు బాగు చేసుకున్నామని, మళ్లీ యాసంగికి వేలకు వేలు పెట్టి కాలువలు బాగు చేసుకుంటున్నామని వాపోతున్నారు. కానీ, ప్రభుత్వం కాంట్రాక్టర్ల పేరు మీద బిల్లులు చేసి పర్సంటేజీలు తీసుకుంటూ రైతుల నోట్లో మట్టి కొడుతోందని ఆరోపిస్తున్నారు. గతంలో ఒకసారి మొరపెట్టుకుంటే నీటిని విడుదల చేసిన అధికారులు ఇప్పుడు తమ గోడును పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈని వివరణ కోరగా.. నీటిని విడుదల చేశామని, సాయంత్రంలోగా నీరు అందుతుందని చెప్పారు. తీరా రైతులు అక్కడకు వెళితే సద్దిమడుగు తూములు బంద్‌ చేసి జేసీబీ సహాయంతో దయ్యాలవాగుకు నీటిని వదులుతున్నారని ఇది ఎంతవరకు న్యాయమని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సాగునీరందించి తమను ఆదుకోవాలని ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు.
రైతులను ఆదుకోవాలి : మోపిదేవి రామకృష్ణ, బాధిత రైతు
తైబందీ ప్రకటించింది అధికారులే. ఆలస్యంగా నీటిని విడుదల చేసింది అధికారులే.. పైగా ప్రస్తుతం సరిపడా నీటిని విడుదల చేయలేక చేతులెత్తేస్తున్నారు. అక్రమ సాగును అరికట్టలేకపోతున్నారు. వేలకు వేల రూపాయల పెట్టుబడి పెట్టి పొట్టకు వచ్చిన పంటను ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి దాపురించింది. గతంలో వ్యవసాయం చేయాలన్న సంతోషం ఉండేది. ఇప్పుడు వ్యవసాయం చేయాలంటేనే భయం వెంటాడుతోంది. పంటలు ఎండినా పరవాలేదు కాని, దయ్యాలవాగుకు నీరు వదలబోమని చెప్పడం సమంజసం కాదు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి సాగునీరందించి తమను ఆదుకోవాలి.

Spread the love