ఆర్థిక ఇబ్బందులతో.. దంపతుల ఆత్మహత్య

– మరో ఘటనలో బాసరలో రైలుకింద దూకి.. ప్రేమజంట ఆత్మహత్య
నవతెలంగాణ-కంఠేశ్వర్‌
నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని కంఠేశ్వర్‌లో ఆర్థిక ఇబ్బందులతో దంపతులు, మరో ఘటనలో ఓ ప్రేమ జంట ఆత్మ హత్యలకు పాల్పడటం కలకలం సృష్టించాయి. నిజామాబాద్‌ నగరానికి చెందిన దంపతులు కర్నాటకలోని ఓ లాడ్జిలో గురువారం రాత్రి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ మేరకు నిజామాబాద్‌ పోలీసులకు కర్నాటక పోలీసులు ప్రాథమిక సమాచారం అందించారు. అప్రమత్తమైన నాల్గవ పోలీస్‌ స్టేషన్‌ అధికారులు విచారణ చేపట్టారు. మృతులు గాయత్రీ నగర్‌ ప్రాంతానికి చెందిన మేడవరపు రాజు(55), మేడవరపు స్వాతి(53)గా పోలీసులు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కర్నాటకలోని కొడగు జిల్లా సోమవార్‌ పేట్‌ పరిధిలోని లాడ్జిలో సూసైడ్‌ చేసుకున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
నిజామాబాద్‌ నగరానికి చెందిన సూరం శ్రీకాంత్‌(28), నందిత(20) నిర్మల్‌ జిల్లా బాసరలోని రైల్వే స్టేషన్‌ సమీపంలో రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాంత్‌.. స్థానిక విశ్వభారతి పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. సీతారాంనగర్‌ కాలనీకి చెందిన నందిత.. నిశిత కళాశాలలో డిగ్రీ సెకండియర్‌ చదువుతోంది. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టు తెలిసింది. అయితే సూసైడ్‌కు గల కారణాలు తెలియాల్సి ఉందని రైల్వే ఎస్‌ఐ సాయారెడ్డి తెలిపారు. ఇద్దరి మృతితో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

Spread the love