మోడీ పాలనలో గ్రామీణ కార్మికుల దుస్థితి

మోడీ పాలనలో గ్రామీణ కార్మికుల దుస్థితివ్యవసాయ కార్మికుల నిజ వేతనాలలో కాని, తక్కిన గ్రామీణ కార్మికుల నిజ వేతనాలలో కాని 2014 -2023 మధ్య పదేళ్ళ కాలంలో ఎటువంటి వాస్తవ పెరుగుదలా నమోదు కాలేదన్న వాస్తవాన్ని అనేకమంది అధ్యయనకారులు చేసిన తాజా పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. వ్యవసాయ కార్మికుల వినిమయసూచీని, గ్రామీణ కార్మికుల వినిమయ సూచీని పరిగణనలోకి తీసుకుని, ఆ సూచీలలో వచ్చిన ధరల పెరుగుదలకు అనుగుణంగా గ్రామీణ కార్మికుల వేతనాలలో పెరుగుదల వచ్చిందా అన్న విషయాన్ని వారు పరిశోధించారు.
అయితే ఇక్కడో సమస్య ఉంది. ఆ రెండు సూచీలూ 1986-87 సంవత్సరాన్ని ప్రాతిపదికగా తీసుకుని రూపొందించినవి. అంటే, 1986-87 నాటికి, దాదాపు 40 ఏండ్ల క్రితం నాటి, వినిమయం ఉండిన తీరునే ఇప్పుడు కూడా ఉంటుందన్న ప్రాతిపదికన లెక్కలు వేసినవి. కాని, ఈ 40 సంవత్సరాల కాలంలోనూ ప్రజల వినిమయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ మార్పుల్ని పరిగణనలోకి తీసుకోకపోతే ఈ తరగతుల ప్రజల మీద ధరల పెరుగుదల ప్రభావం ఎంత మోతాదులో ఉందో సరైన అంచనాకు రాలేము. అందుచేత సమీప కాలంలోని వినిమయ ధోరణుల్ని వ్యక్తం చేసే ప్రాతిపదికను ఎంచుకోవడం మంచిది. అయితే ప్రభుత్వం 2010 ప్రాతిపదికన కొత్త సూచీని రూపొందించింది. కార్మికుల వేతనాల మీద ధరల పెరుగుదల వాస్తవ ప్రభా వం ఎంత ఉంటుందో, దానికన్నా తక్కువ చేసి చూపించడం దీని వెనుక ప్రధాన ఉద్దేశ్యం. అయినప్పటికీ ఆ 2010నే ప్రాతిపదికగా తీసుకుని చూస్తే అప్పుడు కూడా గ్రామీణ కార్మికుల నిజ వేతనాలలో పెరుగుదల ఏమీ లేదు సరికదా స్వల్ప తగ్గుదల నమోదైంది. ఉదాహరణకి, 2014-2023 మధ్య కాలంలో పొలాలను దున్నే కార్మి కుల నిజవేతనాలు 2.7 శాతం తగ్గిపోయాయి. ఇదేమాదిరిగా తక్కిన వ్యవసాయ పనులకు చూసినా, తగ్గుదలే కనిపిస్తోంది తప్ప పెరుగుదల లేదు. దీనిని బట్టి గత దశాబ్ద కాలంలో గ్రామీణ కార్మికుల నిజవేతనాలు తగ్గిపోయినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
ఈ ప్రభుత్వం తీరును కొట్టొచ్చినట్టు చూపించే విషయం ఇది. గతంలో ఏ ప్రభుత్వమూ జీడీపీ వృద్ధి రేటు గురించి మోడీ ప్రభుత్వం చేసినంత ప్రచారం, హడావుడి చేయలేదు. నిజానికి ఈ జీడీపీ కూడా గత ప్రభుత్వాల కాలంతో పోల్చితే మోడీ హయాంలో తక్కువ వృద్ధిరేటునే నమోదు చేసింది. ఎప్పుడు చూసినా భారతదేశ ఆర్థికవ్యవస్థ 5 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుతోందంటూ మోడీ వల్లిస్తున్నా డు. అతడి భజన బృందాలైతే ఇప్పటికే ఆ 5 లక్షల కోట్ల స్థాయిని దాటేసిందని భావిస్తున్నారు. ఈ జీడీపీ వృద్ధి వ్యామోహంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఈ దేశ జనాభాలో అత్యంత పేదలుగా ఉన్న తరగతి- అంటే, గ్రామీణ కార్మికుల జీవన ప్రమాణాలు వాస్తవంగా దిగజారి పోతున్నాయి అన్న వాస్తవం కనిపించడం లేదు.
అంతే కాదు, అధ్యయన బృందం మరొక విషయాన్ని కూడా నిర్ధారించింది. 2014 నాటికే అమలులో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి హామీ పథకం, గర్భిణుల సంరక్షణ పథకం, సామాజిక భద్రతా పింఛన్లు, అంగన్వాడీ పథకం, మధ్యాహ్న భోజన పథకం వంటి ఐదు సంక్షేమ పథకాలను ఎన్డీయే ప్రభుత్వం దెబ్బ తీసింది. 2011 తర్వాత జనాభా లెక్కల సేకరణ జరగలేదు. బీజేపీ ప్రభుత్వం దానిని నిలిపివేసింది. దానివలన కొత్తగా జనాభాలో ఈ కాలంలో చేరిన కోట్లాదిమంది నిరుపేదలు ప్రభుత్వ లెక్కల్లో లేరు. వారందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రయోజనాలు అందడం లేదు. ఉపాధి హామీ పథకం కింద చెల్లించే వేతనాలలో పెరిగిన ధరలకు అనుగుణంగా ఏ విధమైన పెరుగుదలా లేదు. పైగా చేసిన పనులకు చెల్లించవలసిన వేతనాల బకాయిలే నెలల తరబడి పేరుకుపోయాయి. కేంద్ర ప్రభుత్వం వృద్ధులకు చెల్లించే పింఛను ఎప్పటినుంచో ఆ రు.200 దగ్గరే నిలిచిపోయింది. గర్భిణులకు వర్తించే సంక్షేమ పథకం ఒక బిడ్డ వరకు మాత్రమే పరిమితం చేశారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకాలకు బడ్జెట్‌ కేటాయింపుల్లో 40శాతం కోత పెట్టారు.
మొత్తంగా చూసుకుంటే మోడీ పాలనాకాలంలో గ్రామీణ కార్మికుల నిజవేతనాలు తగ్గిపోవడమే కాక, వారికి వర్తించే సంక్షేమ పథకాలలో కూడా కోతలు పడ్డాయి. కరోనా కాలంలో ప్రతీ కుటుంబానికి 5 కిలోల ఉచిత బియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశ పెట్టిన మాట నిజం. అది నేటికీ కొనసాగుతోంది. అయితే దాని వలన కలిగే ఫలితం చాలా స్వల్పం. వేతనాల తరుగుదల, సంక్షేమం లో కోత ప్రభావం చాలా ఎక్కువ.
నిజానికి స్వతంత్రం వచ్చిన తర్వాత, గ్రామీణ కార్మికుల నిజవేతనాల్లో ప్రతీ ఏడూ ఎంతో కొంత పెరుగుదల ఉంటూ వచ్చింది. 2014-15 నుంచీ మాత్రం అది తిరుగు ముఖం పట్టింది. కొంతకాలం ఏ పెరు గుదలా లేకుండా స్తబ్దంగా ఉండి, చివర్లో ఏకంగా తగ్గడం ప్రారంభించింది. మోడీ ప్రభుత్వం పలు అవకతవక ఆర్థిక విధానాలను అనుసరించింది. పెద్ద నోట్ల రద్దు అటువంటి చర్యల్లో ఒకటి. దాని వినాశకర ప్రభావం గ్రామీణ పేదలమీద ఆ తర్వాత కాలంలో స్పష్టంగా కనిపించింది. అదే మాదిరిగా జిఎస్‌టిని ప్రవేశపెట్టడం కూడా మరో చర్య. దానివలన చిన్న ఉత్పత్తి వ్యవస్థలమీద చాలా ప్రతికూల ప్రభావం పడింది. దాని ఫలితంగా నిరుద్యోగం కూడా పెరిగింది. దాని వలన నిజవేతనాలలో పెరుగుదల లేకుండా పోయింది. కోవిడ్‌-19 కాలంలో విధించిన దారుణమైన లాక్‌డౌన్‌ మరొక వినాశకర చర్య. దీని ఫలితంగా ఉత్పత్తి పూర్తిగా దెబ్బతింది. నిరుద్యోగం పెరిగింది. నిజవేతనాలు ఎక్కువ మోతాదులో పడిపోయాయి. అయితే, అంతకు ముందు నుండే, అంటే, 2014 నుండీ గ్రామీణ కార్మికుల వేతనాలలో పెరుగుదల లేకుండా పోడానికి కారణం ఏమిటి?
నయా ఉదారవాద వ్యవస్థలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం దీనికి ప్రధాన కారణం. 2008లో అమెరికాలో బద్దలైన రియల్‌ ఎస్టేట్‌ బుడగ ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించింది. అయితే, అప్పటికి అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వం ప్రభుత్వ వ్యయాన్ని పెంచే దిశగా కొన్ని చర్యలు తీసుకుంది. దానివలన ఆ సంక్షోభ ప్రభావం మన దేశం మీద తక్కువగా పడింది. ఐతే, 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆ విధానాన్ని పూర్తిగా మార్చేసింది. నయా ఉదారవాదం కోరుకున్నట్టు ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించింది. దాని ఫలితంగా దేశ స్థూల డిమాండు స్థాయి దెబ్బతింది. దాని పర్యవసానంగా దేశంలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయి. ఆర్థిక వ్యవస్థకు తగిలిన దెబ్బ ప్రభావం గ్రామీణ భారతం మీదనే అత్యధికంగా పడింది. గ్రామీణుల నిజవేతనాలు పడిపోయాయి.
నిజ వేతనాలు తగ్గిపోవడం, ఉపాధి అవకాశాలు పడిపోవడం అనే ఈ రెండు ధోరణులూ ఒకదానిని ఇంకొకటి ప్రకోపింపజేస్తాయి. నిరుద్యోగం తక్కువగా ఉంటే, వేతనాలు పడిపోవు. ఎంతో కొంత పెరుగుతాయి. నిజవేతనాలు పడిపోతున్నాయి అంటే అదే కాలంలో నిరుద్యోగం కూడా పెరుగుతోందన్న మాటే. అంటే ఏక కాలంలో గ్రామీణ పేదలు అటు నిజవేతనాల్లో తగ్గుదలను, ఇటు నిరుద్యోగం పెరుగుదలను చవిచూడవలసి వస్తోందన్నమాట. రోజు కూలీ రేటు నిజవిలువ తగ్గడమే గాక. పనులు దొరికే రోజుల సంఖ్య కూడా తగ్గిపోతోందన్నమాట. అంటే వారి వేతనాల నిజ విలువ మాత్రమే గాక, వారికి లభించే నిజ ఆదాయాలు కూడా పడిపోతున్నాయి. దీనికి తోడు సంక్షేమ పథకాలలో కూడా కోత పడుతోంది. ఇదంతా కలిపి చూస్తే గ్రామీణ పేదలు అనుభవించే పరిస్థితులు ఎంత దుర్భరంగా మారుతున్నాయో పూర్తి చిత్రం కనిపిస్తుంది.
బీజేపీ పాలన వర్గ స్వభావం ఎంత ప్రజా వ్యతిరేకమో ఇప్పుడు స్పష్టంగా తెలుస్తున్నది. ఈ దశాబ్ద కాలపు మోడీ పాలనలో దేశంలోని గుత్త పెట్టుబడిదారీ కార్పొరేట్లు, అందునా ముఖ్యంగా మోడీకి అత్యంత ప్రీతిపాత్రులైన కొత్త బడా కార్పొరేట్లు ఎంతగా తమ సంపదలను పెంచుకున్నారో, ఆదాయాల్లో, సంపదలో అసమానతలు ఎంతగా పెరిగిపోయాయో మనం చూస్తున్నాం. బ్రిటిష్‌ పాలన కాలంలోని మహారాజులకు, అప్పటి సామాన్యులకు మధ్య ఉండిన ఆర్థిక అసమానతల కన్నా ఇప్పుడు దేశంలోని అత్యధిక సంపన్నులైన ఒక శాతం జనాభాకి, తక్కిన 99 శాతం జనాభాకి మధ్య అసమానతలు ఎంతో ఎక్కువ. ఇందులో అందరికన్నా ఎక్కువగా నలిగిపోత్నుది మన గ్రామీణ పేదలే.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ పట్నాయక్‌

Spread the love