ఆడది అబల కాదు సబల అంటూనే

ఏనాడైనా ఆమెకు బలాన్ని నిరూపించుకునే అవకాశాన్నిచ్చావా..?

ఆకాశంలో సగమంటావు
అవనిలో అర్థభాగం నువ్వేనంటావు
ఆమెను ఆకాశానికి ఉరేసి,
పాతళంలో కప్పెట్టేది నువ్వే..!!

పసిమొగ్గ పువ్వై పరిమళించాలని కోరుకునే నువ్వు
పసికందుని మాత్రం
మొగ్గ దశలోనే తుంచడానికి పూనుకుంటావు

ఒక పొగడ్తనో మరొక బెదిరింపునో
ఎరగా వేసి,
భౌతిక దేహాన్ని ఆస్వాదించి
ఆడపిల్లల ప్రాణాలు తీస్తావు

తోడుకి ఆడది కావాలి కానీ,
నీ మూలాలతో జన్మించే ఆడపిల్ల వద్దా..?

స్త్రీని దేవతలా కొలిచే
ఈ పుణ్యభూమిలో
ఇంతటి అమానుషమెందుకు..?

వాళ్ళకి అవకాశమిస్తే
నింగిని చీల్చుకుంటూ దూసుకెళ్తారు
మరి అడుగడుగునా తొక్కేయడమెందుకు..?!

అందమైన ఆడపిల్లని
భ్రమరాన్నై బతుకంతా గడపాలనుకున్నా
హరివిల్లునై అందలాన మెరవాలనుకున్నా

బయట ఆమె
చేయాల్సిన యుద్ధం చాలా ఉంది
ఆమెకు తోడుగా సిపాయిల్లా నివాల్సింది పోయి
యుద్ధం మొదలు కాకముందే
విత్తురూపంలోనే తుంచేస్తే ఎలా.?

కడుపులోనే పిండాన్ని చిదిమేస్తే
మానవ సృష్టికి మూలమెక్కడీ
ఈ అవనిలో అభివృద్దెక్కడీ

మనిషికి జన్మనిచ్చే ఆడజాతి మనుగడకే
జన్మ లేకుండా చేస్తే
ఈ భూమిపై మానవజాతికి నూకలు చెల్లిపోవూ!?
– ఎన్‌. లహరి, 9885535506

Spread the love