మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి

Working together to prevent drug addiction– నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా కమిటీ సమావేశంలో కలెక్టర్
– టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు సమాచారం అందించాలని పిలుపు
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాల నిరోధానికి కలిసికట్టుగా కృషి చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం కలెక్టర్ అధ్యక్షతన నషా ముక్త్ భారత్ అభియాన్ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ  సమావేశం జరిగింది. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి పద్మావతి, సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులు, కమిటీ ప్రతినిధులు పాల్గొని, జిల్లాలో మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా తదితర అంశాలపై కూలంకషంగా చర్చించారు. వాటి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కమిటీ సభ్యులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ, మాదకద్రవ్యాల రవాణా, వినియోగం పెను సవాలుగా మారిందని అన్నారు. యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్న మత్తు పదార్థాలు రవాణా, వినియోగం జరుగకుండా అందరూ కలిసికట్టుగా కృషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఇది కేవలం ప్రభుత్వ యంత్రాంగాల బాధ్యత అని భావించకుండా సమాజంలోని వివిధ వర్గాల వారందరూ మాదకద్రవ్యాల నిరోధానికి తమవంతు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. ఎక్కడైనా మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల రవాణా, వినియోగం, వాటితో ముడిపడిన కార్యకలాపాలను గమనిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. టోల్ ఫ్రీ నెంబర్ 14446 కు కాల్ చేసి కూడా సమాచారం తెలుపవచ్చని సూచించారు. సమాజానికి పెను ప్రమాదకరంగా మారిన మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలకు అలవాటు పడి వాటికి బానిసలుగా మారిన వారు వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నష్టపోతారని చెప్పారు. మాదకద్రవ్యాల వినియోగంతో దుష్పరిణామాలపై యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృతస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు ఆర్మూర్, బోధన్ వంటి పట్టణాలలోనూ క్రమం తప్పకుండా అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. జనసంచారంతో కూడుకుని ఉండే ప్రదేశాలలో వాల్ రైటింగ్, పెయింటింగ్ ల ద్వారా మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలని అన్నారు.
కళాజాత బృందాలచే   గ్రామగ్రామాన ప్రదర్శనలు నిర్వహించాలని, సామాజిక మాధ్యమాలు, సినిమా థియేటర్ లలో షార్ట్ ఫిలింలు ప్రదర్శింపజేయాలని సూచించారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా మాదకద్రవ్యాల వినియోగం జరుగుతోందని అన్నారు. జిల్లాలో గంజాయి వినియోగం, రవాణాపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ కఠిన చర్యలు చేపడుతుండడం వల్ల పరిస్థితిలో కొంతవరకు వినియోగం తగ్గిందని తెలిపారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతాల నుండి నిజామాబాద్ మీదుగా మహారాష్ట్ర, గుజరాత్ తదితర రాష్ట్రాలకు గంజాయి రవాణా చేస్తుంటారని, ఈ అక్రమ రవాణాను అరికట్టేందుకు గట్టి నిఘా కొనసాగిస్తున్నామని అన్నారు. ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించి, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాలను పూర్తిగా నిరోధించేలా అన్ని వర్గాల వారు తోడ్పాటును అందించాలని కోరారు. సమావేశంలో జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ అధికారిణి రసూల్ బీ, జిల్లా ఇంటర్ విద్యాధికారి రవికుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ తుకారాం రాథోడ్, విద్య శాఖ పరీక్షల నియంత్రణ విభాగం అధికారి విజయభాస్కర్, ప్రభుత్వ  జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమరాజ్, ఎన్.వై.కే సమన్వయకర్త శైలి బెల్లాల్, కమిటీ సభ్యులైన మానసిక వైద్య నిపుణులు ఏ.విశాల్, బి.కేశవులు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ప్రతినిధి రామ్మోహన్ రావు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
Spread the love