ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ హత్యకు కుట్ర

– 50 లక్షలకు సుపారీ, అడ్వాన్స్‌గా 17.5 లక్షలు
– కుట్రలో మరో ఇంజనీరింగ్‌ కళాశాల చైర్మన్‌
నవతెలంగాణ-కోదాడరూరల్‌
పట్టణంలో ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ను హత్య చేయించటానికి మరో ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌తో పాటు మరికొందరు 50 లక్షల సుపారీ ఇచ్చి డీసీిఎంతో గుద్ది చంపేలా ప్లాన్‌ చేసుకున్న సంఘటన పట్టణంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెం గ్రామంలోని గేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ కాంతారావుపై దాదాపు ఒక వారం నుండి రెక్కీ నిర్వహించిన తర్వాత ఈ నెల 19 న మునగాల మండలం మొద్దుల చెరువు స్టేజి సమీపంలో సూర్యాపేట నుండి కారులో వస్తున్న బుద్దె కాంతారావును సుపారీ తీసుకున్న వ్యక్తులు డీసీిఎంతో కారును ఢ కొట్టాలని చూడగా విఫలం అవ్వడంతో అదే రోజు రాత్రి మరోసారి బాబునగర్‌ వద్ద ప్రయత్నించి విఫలమయ్యారు. దీనితో నిందితులను స్థానికులతో కలసి పట్టుకున్న కాంతారావు పట్టాణ పోలీసులకు అప్పగించి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మొత్తం 12 మందిని నిందితులుగా పేర్కొన్నారు. వారిలో ఏడుగురిని మామిళ్ళగడ్డ గ్రామానికి చెందిన కోర్ర రామ్‌కుమార్‌, చివ్వెంలా మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన బైరు వెంకటేశ్వర్లు అనే ఇద్దరు డ్రైవర్లు, సూర్యాపేట మండలం శాంతినగర్‌కు చెందిన పెండ్ర రాము, చిలుకూరు మండలం పోలేనిగూడెం గ్రామానికి చెందిన బాధె లింగయ్య, సూర్యాపేటకు చెందిన తొగరు శ్రీనివాస్‌రావు, కేతేపల్లి మండలం చీకటిగూడెం బుడ్డే రామ్మూర్తి, కోదాడకు చెందిన కిట్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల కరస్పాండెంట్‌ నీల సత్యనారాయణ అదుపులో ఉండగా అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. చందా కోటేష్‌, పోకల శ్రీనివాసరావు, బాదె రాజారావు, బాదె ఆంజనేయులు, గన్న నాగేశ్వరరావులు పరారీలో ఉన్నారు. వీరిలో ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నట్లు సమాచారం. వీరి వద్ద నుండి 5 లక్షల రూపాయల డబ్బులు, ఒక డిసిఎం వ్యాన్‌ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీరిపై 120బీ, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Spread the love