బీమా కొరేగావ్‌ కేసు

–  వెర్నాన్‌ గోన్సాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరాలకు బెయిల్‌
న్యూఢిల్లీ : బీమా కొరేగావ్‌ కేసులో నిందితులు వెర్నాన్‌ గోన్సాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరాలకు సుప్రీంకోర్టు శుక్రవారం బెయిల్‌ మంజూరు చేసింది. ఈ నిందితులిద్దరూ ఐదేళ్ల నుంచి జైలులో ఉన్నారని, వీరిపై నమోదైన అభియోగాలు తీవ్రంగా ఉన్నా.. బెయిల్‌కు అర్హమైనవే అని జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. వెర్నాస్‌ గోన్సాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరా 2018 ఆగస్టు నుంచి జైలులో ఉన్నారు. వీరిపై చట్ట వ్యతిరేక కార్యక్రమాలు (నిరోధక) చట్టం (ఉపా) 1967 కింద అభియోగాలు నమోదయ్యాయి. నిందితులు ఐదేళ్ల నుంచి జైలులో ఉన్న పరిగణనలోకి తీసుకుని బెయిల్‌ విజ్ఞప్తిని అంగీకరిస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది. అభియోగాలు తీవ్రంగా ఉన్నా. ఆ కారణంతో బెయిల్‌ను నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఎన్‌ఐఎ చేసిన అభియోగాలను ప్రస్తావిస్తూ.. కేసు తీర్పు వచ్చే వరకూ నిందితులకు నిరంతర నిర్భంధాన్ని సమర్థించలేమని తెలిపింది. అలాగే బెయిల్‌ మంజూరు చేస్తూ కొన్ని షరతులను విధించింది. ట్రయల్‌ కోర్టు అనుమతి లేకుండా నిందితులు మహారాష్ట్ర విడిచి వెళ్లకూడదని ఆదేశించింది. అలాగే పాస్‌పోర్టులను అప్పగించాలని, చిరునామాలను ఎన్‌ఐఎ విచారణ అధికారికి తెలియచేయాలని పేర్కొంది. నిందితులిద్దరికీ మొబైల్‌ ఫోన్లు ఇవ్వబడుతుందని, ఈ ఫోన్లు ఎల్లప్పుడూ ఆన్‌ చేసి ఉంచాలని, లోకేషన్‌ స్టేటస్‌ను 24 గంటలూ యాక్టివ్‌గా ఉంచాలని ఆదేశించింది.2017 డిసెంబరు 31న పూణేలో జరిగిన ఎల్గార్‌ పరిషత్‌ సమావేశం, మరుసటి రోజున బీమా-కొరేగావ్‌ యుద్ధ స్మారకం వద్ద అల్లర్లు నేపథ్యంలో
ఈ కేసు నమోదయింది. వెర్నాన్‌ గోన్సాల్వేస్‌, అరుణ్‌ ఫెరీరాల తోపాటు సుధా భరద్వాజ్‌, పి.వరవరరావు, గౌతమ్‌ నవ్లఖాలపై అభియోగాలు మోపి పుణే పోలీసులు అరెస్టు చేశారు.

Spread the love