– మధుబన్‌కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సిబ్బంది కొరత
– సరిపడా లేని తరగతి గదులు
– ఒకే తరగతి గదిలో రెండు క్లాసుల విద్యార్థులు
– వరండాలో తరగతుల బోధన
– మౌలిక వసతులు కూడా కరువు
– విద్యాశాఖ మంత్రి ఇలాఖాలో
ఈ దుస్థితి సిబ్బందిని నియమించాలని కోరుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు
‘విద్యాశాఖ మంత్రి ఇలాఖా అంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో మెరుగ్గా ఉంటాయని అనుకుంటాం. పిల్లలకు మెరుగైన విద్య అందుతుందని భావిస్తాం. సొంత జిల్లా కాబట్టి ఇతర పాఠశాలల కంటే ఎక్కువ మొత్తంలో సిబ్బంది ఉంటారని భావిస్తాం..’ కానీ రంగారెడ్డి జిల్లాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది కొరత, మౌలిక వసతుల లేమి కొట్టొచ్చేటట్టు కనిపిస్తోంది. ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ పాఠశాలలు మాత్రం సమస్యల వలయంలో కొట్టుమిట్టడుతున్నాయి. విద్యాశాఖ మంత్రి జిల్లాలోనే పరిస్థితి ఈ విధంగా ఉందంటే.. ఇతర పాఠశాలల పరిస్థితి ఏ విధంగా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
నవతెలంగాణ-రాజేంద్రనగర్
పాఠశాలలో ఇద్దరే ప్రభుత్వ ఉపాధ్యాయులు
ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కేవలం ఇద్దరూ ఉపాధ్యాయులు మాత్రమే పని చేస్తున్నారు. ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉన్న ఈ పాఠశా లలో ఇద్దరి ఉపాధ్యాయులు పనిచేయడం సిగ్గుచేటు. 178 మంది విద్యార్థులకు కేవలం ఆ ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే బోధి స్తున్నారు. ఇందులో ఒక ఉపాధ్యాయుడు సెలవు పెడితే ఒక్కడే పాఠశాల మొత్తం నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇద్దరూ ఉపాధ్యాయులు రెండు క్లాసులలో చెబి తే.. మిగతా మూడు క్లాసుల విద్యార్థులు ఖాళీగా కూర్చుం టున్నారు. ఐదవ తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో కనీసం ఆరు మంది ఉపాధ్యా యులు ఉండాలి కానీ ఇద్దరు ఉపాధ్యాయులతో ఇక్కడ పాఠశాల నడవడం వలన విద్యా ర్థులకు నాణ్యమైన విద్య లభించడం లేదు. ఇదిలా ఉంటే మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులు ఎక్కువగా ఉన్న పరిస్థితి నెలకొంది.
తరగతి గదుల కొరత :
ఈ ప్రాథమిక పాఠశాలలో తరగతి గదుల కొరత వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పాఠశాలలో కేవలం నాలుగు గదులు మాత్రమే ఉన్నాయి. ఒక తరగతి గదిలో రెండు క్లాసుల విద్యార్థులను కూర్చోబెట్టి బోధిస్తున్నారు. దీనివలన ఇతర విద్యార్థులకు ఇబ్బంది ఏర్ప డుతోంది. కొంతమంది విద్యార్థులను బయట వరండాలో కూర్చోబెడుతున్నా రు. వర్షాకాలంలో వరండా బయట కూర్చోవడానికి వి ద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థు లు కూర్చోవడానికి బెంచీలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేవు. ప్రభుత్వం ఇస్తు న్న యూని ఫాంలో కూడా ఒక జత మాత్రమే ఇప్పటి వరకు ఇచ్చారు. హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు కూర్చోవడానికి కూడా గదు లు లేవు. అదేవిధంగా పాఠశాలకు వాచ్మెన్, సఫాయి కార్మికు డు కూడా లేడు. పాఠశాలలో ఎలాంటి పారిశుధ్య సమస్య లు వచ్చినా ఆ ఇద్దరూ ఉపాధ్యాయులే చేసుకుంటు న్నారు. టాయిలెట్లు కూడా కొన్ని సార్లు ఉపాధ్యాయులు శుభ్రం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వెంటనే ఉపాధ్యాయులను నియమించాలి
ఈ పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయుల నియమించా లి. విద్యార్థులు చదువు బాగా నష్టపోతు న్నారు. బాల్యంలో పునాదులు గట్టిగా ఉంటే భవిష్యత్తులో విద్యార్థులు దూ సుకుపోతారు. ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి. ఈ విషయంలో విద్యాశాఖ మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి. వెంటనే ఇక్కడ నలుగురు ఉపాధ్యాయులను నియమిం చాలి.
– అజరు, విద్యార్థిని తండ్రి
నూతన తరగతి గదులను నిర్మించాలి
ఐదు క్లాసులు ఉన్న పాఠశాలలో కేవలం నాలుగు గదులే ఉన్నాయి. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క తరగతి గదిలో రెండు క్లాసుల విద్యార్థులను కూర్చోబెడుతున్నారు. ఉపాధ్యాయుడు ఒక క్లాస్‌కు బోధిస్తుంటే మిగతా విద్యార్థులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వరండాలో విద్యార్థులు కూర్చోవడం వలన వర్షాకాలంలో విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్నా రు. అధికారులు స్పందించి వెంటనే నూతన తరగతి గదులను నిర్మించాలి.
– రాజు, విద్యార్థిని తండ్రి
రాజేంద్రనగర్ నియోజకవర్గం మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని మధుబన్‌కాలనీ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సమస్యలు నిలయంగా మారింది. ఈ పాఠశాలల్లో స్థానికంగా పరిశ్రమల్లో పని చేసే కార్మికుల పిల్లలే ఎక్కువగా చదువుతున్నారు. ఈ పాఠశాలలో కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇద్దరు మాత్రమే పని చేస్తున్నారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో తరగతులు గదులు కూడా లేవు. ఈ విషయమై ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం శూన్యం.