తెలంగాణలో వరద నష్టాన్ని పూడ్చండి

Cover the flood damage in Telangana– పది లక్షలకు పైగా పంట నష్టం
– కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖ : మీడియాతో హన్నన్‌ మొల్లా, బి. వెంకట్‌
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
తెలంగాణలో వరద నష్టాన్ని పూడ్చాలని ఏఐకేఎస్‌ ఉపాధ్యక్షులు హన్నన్‌ మొల్లా డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌కు హన్నన్‌ మొల్లా (ఏఐకేఎస్‌), బి.వెంకట్‌ (ఎఐఏడబ్ల్యూయూ) సంయుక్తంగా లేఖ రాశారు. అనంతరం ఏపీ, తెలంగాణ భవన్‌లో హన్నన్‌ మొల్లా మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఇటీవలి వచ్చిన వరదలతో పది జిల్లాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. తాగునీటి సమస్య ఏర్పడిందని, రోడ్లు కొట్టుకుపోయాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని వరద సాయాన్ని అందించాలని డిమాండ్‌ చేశారు. పది లక్షలకు పైగా పంట నష్టం జరిగిందని, 40 మంది చనిపోయారని తెలిపారు.
ఎకరాకు రూ.20 వేలు నష్టపరిహారం ఇవ్వాలి
ఎకరాకు రూ.20 వేలు నష్ట పరిహారం ఇవ్వాలని ఎఐఏడబ్ల్యూయూ ప్రధాన కార్యదర్శి బి.వెంకట్‌ డిమాండ్‌ చేశారు. వరదల వల్ల తెలుగు రాష్ట్రాలు భారీగా నష్టపోయాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు రాష్ట్రాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలోనే అధికంగా వరి పండించే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన వరదల గురించి కేంద్రం కనీసం స్పందించలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అంటే గుజరాత్‌ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. జీఎస్టీ పేరుతో లక్షల కోట్లు తీసుకుని రాష్ట్రానికి కష్టం వచ్చినపుడు నిధులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. వరదలు సంభవించిన రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉందని, వ్యవసాయ పంటలకు భారీగా నష్టం జరిగిందని అన్నారు. విపత్తు సహాయ నిధి నుంచి, పిఎం కేర్‌ నిధి నుంచి నిధులు విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. వరదలు సంభవించిన రాష్ట్రాల్లో పర్యటించి నష్టంపై అంచనా వేసి వరద సహాయం అందించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణలో ఉన్న కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డికి సినీనటులను పార్టీలు చేర్చుకునే దానిపై ఉన్న శ్రద్ధ, రాష్ట్రంలోని వరద బాధితులను ఆదుకోవడంలో లేదని విమర్శించారు. తెలంగాణకు కేంద్ర మంత్రి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు.

Spread the love