కనకదుర్గ అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన

– సెప్టెంబర్‌ 1 నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాల నిర్వహణ
– ఏర్పాట్లలో నిమగమయిన ఆలయ కమిటీ
– సుమారు 20 లక్షల రూపాయలతో ఆలయ నిర్మాణం
– ఉత్సవాలను విజయవంతం చేయాలి
– ఆలయ ధర్మకర్త, కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌
నవతెలంగాణ-కొత్తూరు
కనకదుర్గమ్మ నూతన దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ ధర్మకర్త కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌ కోరారు. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో గల తిమ్మాపూర్‌ చౌరస్తాలో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయాన్ని ఆలయ ధర్మకర్త కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌ తన సొంత ఖర్చులతో సుమారు 20 లక్షల రూపాయలతో నూతనంగా ఆలయాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి చేసుకొని విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలను నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉంది.
సెప్టెంబర్‌ 1న విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభం
ప్రతిష్టాత్మకమైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ నిర్మాణం వేగంగా జరుపుకొని విగ్రహ ప్రతిష్టాపనకు సిద్ధమైంది. సెప్టెంబర్‌ 1న వేద పండితులు దేవాద్రి కోటేశ్వర శర్మ, పర్ల నాగరాజు శర్మ పండితుల ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున ఆలయ ధర్మకర్త కౌన్సిలర్‌ కోస్గి శ్రీనివాస్‌ అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లను చేస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా తిమ్మాపూర్‌ లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.
ఉత్సవ కార్యక్రమాలు….
తిమ్మాపూర్‌లో శ్రీ కనకదుర్గ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఉత్సవాలకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 1న మొదటిరోజు ఉదయం గోపూజ, యాగశాల ప్రవేశం, విగేశ్వర పూజ, పుణ్య హావచనము, పంచగవ్య ప్రాసన దీక్ష స్వీకారం, అఖండ దీప స్థాపన, విగ్రహానికి క్షీరాదివాసం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి. సాయంత్రం 6 గంటలకు వాల్మీకి పూజ, మత్సంగ్రహణం, అంకురారోపణ, నవ కలశస్థాపన, అగ్ని మదనము, అగ్నికార్యము, ధ్వజారోహణ, జలాధివాసము, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయి.
రెండవ రోజు ఉదయం నిత్యార్చన, వాస్తు పూజ, యోగిని మండపారాధన, వాస్తు హౌమం, అమ్మవారికి క్షీరాభిషేకం, దుర్గ సప్తశతి హౌమము, పర్యాగ్నికరణము, ఆలయ గ్రామ బలిహరణ, తీర్థ ప్రసాద వితరణ. తిరిగి సాయంత్రం 6 గంటలకు శాంతి కుంభ స్థాపన, శాలార్చన, ప్రధాన వేదికార్చన, విశేష కళా హౌమములు, రుద్ర హౌమం, వస్త్ర దివాసము, పంచశ య్యదివాసము, తీర్థ ప్రసాద వితరణ ఉంటాయి.
మూడవరోజు ఆదివారం ఉదయం నిత్య పూజ, విధి బింబశుద్ధి, రత్న న్యాసము, గత్రున్యాసము, ఉదయం 10 గంటల 39 నిమిషాలకు యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కళాన్యాసము, అష్టమంగళ దర్శనము, మహాదాశిర్వచనము, పండిత్‌ సత్కారం, తీర్థ ప్రసాద వితరణ అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడతాయి.
ఉత్సవాలను విజయవంతం చేయాలి
తిమ్మాపూర్‌లో నూతనంగా నిర్మించిన శ్రీ కనకదుర్గం ఆలయ నిర్మాణం పనులు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్‌ 1 నుండి మూడు రోజులపాటు ఉత్సవ కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లను చేస్తున్నాం. విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాల సందర్భంగా తిమ్మాపూర్‌లో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. ఉత్సవాల నిర్వహణకు ప్రతి ఒక్కరు సహకరించి విజయవంతం చేయాలి.
కోస్గి శ్రీనివాస్‌ ఆలయ ధర్మకర్త, కౌన్సిలర్‌, తిమ్మాపూర్‌, కొత్తూరు మున్సిపాలిటీ

Spread the love