నేడు మహిళా గోస..బీజేపీ భరోసా దీక్ష

– పాల్గొననున్న డీకే అరుణ, విజయశాంతి, మహిళా మోర్చా నాయకులు : బండి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్రంలోని మహిళలకు సీఎం కేసీఆర్‌ కుటుంబం చేస్తున్న అన్యాయాలనూ, మోసాలను ఎండగట్టడమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ‘మహిళా గోస…బీజేపీ భరోసా’ పేరుతో దీక్ష చేపట్టనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజరుకుమార్‌ తెలిపారు. గురువారం హైదరాబాద్‌లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా సమావేశాన్ని నిర్వహించారు. దీక్షలో తమ పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి, మహిళా మోర్చా నాయకులంతా పాల్గొంటారని తెలిపారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో 33 శాతం మందికి సంస్థాగత పదవులు, ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ టికెట్లు ఇచ్చే దాకా పోరాటాన్ని చేయనున్నట్టు తెలిపారు. లిక్కర్‌ స్కామ్‌ను కప్పిపుచ్చేందుకు మహిళా దీక్ష పేరుతో డ్రామా చేస్తున్న కవిత తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Spread the love