నోటరీ స్థలాల క్రమబద్ధీకరణ జీవోను రద్దు చేయండి

telangana-high-court– పిల్‌పై కౌంటర్‌ వేయాలని ప్రభుత్వానికి నోటీసులు
హైదరాబాద్‌: నోటరీతో కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామని పేర్కొంటూ జులై 28న ప్రభుత్వం జారీ చేసిన జీవో 84ను సవాల్‌ చేస్తూ పిల్‌ దాఖలు చేయడాన్ని హైకోర్టు సమర్ధించింది. పిల్‌కు నెంబర్‌ కేటాయించేందుకు హైకోర్టు రిజిస్ట్రీ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. నెంబర్‌ కేటాయించాలని, పిల్‌ను సెప్టెంబర్‌ 14న విచారిస్తామని ప్రకటించింది. ఈ మేరకు చీఫ్‌ జస్టిస్‌ అలోక్‌ అరధే, జస్టిస్‌ వినోద్‌కుమార్‌ల డివిజన్‌ బెంచ్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో 28 చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ భాగ్యనగర్‌ సిటిజన్స్‌ అసోసియేషన్‌ తరఫున అధ్యక్షుడు కె. శ్రీనివాస్‌ వేసిన పిల్‌ తరఫున అడ్వొకేట్‌ డి నరేంద్రనాయక్‌ వాదించారు. ప్రభుత్వ జీవో వల్ల 125 చదరపు గజాలు, అంతకంటే తక్కువ ఉన్న స్థలం కొన్న వాటిలో కట్టిన ఇండ్లను రెగ్యులరైజ్‌ చేయడం అన్యాయమన్నారు. 125 గజాల వరకు ఎలాంటి స్టాంపు డ్యూటీ, జరిమానా ఉండదని, 125 గజాల కంటే ఎక్కువ, 3 వేల గజాల స్థలం వరకు ఉంటే ఇప్పుటి మార్కెట్‌ విలువ మేరకు ప్రస్తుత మార్కెట్‌ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ వసూలుకు అనుమతించడం అన్యాయమన్నారు. దీని వల్ల సివిల్‌ వివాదాలు పెరిగిపోతాయన్నారు. అమాయక స్థలాల ఓనర్లకు అసాంఘిక శక్తుల నుంచి అనేక సమస్యలు వస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జీవోను రద్దు చేయాలని కోరారు. స్టాంప్‌ డ్యూటీ మినహాయింపు వల్ల రాష్ట్రానికి ఆర్థికంగా తీవ్ర నష్టమన్నారు. గడువు ఇస్తే పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామని ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌ చెప్పారు. దీంతో విచారణు వచ్చే నెల 14కు వాయిదా పడింది. ఈలోగా ప్రతివాదులైన చీఫ్‌ సెక్రటరీ, రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

Spread the love