దేశాన్ని చక్కదిద్దేందుకే

– రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకే ప్రతిపక్షాల ఐక్యత
ఉమ్మడి కార్యక్రమానికి రూపకల్పన
– ప్రారంభమైన ఇండియా కూటమి నేతల భేటీ

న్యూఢిల్లీ: దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, దేశాన్ని చక్కదిద్దేందుకు తాము కలిసి నడుస్తామని, నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీని ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్నందున ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందిస్తామని ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు ప్రకటించారు. భారత్‌ అనే ఆలోచననే ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు వ్యూహాలు రచిస్తున్న ఇండియన్‌ నేషనల్‌ డెవలప్‌మెంటల్‌ ఇన్‌క్లూజివ్‌ అలయన్స్‌ (ఇండియా) రెండు రోజుల మూడో సమావేశం ముంబయిలోని బద్రా కుర్లా కాంప్లెక్స్‌ గ్రాండ్‌ హయత్‌ హౌటల్‌లో గురువారం రాత్రి ప్రారంభమైంది. ఈ సమావేశానికి ఆరుగురు ముఖ్యమంత్రులతో సహా 28 ప్రతిపక్ష పార్టీలకు చెందిన 63 మంది నేతలు హాజరయ్యారు.
ఇండియా ఫ్రంట్‌ లోగో శుక్రవారం ఉదయం విడుదల కానుంది. కూటమి కార్యాచరణపై చర్చించి మధ్యాహ్నం నిర్ణయం తీసుకోనున్నారు. ఒక కన్వీనర్‌, ఒక చైర్‌పర్సన్‌ ఉంటారు. కోఆర్డినేషన్‌ కమిటీ, ఫ్రంట్‌ సెక్రటేరియట్‌ కమిటీ, లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కమిటీ ఏర్పాటు జరగనున్నది. వివిధ రాష్ట్రాల్లో జరగాల్సిన పొత్తు చర్చలు ఈ కమిటీ ఆధ్వర్యంలోనే జరగనున్నాయి. పొత్తు పెట్టుకుని రాష్ట్రాల వారీగా సీట్ల పంపకాలు జరపాలని కూటమి నిర్ణయించింది. తమ వ్యూహాల సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసేందుకు పరిశోధక బృందాన్ని నియమించడం, ఐదు నుంచి పది మంది జాతీయ అధికార ప్రతినిధుల నియామకం, కొత్త మీడియా టీమ్‌ల ఏర్పాటు, జాతీయ ఎజెండాను రూపొందించడానికి కమిటీ ఎంపిక కూడా శుక్రవారం నాటి ఎజెండాలో చేర్చారు. ఈ సమావేశంలో ఇండియా కూటమి సమన్వయ కమిటీని నిర్ణయించి, కూటమికి లోగోను ఎంపిక చేస్తుందని భావిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విలేకరుల సమావేశంలో కూటమి లోగోను ఆవిష్కరించనున్నారు.
రాత్రి 9 గంటలకు ఉద్దవ్‌ ఠాక్రే విందుకు కూడా నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్‌ నేతలు సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ముఖ్యమంత్రులు నితీశ్‌ కుమార్‌ (జేడీయూ), ఎంకె స్టాలిన్‌ (డీఎంకే), మమతా బెనర్జీ (టీఎంసీ), అరవింద్‌ కేజ్రీవాల్‌, భవత్‌సింగ్‌ మాన్‌ (ఆప్‌), హేమంత్‌ సోరెన్‌ (జేఎంఎం), బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌, యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్‌ యాదవ్‌, జమ్ము కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా సహా పలువురు నేతలు పాల్గొన్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రులు శరద్‌ పవార్‌, ఉద్ధవ్‌ ఠాక్రే వంటి నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ‘ఇండియా కూటమిగా మూడోసారి ముంబయిలో కలుస్తున్నాం’ అని బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌ చెప్పారు. ప్రజలు సరైన ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారని, ఇండియా కూటమి దానిని అందిస్తుందని తెలిపారు. ‘సమాజాన్ని విభజించే వారికి’ ప్రజలు తగిన సమాధానం ఇస్తారని తేజస్వి యాదవ్‌ చెప్పారు. ‘ప్రజల అంచనాలను అందుకోకపోతే ప్రజలు మమ్మల్ని క్షమించరు’ అన్నారు. దేశాన్ని ఏకం చేసేందుకు కూటమి కృషి చేస్తున్నదని ఆర్జేడీ నేత మనోజ్‌ ఝా అన్నారు. దేశాన్ని చక్కదిద్దేందుకే ఇండియా కూటమి అని పేర్కొన్నారు. ‘దేశంలో చాలా విషయాలు విచ్ఛిన్నమయ్యాయి. కలలు చెదిరిపోయాయి. ఈ కూటమి వాటిని పునరుద్దరించటానికి, దేశ గాయాలను మాన్పటానికిి’ అని ఆయన అన్నారు.
ఇండియా ఆత్మను కాపాడే కూటమి’: రామ్‌ గోపాల్‌ యాదవ్‌
సమాజ్‌వాదీ పార్టీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌ మాట్లాడుతూ ‘దేశ ఆత్మను కాపాడేందుకే ప్రతిపక్ష పార్టీల కూటమి ఏర్పడింది. అధికారంలో ఉన్న వ్యక్తులు దేశం అసలు ఆత్మను నాశనం చేయడం ద్వారా భారతదేశాన్ని నాశనం చేస్తున్నారు. ఈ కూటమి లక్ష్యం 2024లో బిజెపిని గద్దె దించడమే’ అని అన్నారు.
బీజేపీ భయపడుతుంది: రాఘవ్‌ చద్దా
ఇండియా కూటమికి బీజేపీ భయపడుతున్నదని ఆప్‌ నేత రాఘవ్‌ చద్దా అన్నారు. ‘వారికి ఇండియా అనే పదం పట్ల ద్వేషం ఉంది. పేరును ఉగ్రవాద సంస్థతో ముడిపెడుతున్నారు. ఇది ద్వేషం మాత్రమే కాదు, కూటమి విజయవంతమైతే (ఏమిటి) అనే భయం కూడా ఉంది. కానీ ఈ కూటమి దేశంలోని కోట్లాది మంది ప్రజలది. దీనిని ఓడించలేరు’ అన్నారు.
దేశానికి సమిష్టి నాయకత్వం అవసరం: జయంత్‌ చౌదరి
‘సమాజంలోని అన్ని వర్గాల అవసరాలు, ఆకాంక్షలకు ప్రతిస్పందించే సమిష్టి నాయకత్వం దేశానికి అవసరం. రాజ్యాంగపరమైన బాధ్యతల పట్ల సున్నితంగా ఉండే ప్రభుత్వం మనకు అవసరం” అని ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు జయంత్‌ చౌదరి అన్నారు.
‘కనీస ఉమ్మడి కార్యక్రమంపై చర్చిస్తాం’: తిరుమావళవన్‌
విడుతలై చిరుతైగల్‌ కట్చి (వీసీకే) అధ్యక్షుడు తిరుమావళవన్‌ మాట్లాడుతూ ‘కనీస ఉమ్మడి కార్యక్రమంపై మేం మా సూచనలను అందిస్తాం. మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజన వర్గాలతో కూడిన అణగారిన వర్గాల అభ్యున్నతే మా లక్ష్యం’ అన్నారు. ఈ సమావేశాలకు ఎన్‌సీపీ అధినేత శరద్‌ పవార్‌ విందు ఏర్పాటు చేయగా, శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే) ఇతర ఏర్పాట్లకు ఇన్‌ఛార్జ్‌గా ఉంది.
వామపక్షాలు ప్రత్యేక భేటీ
ఇండియా కూటమి సమావేశానికి వచ్చిన వామపక్ష పార్టీ నేతలు విడివిడిగా సమావేశమయ్యారు. శుక్రవారం జరిగిన సమావేశంలో వామపక్షాలు చేసిన చర్చలకు సంబంధించి ఓ అంగీకారం కుదిరింది. శుక్రవారం జరిగే సమావేశంలో ఎన్నికలకు ముందు జాతీయ ఎజెండా రూపొందించేందుకు వామపక్షాలు ప్రతిపాదనలు సిద్ధం చేయనున్నాయి. సీతారాం ఏచూరి, డి రాజా, అశోక్‌ ధావ్లే, మనోజ్‌ భట్టాచార్య, బినోరు విశ్వం, జి దేవరాజన్‌ మాట్లాడారు.

దేశానికి యువతే బలం
యువతే దేశానికి బలమని పీడీపీ నేత మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘జవహర్‌లాల్‌ నెహ్రూ నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు నాయకులు యువతకు దిశానిర్దేశం చేయడానికి జేఎన్‌యూ, ఐఐఎం, ఇస్రో వంటి సంస్థలను స్థాపించడానికి కృషి చేశారు. దాని వల్లే ఈరోజు మనం చంద్రుడిని చేరుకోగలిగాం’ అన్నారు.
– మెహబూబా ముఫ్తీ

కూటమిపై ప్రజలకు విశ్వాసం ఉంది
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడుతూ ఇండియా కూటమిని ప్రజలు విశ్వసిస్తున్నారని అన్నారు. ఇండియా కూటమి నిరంతరం సమావేశాలు జరుపుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. బీజేపీని ఓడించడంలో తమ కూటమి విజయం సాధిస్తుందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఆయన అన్నారు.
– అఖిలేష్‌ యాదవ్‌

ప్రధాని అభ్యర్థికి అనేక ఎంపికలు
శివసేన (యూబీటీ) చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే మాట్లాడుతూ ఇండియా కూటమికి ప్రధాన మంత్రి అభ్యర్థి కోసం అనేక ఎంపికలు ఉన్నాయని, అధికార బీజేపీకి ఒక్కటే ఉందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ఇండియా కూటమి నేతలు ఒక్కటయ్యారని శివసేన (ఉద్దవ్‌ ఠాక్రే) నేత ఆదిత్య ఠాక్రే అన్నారు.
– శివసేన

ప్రధాని, బీజేపీకి కలవరం
ఇండియా కూటమి పట్ల ప్రజల స్పందన ప్రధానమంత్రిని, బీజేపీని కలవరపెడుతున్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. దేశ రాజ్యాంగాన్ని, ప్రజల హక్కులను కాపాడడమే ఇండియా కూటమి లక్ష్యమని పేర్కొన్నారు.
– సీతారాం ఏచూరి

రాజ్యాంగాన్ని కాపాడాలి
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి. రాజా మాట్లాడుతూ దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో లౌకిక ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చి బీజేపీని ఓడించాల న్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
– డి రాజా

ఉమ్మడి కార్యక్రమానికి కృషి
దేశ ఐక్యత, సార్వభౌమత్వాన్ని బలోపేతం చేయడం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం నేటి ఆవశ్యకమని బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. ‘పేదరికం, నిరుద్యోగం, రైతుల సంక్షేమం వంటి సమస్యలను పరిష్కరించడంలో మోడీ ప్రభుత్వం విఫలమైంది. ఇండియా కూటమి సమావేశంలో మేం ఒక ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించడానికి కృషి చేస్తాం’ అన్నారు.
– లాలూ ప్రసాద్‌ యాదవ్‌

Spread the love