– ఉత్తర తెలంగాణలోనూ బీఆర్ఎస్కు ఎదురీత
– వైఎస్ఆర్టీపీ విలీనం లాంఛనమే
– ఆ గట్టునుంటే కారుకు బ్రేకులు వేయలేం : బీజేపీ వలస నేతల అంతర్మథనం
– కమ్యూనిస్టులకు కాంగ్రెస్ వెల్కమ్
– ఆ దారిలోనే కోదండరాం అడుగులు
– రేపోమాపో తుమ్మల చేరిక
గుడిగ రఘు
రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు గులాబీ దళానికి దడపుట్టిస్తున్నాయి. ఎదురేలేదంటూ ఎగిరిపడుతున్న కారుకు బ్రేకులు పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికార పార్టీని ఢీ కొట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీలోని తాజా, మాజీ నేతలు ‘చేయి’ కలుపుతున్నారు. దారులేవైనా అడుగులు మాత్రం కాంగ్రెస్ వైపే పడుతున్నాయి. అన్ని దిక్కులు గాంధీభవన్ వైపు చూస్తున్నాయి. వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గురువారం ఢిల్లీలో సోనియా, రాహుల్‌గాం ధీతో భేటీ కావడంతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. సీఎం కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందంటూ షర్మిల ప్రకటించారు. దీంతో వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్‌లో విలీనం లాంఛనంగా మారింది. పార్టీ కార్యకర్తలతో చర్చించి మూహుర్తం ఖరారు చేయనున్నట్టు సమాచారం. షర్మిల రాకపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, అధిష్టానం మాత్రం విలీనానికి నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. రెండు, మూడు రోజుల్లో విలీన ప్రక్రియ చర్చించేందుకు రేవంత్‌తోపాటు, పార్టీ సీనియర్లను ఢిల్లీకి ఆహ్వానించినట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాంగ్రెస్‌లో షర్మిల చేరడం పట్ల సీఎం కేసీఆర్ ‘ఆంధ్రా పెత్తనం’ అనే సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే అవకాశం ఉందని రేవంత్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా పార్టీని విలీనం చేసి ఆ తర్వాత ఆమె సేవలు ఎలా ఉపయోగించుకోవాలో అధిష్టానం చూసుకుంటుందని పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. తెలంగాణలో 4వేల కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న షర్మిల, ఇక్కడి సమస్యలపై అవగాహన పెంచుకున్నారని వైఎస్ఆర్ అభిమానులు అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ బలానికి షర్మిల చరిష్మా కలిసి రానుందని చెబుతు న్నారు.
మారుతున్న రాజకీయాల్లో కమల దళంలో బలమైన కుదుపు రానున్నట్టు తెలుస్తోంది. ఏ లక్ష్యం కోసమైతే బీజేపీలో చేరారో ఇప్పుడు ఆ లక్ష్యం అక్కడ నెరవేరే పరిస్థితి లేదని ఆపార్టీలో చేరిన నేతలు భావిస్తున్నారు. క్రమంగా బీజేపీ గ్రాఫ్ పడిపోతున్న నేపథ్యంలో వారిలో అంతర్మథనం మొదలైంది. కారు, కమలం మధ్య ఒప్పందం కుదిరిందనే విమర్శల నేపథ్యంలో… ఆ గట్టునుంటే కేసీఆర్‌ను గద్దెదించలేమనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ చేయి పట్టుకుందామనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. దానిలో భాగంగానే బీజేపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మాజీ ఎంపీ జీ వివేక్ కాంగ్రెస్‌లోకి వెళ్ళేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. తాజాగా వివేక్ కొడుకు గడ్డం వంశీ ప్రధాని
నరేంద్ర మోడీపై మణిపూర్ ఘటనల్ని ప్రస్తావిస్తూ విడుదల చేసిన వీడియో కమలంలోనే విస్తృత చర్చకు దారితీసింది. వివేక్ కుటుంబం హస్తం గూటికి చేరడం ఖాయమైందనే వాదన వినిపిస్తున్నది. ఇక మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి, జితేందర్‌రెడ్డి వంటి నేతలు కమలాన్ని వదిలి ‘చేయి’ పట్టుకోవాలని ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా దిక్కులు చూస్తున్నట్టు తెలుస్తోంది. కారెక్కుదామా? చేయి అందుకుందామా? అనే మీమాంసలో ఆయన ఉన్నాడని సన్నిహితులు చెప్తున్నారు. పటాన్చెరు నుంచి బీ ఫామ్ ఇస్తే, కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సిగల్స్ పంపుతున్నాడనే చర్చ జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితే బీజేపీలోని అనేక మంది నేతల్లో కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన నేతలందరూ బీజేపీ, బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందాన్ని బహిరంగంగానే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. కమలంలో ఉంటే కారును ఢకొీట్టలేమనే అభిప్రాయానికి వారు వచ్చినట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్ను బీజేపీ నిలువరించే పరిస్థితులు రాష్ట్రంలో లేవనే నిర్థారణకు వచ్చిన పలువురు బీజేపీ నేతలు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం.
మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్టుల సహకారం తీసుకున్న సీఎం కేసీఆర్…బీజేపీతో బంధం ఏర్పడిన తర్వాత వారితో పొత్తును కాదనుకున్న విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా చక్రం తిప్పుదామనుకున్న సీఎం కేసీఆర్ వెంట ఏ ఒక్క రాజకీయపార్టీ కూడా జట్టు కట్టకపోవడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణిస్తానని సీఎం కేసీఆరే స్వయంగా ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్ అయిన విషయం తెలిసిందే. దీనితో కమ్యూనిస్టులకు కాంగ్రెస్ పార్టీ వెల్కమ్ చెప్పినట్టు సమాచారం.
ఇప్పటి వరకు సీపీఐ, సీపీఐ(ఎం) ఉమ్మడిగా పోటీ చేయాలని నిర్ణయించాయి. ఎవరితో పొత్తు ఉన్నా…లేకపోయినా ఎన్నికల్లో తమ సత్తా చాటాలని భావిస్తున్నాయి. ఇటీవల తెలంగాణ జన సమితి (టీజేఎస్) రాష్ట్ర అధ్యక్షులు కోదండరాంతో కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మల్లు రవి భేటీ అయ్యారు. టీజేఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరినట్టు తెలిసింది. ఇక పాలేరు టికెటు ఆశించి బీఆర్ఎస్ చేతిలో భంగపడిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తాజాగా కారుపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. పాలేరులో పోటీ చేసి తన సత్తా ఏంటో చూపిస్తాంటూ సవాల్ విసిరారు. ఈ క్రమంలో గురువారం పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి స్వయంగా తుమ్మల ఇంటికి వెళ్లారు. ఆయన్ని కాంగ్రెస్‌లోకి రావాలని ఆహ్వానించారు. మరోవైపు అదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో హస్తానికి పూర్వవైభవం వస్తుందని చెప్తున్నారు. దీనికి వామపక్షాల సహకారం కూడా తోడైతే రాజకీయంగా తిరుగుండదని భావిస్తున్నారు.
ఇప్పటికే కాంగ్రెస్‌కు ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లో ఆధిపత్యం కనిపిస్తున్నట్టు పలు సర్వేలు చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణా పైనా కాంగ్రెస్ ఫోకస్ చేసింది. ఉమ్మడి మెదక్‌లో బీఆర్ఎస్కు మైనంపల్లి హనుమంతరావుతో చెక్ పెట్టించాలనే ఆలోచనలో కాంగ్రెస్‌పార్టీ ఉన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి గంగుల కమలాకర్ అనుచరుడు కొత్త జైపాల్‌రెడ్డి, ఆర్మూర్ నుంచి బీజేపీ నేత వినరురెడ్డి కాంగ్రెస్‌లో చేసిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ చేరికలతో ఉత్తర తెలంగాణలో మరింత బలపడొచ్చని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది.