– మోడీతో రాజీ పడ్డ కేసీఆర్
– ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజల చూపు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి.నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్రంలోని బీజేపీ పాలనలో అన్ని రాష్ట్రాల్లో మతోన్మాదం పెరిగిపోయిందని, ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీ పడ్డారని, దేశ ప్రజల సామాజిక, ఆర్థిక, ప్రాణ భద్రతకు ప్రత్యామ్నాయ రాజకీయాల వైపు ప్రజలు చూస్తున్నారని, బీజేపీ ఓటమే లక్ష్యంగా ప్రజలు సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు జి. నాగయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం మహాబూబాబాద్ సీపీఐ(ఎం) కార్యాలయంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శెట్టి వెంకన్న అధ్యక్షతన నిర్వహించిన ఆ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో నాగయ్య పాల్గొని మాట్లాడారు. బీజేపీ పాలనలో కానీ వినీ ఎరగని రీతిలో మైనార్టీలపై దాడులు దౌర్జన్యాలు, లైంగికదాడులు పెరిగిపోయాయని విమర్శించారు. మణిపూర్, అసోం, హర్యానా, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఇతర మతస్తులపై దాడులు దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. మతోన్మాద శక్తుల మూలంగా దేశ ఆర్థిక భద్రతకు ముప్పు వాటిల్లుతుందని, బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్‌శక్తులకు దోచిపెడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తొమ్మిదేండ్లలో ధరలు ఆకాశాన్ని ఉంటాయని, దేశ జీడీపీ రోజురోజుకు పడిపోతున్నా పెరుగుతుందని తప్పుడు లెక్కలు చూపుతూ ప్రధాని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ఇంతకాలం బీజేపీకి వ్యతిరేకంగా నిలిచినట్టు నటించాడని, ఇప్పుడు తన కూతురు అరెస్ట్ నిలుపుదల కోసం వారితో రాజీ పడ్డారని విమర్శించారు. మునుగోడులో కమ్యూనిస్టుల సహకారంతోనే గెలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో మిత్రత్వం కొనసాగుతుందని చెప్పి ఒంటరిగా ఎమ్మెల్యే టికెట్లు ప్రకటించారని తెలిపారు. భవిష్యత్‌లో బీజేపీతో పొత్తుకు అంట కాగుతున్నట్టు బీఆర్‌ఎస్ విధానాలు కనిపిస్తున్నాయన్నారు. బీజేపీతో కలిసే ఏ శక్తులతో కమ్యూనిస్టులకు మిత్రత్వం ఉండదని స్పష్టం చేశారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా దేశంలో ఏర్పడిన ఇండియా కూటమిలో కమ్యూనిస్టులూ ఉన్నారని తెలిపారు. ఇండియా కూటమి పాట్నా సభలో 16 పార్టీలు పాల్గొనగా, బెంగళూరులో 26 పార్టీలు, ముంబాయి సమావేశంలో 28 పార్టీలు ఉన్నాయని తెలిపారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీ.. నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న తరుణంలో లౌకిక శక్తుల ఐక్యతను ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు. కాంగ్రెస్ వామపక్షాల పొత్తుపై త్వరలో తేలుస్తామని పోటీ చేస్తామని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు ధరల పెరుగుదలపై పోరాటాలు ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సువర్ణపు సోమయ్య, ఆకుల రాజు, గునిగంటి రాజన్న, కందునూరు శ్రీను, ఆంగోతి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.