36లో 24

 24 out of 36– మెన్స్‌ సింగిల్స్‌ చాంప్‌ జకోవిచ్‌
– 36 ఏండ్ల వయసులో 24వ గ్రాండ్‌ విక్టరీ
– ఫైనల్లో మెద్వదేవ్‌పై ఘన విజయం
– యు.ఎస్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌
సెర్బియా యోధుడు నొవాక్‌ జకోవిచ్‌ చరిత్ర సృష్టించాడు. టెన్నిస్‌ ఓపెన్‌ శకంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన మార్గరేట్‌ కోర్టు రికార్డును సమం చేశాడు. రష్యా స్టార్‌ డానియల్‌ మెద్వదేవ్‌పై మెరుపు విజయంతో యు.ఎస్‌ ఓపెన్‌ మెన్స్‌ సింగిల్స్‌ చాంపియన్‌గా అవతరించిన జకోవిచ్‌.. కెరీర్‌ 24వ గ్రాండ్‌స్లామ్‌ ట్రోఫీని అందుకున్నాడు. 36 ఏండ్ల వయసులో 24వ గ్రాండ్‌స్లామ్‌ విజయం అందుకున్న జకోవిచ్‌ టెన్నిస్‌లో ఆల్‌టైమ్‌ రికార్డు టైటిల్‌కు మరో అడుగు దూరంలోనే నిలిచాడు!.
నవతెలంగాణ-న్యూయార్క్‌

అంచనాలు నిజమయ్యాయి. అద్భుతాలు ఏమీ జరుగలేదు. సెర్బియా స్టార్‌, రెండో సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ యు.ఎస్‌ ఓపెన్‌ పురుషుల సింగిల్స్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఆదివారం జరిగిన మెన్స్‌ సింగిల్స్‌ ఫైనల్లో జకోవిచ్‌ వరుస సెట్లలో టైటిల్‌ విజయం సాధించాడు. సుమారు మూడున్నర గంటల టైటిల్‌ పోరులో మూడో సీడ్‌ డానియల్‌ మెద్వదేవ్‌పై 6-3, 7-6(7-5), 6-3తో నొవాక్‌ జకోవిచ్‌ గెలుపు గర్జన చేశాడు. ఈ విజయంతో యు.ఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ నెగ్గిన అతిపెద్ద వయస్కుడిగా జకోవిచ్‌ రికార్డు నెలకొల్పాడు. 1970లో కెన్‌ రోస్‌వాల్‌ 35 ఏండ్ల వయసులో టైటిల్‌ సాధించగా.. ఇప్పుడు జకోవిచ్‌ 36 ఏండ్ల వయసులో ఈ ఘనత సాధించాడు. ఇక ఆల్‌టైమ్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల వేటలో టెన్నిస్‌ దిగ్గజం మార్గరెట్‌ కోర్టు (24) రికార్డును సైతం జకోవిచ్‌ సమం చేశాడు. యుఎస్‌ ఓపెన్‌ (2021) మాజీ చాంపియన్‌ డానియల్‌ మెద్వదేవ్‌ ఫైనల్లో గట్టిగా ప్రతిఘటించినా రన్నరప్‌ టైటిల్‌తో సరిపెట్టుకోక తప్పలేదు.
జకోవిచ్‌ జోరు :
రికార్డు గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌పై కన్నేసిన నొవాక్‌ జకోవిచ్‌.. న్యూయార్క్‌లో ఒక్క విజయంతో రెండు రికార్డులు ఖాతాలో వేసుకున్నాడు. లేటు వయసులో హాట్‌ ఫామ్‌లో దూసుకెళ్తున్న జకోవిచ్‌.. రష్యా స్టార్‌ ఆటగాడు డానియల్‌ మెద్వదేవ్‌పై వరుస సెట్లలో విజయం అందుకున్నాడు. తొలి సెట్‌ను 6-3తో గెల్చుకున్న జకోవిచ్‌కు రెండో సెట్‌లో మెద్వదేవ్‌ చుక్కలు చూపించాడు. టైబ్రేకర్‌కు దారితీసిన రెండో సెట్‌ 104 నిమిషాల పాటు సాగింది. టైబ్రేకర్‌లో 7-5తో పైచేయి సాధించిన జకోవిచ్‌.. మెద్వదేవ్‌పై మానసికంగా విజయం సాధించాడు. దీంతో కీలక మూడో సెట్లోనూ జకోవిచ్‌ జోరు కొనసాగించింది. మూడో సెట్‌ను సైతం 6-3తో సొంతం చేసుకున్న జకోవిచ్‌ కెరీర్‌ 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను దక్కించుకున్నాడు.
టైటిల్‌ పోరులో జకోవిచ్‌ 38 విన్నర్లు కొట్టగా, మెద్వదేవ్‌ 32 విన్నర్లు సంధించాడు. జకోవిచ్‌ 35 అనవసర తప్పిదాలే చేయగా.. మెద్వదేవ్‌ ఏకంగా 39 అనవసర తప్పిదాలకు పాల్పడ్డాడు. మెద్వదేవ్‌ సర్వ్‌ను జకోవిచ్‌ మూడుసార్లు బ్రేక్‌ చేయగా.. మెద్వదేవ్‌ ఒకే ఒక్క బ్రేక్‌ పాయింట్‌తో రేసులో వెనుకంజ వేశాడు. మెద్వదేవ్‌ 6 ఏస్‌లతో మెరువగా.. జకోవిచ్‌ 4 ఏస్‌లతో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. పాయింట్ల పరంగా జకోవిచ్‌ 118-97తో మెద్వదేవ్‌పై పైచేయి సాధించాడు. సొంత సర్వ్‌లో మెద్వదేవ్‌ 11 గేములు గెల్చుకోగా.. జకోవిచ్‌ 15 గేములు సొంతం చేసుకున్నాడు.
చరిత్రపై కన్నేసి..! :
‘ప్రపంచాన్నే జయించినట్టుగా అనిపిస్తుంది. ఇప్పటికీ ఓ బాలుడిగా నేను స్వప్నించిన ఆటనే ఆడుతున్నాను. ఈ స్థాయిలో నిలుస్తానని ఎన్నడూ ఊహించలేదు. కానీ గత రెండేండ్లుగా చరిత్రపై ఎందుకు గురి పెట్టకూడదని అనుకున్నాను. టైటిళ్లు అందుబాటులో ఉండగా.. ఎందుకు అందుకోకూడదని భావించాను. ఈ ఏడాది వింబుల్డన్‌ నెగ్గలేదనే పశ్చాత్తాపం నాలో ఏమాత్రం లేదు. నిజానికి నా ఆట తీరు పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను’ అని రికార్డు గ్రాండ్‌స్లామ్‌ విజయం అనంతరం జకోవిచ్‌ అన్నాడు. రఫెల్‌ నాదల్‌ 22 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల రికార్డును అధిగమించిన జకోవిచ్‌.. ఈ ఏడాది వింబుల్డన్‌లో యువ సంచలనం అల్కరాస్‌కు గ్రాస్‌కోర్టు గ్రాండ్‌స్లామ్‌ కోల్పోయాడు. ఈ ఏడాది నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లో ఏకంగా మూడింట విజయాలు నమోదు చేసిన నొవాక్‌ జకోవిచ్‌.. వచ్చే ఏడాది జనవరిలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ వేదికగా ప్రపంచ టెన్నిస్‌ చరిత్రలో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించిన ఘనత దక్కించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఆస్ట్రేలి యన్‌ ఓపెన్‌లో జకోవిచ్‌ ఇప్పటికే 10 టైటిళ్లు సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.
రూ.25 కోట్ల ప్రైజ్‌మనీ
యుఎస్‌ ఓపెన్‌ సింగిల్స్‌ చాంపియన్లు భారీ నగదు బహుమతి సొంతం చేసుకున్నాడు. మెన్స్‌, ఉమెన్స్‌ సింగిల్స్‌ విజేతలకు సమాన నగదు బహుమతి అందిస్తున్న యు.ఎస్‌ ఓపెన్‌.. నోవాక్‌ జకోవిచ్‌, కొకో గాఫ్‌లకు చెరో రూ.25 కోట్లు అందజేసింది. సింగిల్స్‌ రన్నరప్‌లు డానియల్‌ మెద్వదేవ్‌, సబలెంకలు సైతం చెరో రూ.12.5 కోట్లు ఖాతాలో వేసుకున్నారు.

Spread the love