అనురాగ్‌తో 6 గంటల పాటు చర్చ.. నిరసనకు రెజ్లర్లు తాత్కాలిక బ్రేక్‌

నవతెలంగాణ – ఢీల్లీ: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోన్న భారత రెజ్లింగ్‌ సమాఖ్య చీఫ్‌, భాజపా ఎంపీ బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన నిరసనలో బుధవారం కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆహ్వానం మేరకు ఆయనతో రెజ్లర్ల సుదీర్ఘ భేటీ ముగిసింది. దాదాపు 6గంటల పాటు జరిగిన చర్చల్లో కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ లిఖితపూర్వంగా పలు హామీలు ఇచ్చినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం రెజ్లింగ్‌ క్రీడాకారుడు భజరంగ్‌ పునియా మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై కేంద్రమంత్రితో చర్చించినట్టు చెప్పారు. బ్రిజ్‌భూషణ్‌పై ఢీల్లీ పోలీసుల దర్యాప్తు ఈ నెల 15నాటికి పూర్తవుతుందని.. అప్పటివరకు రెజ్లర్లు నిరసనలు చేయొద్దని కేంద్రమంత్రి తమకు సూచించారన్నారు. మహిళా రెజ్లర్ల భద్రతను కూడా చూసుకుంటామని చెప్పారన్నారు. మే 28న ఆందోళనల్లో భాగంగా రెజ్లర్లపై నమోదు చేసిన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేయగా.. అందుకు మంత్రి అంగీకరించారని తెలిపారు. ఈ నేపథ్యంలో జూన్‌ 15 వరకు తమ నిరసనలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు భజరంగ్ పునియా వెల్లడించారు. 15 తర్వాత ఎలా ముందుకెళ్లాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తమ పోరాటం మాత్రం ముగిసిపోలేదన్నారు.
దాదాపు 6గంటల పాటు చర్చలు జరిగాయని కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ వెల్లడించారు. జూన్‌ 15 నాటికి దర్యాప్తును పూర్తి చేసి ఛార్జిషీట్‌ సమర్పిస్తామని రెజ్లర్లకు హామీ ఇచ్చినట్టు చెప్పారు. అలాగే, భారత రెజ్లింగ్‌ సమాఖ్యకు జూన్‌ 30 లోపు ఎన్నికలు నిర్వహిస్తామని అనురాగ్‌ఠాకూర్‌ చెప్పారు.

Spread the love