మైత్రి సురేష్… ఫిజియోథెరపీకి సంబంధించిన సేవలు అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఆ లక్ష్యంతోనే ఆమె స్టార్టూన్ ల్యాబ్స్ స్థాపించారు. భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జి-20 సదస్సులో ప్రోడక్ట్ యూనిక్‌గా నిలబడి అందరి ప్రశంసలు అందుకున్నారు. ఆ ల్యాబ్ స్థాపన వెనుక దాగిన ఆమె స్ఫూర్తిదాయక ప్రయాణం నేటి మానవిలో…
అసలు మీరు మెడికల్ రంగాన్నే ఎందుకు ఎంచుకున్నారు?
సాధారణంగా మన దేశంలో డాక్టర్లు, ఇంజనీర్లు మంచి నోబెల్ ప్రొఫెషన్స్. కానీ ఇరువురూ ఎవరి వృత్తి వారిదిగా పని చేసుకుంటూ ఉంటారు. ఇద్దరి కాంబినేషన్‌తో రోగికి ప్రయోజనం చేకూరాలి అనేది నా ఉద్దేశం. కంపెనీ ప్రారంభించేముందు హాస్పిటల్స్‌కి వెళ్లి వారికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. న్యూరో, సైకియాట్రిస్ట్, పల్మనాలజీ వంటి డాక్టర్లను కూడా కలిసాము. అన్ని డిపార్ట్‌మెంటులకు వెళ్ళినప్పుడు మంచి సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. కానీ ఫిజియోథెరపీలో మాత్రం చాలా పాత పద్ధతుల్ని వాడుతున్నారు. చాలా ఆశ్చర్యంగా అనిపించింది. గత 50 ఏండ్లుగా భారతదేశంలో ఫిజియోథెరపీ చేస్తున్న వారందరూ ఆ పాత పద్ధతులకే అలవాటు పడిపోయారు. పైగా వాళ్ళకు వెనుకబడి ఉన్నామని కూడా అనిపించలేదు. వాళ్ళతో మాట్లాడి కొత్తగా ఇటువంటి రిపోర్టులను అందించే పరికరం వచ్చినట్లయితే మీకు ఉపయోగపడుతుందా అని ప్రశ్నిస్తే చాలామంది సానుకూలంగా స్పందించారు. కొత్త పరికరాలు లేవు కనుక పాత వాటితోనే వైద్యం చేస్తున్నారు అనే విషయం అర్థమైంది. మెడికల్ ఫీల్డులో తయారు చేసిన పరికరాన్ని ఉపయోగించే రోగుల నుండి మనకు వెంటనే ఫీడ్ బ్యాక్ వస్తుంది. వ్యక్తిగతంగా వారి ఆరోగ్యంలో మెరుగుదల, వారి సంతోషం నాకు చాలా తృప్తిని కలిగించాయి. అంతేకాక దానిని సవరించుకుంటూ ముందుకు వెళ్లడం చాలా అవసరం.
మీ కంపెనీ గురించి మరిన్ని వివరాలు..?
2017లో స్టార్టూన్ ల్యాబ్స్ అనే పేరుతో కంపెనీ ప్రారంభించాం. ఇది ఐ.ఎస్.ఓ సర్టిఫికెట్ పొందిన మెడికల్‌పరికరాల కంపెనీ. హైదరాబాద్ కేంద్రంగా రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పనిచేస్తూ మెడికల్ పరికరాలను తయారు చేస్తాం. ప్రపంచ స్థాయిలో ఆరోగ్య పరిరక్షణకు ధీటుగా మన ఉత్పత్తులను నిలపాలనే విజన్‌తో ముందుకెళుతున్నాం. యువత అభిరుచి అనుభవాల కలబోతగా మన సమాజంలోని ఎకో సిస్టంకి అందుబాటులో ఉంచాలనుకుంటున్నాం. దీని ఉద్దేశం ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలకు ఇన్నోవేటివ్ విధానంలో పరిష్కారాలు కనుగొనడం. మన ప్రజలకే కాకుండా ప్రపంచ స్థాయి ప్రామాణికాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడమే ఈ కంపెనీ ఉద్దేశం.
మీ ప్రొడక్ట్స్‌కి లాబ్ ఎక్కడ ఉంది? అందులో ఎంత మంది పనిచేస్తారు?
మాది ఎలక్ట్రానిక్స్ ల్యాబ్. కాంట్రాక్టు మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉంటారు. వారు అవసరమైన విడిభాగాలు అందచేస్తారు. కావలసిన చోటి నుండి విడిభాగాలు తెప్పించి, దానికి మెడికల్ పరమైన టెక్నాలజీని జోడించి తయారు చేస్తాం. పేటెంట్ ఆల్గోరిజిన్స్ సర్టిఫికేషన్స్ కావాలి కనుక అవన్నీ మాకు ఉన్నాయి. మా సంస్థలో మెడికల్ పరంగా డాక్టర్లు, సాంకేతికపరంగా ఇంజనీర్లు కూడా అవసరం. కనుక మా ప్రయోగశాలలో సుమారుగా 20 మంది ఉంటారు. వీటిని హాస్పిటల్స్‌లో డాక్టర్ల పర్యవేక్షణలో ఉపయోగిస్తాం. నేను స్వయంగా హాస్పిటల్స్‌కు వెళ్లి రోగులతో ఇంటరాక్ట్ అవుతాను. కంపెనీ ఓనర్‌గా నన్ను నేను పరిచయం చేసుకోను. అందువలన వారు చాలా స్వేచ్ఛగా నాతో మాట్లాడతారు.
మీ బాల్యం, విద్యాభ్యాసం గురించి చెప్పండి?
హైదరాబాదులోనే పుట్టాను. ఇక్కడే చదువుకున్నాను. మా అమ్మ మైథిలి గవర్నమెంట్ ఆఫీసర్‌గా పని చేసేవారు. నాకు ఒక అక్క. జేఎన్‌టీయూ హైదరాబాదులో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. 2010 +Aుజు పరీక్షలో 99.03 పర్సంటేజ్ సాధించాను. మూడేండ్లు ఐఐటి చెన్నైలో డిజైనింగులో రీసెర్చ్ చేశాను. ప్రోడక్ట్ డెవలప్‌మెంట్ సిస్టం కంట్రోలింగ్ విభాగాల్లో స్పెషలైజేషన్ కూడా చేశాను.
మీ ఉద్యోగ జీవితం..?
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదువు పూర్తి చేసి ఆరేండ్లు ఓ కంపెనీలో పనిచేశాను. ఈ సమయంలోనే అహ్మదాబాద్ ఐ.ఐ.ఎం.ఇ. నుండి కొన్ని కోర్సులు చేశాను. తర్వాత ఆ ఉద్యోగం వదిలేసి ఐఐటి మద్రాస్‌కి వెళ్లాను.
మీ సొంత కంపెనీ ఎప్పుడు ప్రారంభించారు?
2017లో నేనూ, నా భర్త సురేష్ కలిసి మెడికల్ పరికరాలు కోసం ఒక కంపెనీ పెట్టాలని అనుకుని స్టార్టూన్ లాబ్స్ ప్రారంభించాము. ఇంజనీరింగ్ చేస్తున్నపుడే కంపెనీ పెట్టాలని ఉండేది. అప్పటి నుండే నా ప్రాజెక్టులన్ని మనుషులకు సంబంధించిన పరికరాల మీదే ఉండేవి. ఉదాహరణకి డయాబెటిస్ పేషెంట్లకు అవసరమైన పరికరాలు. వాటికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి చాలా కోర్సులు చేశాను. మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా కుటుంబాలలో బిజినెస్ చేసిన వాళ్ళు లేరు. చేయాలనే ఊహ కూడా ఎవరికీ లేదు. చదువుకుని ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడే వారే గాని ఇలాంటి విప్లవాత్మకమైన ఆలోచనలు ఉండేవి కావు. దాంతో నాకు సపోర్టు లేదనే చెప్పవచ్చు. నేను చేస్తున్న పని గురించి కూడా వారికి అర్థం కాదు. ఎప్పుడైనా పేపర్లలో నా గురించి ఫొటోలు వస్తే చూసి సంతోషిస్తారు. అంతేగాని నేను ఏం చేస్తున్నది వాళ్ళకి తెలీదు.
కంపెనీ అభివృద్ధిలో మీ భర్త పాత్ర ఎలా ఉంది?
నా జీవిత భాగస్వామి సురేష్ నాలుగేండ్లు ఉద్యోగం చేసిన తర్వాత మద్రాసు ఐ.ఐ.టి.కి వచ్చారు. అక్కడ మేమిద్దరం సహ విద్యార్థులం. మా ఇద్దరి అభిప్రాయాలు చాలా వరకు కలిసేవి. అంటే పరిశోధనాత్మకంగా ఏమైనా చేయాలి అనే అభిలాష మా ఇద్దరిలోనూ ఉంది. ఒకరినొకరం అర్థం చేసుకుంటాం. అంటే మా మధ్య గొడవలు రావని కాదు. గొడవలు వచ్చినా కలిసిపోవడం అందంగా ఉంటుంది. కంపెనీ మా ఇద్దరిదీ కాబట్టి ఇంట్లో పనులు చేసుకుంటూనే కంపెనీ గురించి మాట్లాడుకుంటాం.
కంపెనీ ప్రారంభంలో ఏవైనా సమస్యలు ఎదుర్కొన్నారా?
మెడికల్ ఎక్విప్మెంట్ తయారు చేయడం ఇండియాలో కొత్త. 2017లో మేము ప్రారంభించే నాటికి ప్రజలకు అర్థం అయ్యేది కాదు. పరికరాలు తయారు చేసి మనుషుల మీద ప్రయోగిస్తున్నాం. అంటే పూర్తి ప్రాసెస్‌కి చాలా సమయం తీసుకుంటుంది. ఫలితానికి చాలా కాలం ఎదురు చూడాలి. టెస్టుల రిపోర్టులు కలెక్ట్ చేయడానికి చాలా ఖర్చవుతుంది. ఇవన్నీ పూర్తయితే గాని ప్రాజెక్ట్ లాంచ్ చేయలేం. మేమిద్దరం ఇంజనీర్లు కాబట్టి ఇతర దేశాల్లో 30 నుండి 40 కోట్లు అయ్యే పరికరాన్ని మేము తక్కువ ఖర్చుతో తయారు చేయగలిగాం. మన దగ్గర మెడికల్ ఫీల్డ్‌లో పరికరాలపై అవగాహన లేకపోవడమే పెద్ద ఛాలెంజ్. ఆ సమయంలో మాకు వి-హబ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ణదీు, వీవఱతీy ఎంతో సహాయం చేశాయి.
మీ కంపెనీకి ఇంత త్వరగా గుర్తింపు రావడానికి కారణం?
ఇష్టంగా పని చేయటం, పరిశోధనాత్మకంగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్ళటం. శిక్షణ పొందిన ఫిజియోథెరపిస్టులు అవసరమైతే ఇళ్లకు వెళ్లి సేవలు అందిస్తారు. అలాగే మెడికల్ పరికరాలను రోగుల అవసరాలను బట్టి ఉపయోగించడం.
మీ భవిష్యత్ ప్రణాళిక
ఫిజియోథెరపీకి సంబంధించిన మా రీసెర్చ్, పరికరాల ఉత్పత్తి ఒక స్థాయికి వచ్చిన తర్వాత మహిళల ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను. ప్రసూతి సమయంలో అనేకమైన మార్పులు జరుగుతాయి. అదేవిధంగా 50 ఏండ్లు దాటిన తర్వాత కండరాలు చాలా బలహీనమవుతాయి. దాంతో మూత్ర సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ఏ జబ్బు అయినా ఒకేరోజు సడన్‌గా బయటపడదు. లోపల ఎంతో డ్యామేజీ జరిగిన తర్వాతే బయటకు వస్తుంది. అటువంటి సమయంలో స్త్రీలకు ఫైనాన్స్, మోరల్, మెడికల్, ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం. అలాంటి సపోర్ట్ మేము ఇవ్వాలనుకుంటున్నాం.
– చివుకుల శ్రీలక్ష్మి