శాంసన్‌కు పిలుపు

– రుతురాజ్‌, మకేశ్‌లకు సైతం
– విండీస్‌తో వన్డేలకు భారత జట్టు
ముంబయి : సంజు శాంసన్‌ భారత వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు సారథ్యం వహిస్తున్న సంజు శాంసన్‌కు జాతీయ జట్టు తరఫున న్యాయమైన అవకాశాలు లభించలేదనే విమర్శ ఎక్కువగా వినిపిస్తోంది. స్వదేశంలో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌ నేపథ్యంలో బిగ్‌ హిట్టర్‌ సంజు శాంసన్‌కు సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ జట్టులో చోటు కల్పించింది. ముంబయిలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో భేటీ అయిన సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ విండీస్‌ పర్యటనలో మూడు వన్డేలకు జట్టును ఎంపిక చేసింది. విండీస్‌తో టీమ్‌ ఇండియా ఐదు టీ20లు సైతం ఆడాల్సి ఉంది. పొట్టి ఫార్మాట్‌కు జట్టును తర్వాత ప్రకటిస్తామని బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌, విండీస్‌ తొలి వన్డే జులై 27న క్వీన్‌ పార్క్‌ ఓవల్‌లో, చివరి వన్డే ఆగస్టు 1న బ్రియాన్‌ లారా క్రికెట్‌ అకాడమీలో జరుగనున్నాయి.
రుతురాజ్‌కూ చోటు : యువ వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌తో పాటు సంజు శాంసన్‌ వన్డే జట్టులోకి వచ్చాడు. రిషబ్‌ పంత్‌ ఫిట్‌నెస్‌ సాధించి సెలక్షన్‌కు అందుబాటులో ఉంటే.. ఈ ఇద్దరిలో ఒకరు త్యాగానికి సిద్ధం కావాల్సిందే. దీంతో విండీస్‌ టూర్‌లో ఉత్తమ ప్రదర్శన చేసేందుకు ఇటు కిషన్‌, అటు శాంసన్‌ సిద్ధమవుతున్నారు. టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌, పేసర్‌ ముకేశ్‌ కుమార్‌ సైతం వన్డేలో చోటు దక్కించుకున్నారు. రోహిత్‌ సారథ్యంలో.. హార్దిక్‌ పాండ్య వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో మూడు సార్లు సున్నా పరుగులకే నిష్క్రమించిన సూర్యకుమార్‌ యాదవ్‌ జట్టులో చోటు నిలుపుకున్నాడు. వాషింగ్టన్‌ సుందర్‌ జట్టులో చోటు కోల్పోగా.. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌కు తోడు కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వెంద్ర చాహల్‌లు జట్టులో నిలిచారు. మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, ముకేశ్‌ కుమార్‌లు పేస్‌ విభాగంలో ఉన్నారు.
భారత వన్డే జట్టు
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), శుభ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, విరాట్‌ కోహ్లి, సూర్యకుమార్‌ యాదవ్‌, సంజు శాంసన్‌ (వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్య (వైస్‌ కెప్టెన్‌), శార్దుల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, యుజ్వెంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జైదేవ్‌ ఉనద్కత్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ముకేశ్‌ కుమార్‌.

Spread the love