మన్నెంలో ఊపందుకున్న ప్రచారం

– కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య పోటీ
– ప్రచారంలో కనిపించని కమలదళం…
నవతెలంగాణ-భద్రాచలం రూరల్‌
మండే వేసవిలో అకాల వర్షంతో వాతావరణం చల్లపడ్డ ఓట్లు సమీపిస్తుండడంతో ఎన్నికల వాతావరణం మాత్రం ఒక్కసారిగా వేడెక్కుతోంది. మానుకోట పార్లమెంటు పరిధిలో బరిలో నిలిచిన ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేస్తే కమలం పార్టీ మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఓట్ల పండగకు మరొక నాలుగు రోజులే మిగిలి ఉండడంతో ఇటు అభ్యర్థులతో పాటు పార్టీల ముఖ్యనాయకత్వం కార్యకర్తల సమీకరించి బలాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇండియా బ్లాక్‌ మద్దతుతో పాటు బలమైన సీపీఐ(ఎం) మద్దతు చేకూరడంతో రెట్టింపు ఉత్సాహంతో కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల క్యాంపియన్‌ను నిర్వహిస్తుంది. ఇప్పటికే కాంగ్రెస్‌, సీపీఐ(ఎం), సీపీఐలు ఉమ్మడిగా గడపగడపకూ వెళ్లి ప్రచారం నిర్వహించడంతోపాటు బూతు స్థాయిలో కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రచారంలో కాస్త ఎనుకబడినప్పటికీ బీఆర్‌ఎస్‌ సైతం తనదైన శైలిలో అభ్యర్థి మాలోత్‌ కవితతో పట్టణంలో రోడ్‌ షోతో పాటు వేకువ జామున వాకర్లను కలిసి ఓట్లను అభ్యర్థించే పనిలో నిమగమైనారు. బీఆర్‌ఎస్‌లో ప్రధాన నాయకత్వం మొత్తం కాంగ్రెస్‌ గూటికి చేరడంతో ఎన్నికల ప్రచార భారం మొత్తం రావులపల్లి రాంప్రసాద్‌ పైనే పడిన నేపథ్యంలో గత అసెంబ్లీలో కారు పార్టీకి పోలైన ఓట్లు పార్లమెంటులో సైతం నిలబెట్టుకేందుకు సర్వశక్తులు అడ్డుతున్నారు.
కాంగ్రెస్‌కి ప్రధాన ప్రచార హస్త్రంగా ఐదు పంచాయతీలు
ఈ పార్లమెంట్‌ ఎన్నికలలో గెలిస్తే ఆంధ్రలో కలిసిన ఐదు పంచాయతీలను తిరిగి భద్రాచలంలో కలుపుతామని కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో పొందుపరచడంతో ఆ పార్టీకి ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. గత పది ఏళ్లుగా సీపీఐ(ఎం) సైతం పోరాడుతున్న సమస్య కావడంతో ఆ పార్టీ కూడా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ఐదు పంచాయతీలను సాధించాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టుగా స్పష్టమవుతుంది. ఈ ప్రాంత ప్రజలు ప్రధానంగా కోరుకున్న ఐదు పంచాయతీల సమస్యను ఇటు బీఆర్‌ఎస్‌ గాని కమలం పార్టీ గానీ మేనిఫెస్టోలో తీర్చకపోవడంతో ఆ పార్టీ అభ్యర్థులలో కొంత నైరశ్యం నెలకొన్నది. దానికి తోడు గత అసెంబ్లీ ఎన్నికలలో తాత మధు నేతృత్వంలో కార్యకర్తలకు విచ్చలవిడిగా డబ్బులు పంచారనే ఆరోపణల నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికలలో ఏర్పడ్డ నిధుల కొరత ప్రభావం బీఆర్‌ఎస్‌ ప్రచారంపై స్పష్టంగా కనబడుతుంది. ఈ ప్రాంతంలో కనీస ప్రాధాన్యత కూడా కమలం పార్టీకి లేకపోవటంతో పాటు డివిజన్‌ ఈ ముక్కలుగా చేసిన పాపం కమలం పార్టీని వెంటాడటంతో ప్రచారాన్ని సైతం నిర్వహించడం లేదు. ఎన్నికల ఘడియలు దగ్గర పడుతున్న తరుణంలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలు నువ్వా నేనా అన్నట్టు ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పటికీ అంతిమంగా వామపక్షాల మద్దతుతో మానుకోట హస్తగతం అవటం ఖాయమని తెలుస్తుంది.

Spread the love