ఆగివున్న కోచ్‌లో మంటలు

A fire breaks out in a stationary coach– మధురై రైల్వే జంక్షన్‌ వద్ద దారుణం
– 10 మంది మృతి, 20 మందికి తీవ్రగాయాలు
– మధురై రైల్వే జంక్షన్‌ వద్ద దారుణం
చెన్నై : ఆగివున్న రైల్వే కోచ్‌లో మంటలు చెలరేగి ఉత్తర ప్రదేశ్‌కు చెందిన 10 మంది పర్యాటకులు మృతి చెందిన దారుణం తమిళనాడులోని మధురై రైల్వే జంక్షన్‌ సమీపంలో సంభవించింది. ఈ ప్రమాదంలో మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం 5:30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అధికారుల సమచారం ప్రకారం ఒక టూర్‌ ఆపరేటర్‌ ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నుంచి ఒక స్లీపర్‌ క్లాస్‌ కోచ్‌ను బుక్‌ చేసుకున్నారు. ఈ కోచ్‌ వివిధ ట్రైన్లకు అనుసంధానించబడుతూ వివిధ పర్యాటక స్థలాలకు వెళుతుంది. ఈ కోచ్‌లో 55 మంది పర్యాటకులు, ఎనిమిది మంది సహాయక సిబ్బంది, ఈ కోచ్‌ను బుక్‌ చేసుకున్న టూర్‌ ఆపరేటర్‌ పర్యాటిస్తున్నారు.
శుక్రవారం ఈ కోచ్‌ పునలౌర్‌-మధురై ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించబడి కన్యాకుమారి, పద్మనాభపురం స్థలాలను సందర్శించి శనివారం ఉదయానికి మధురై రైల్వే జంక్షన్‌కు చేరుకుంది. దీంతో ఈ కోచ్‌ను జంక్షన్‌కు దక్షిణంగా 800 మీటర్ల దూరంలో స్టేబ్లింగ్‌ లైన్‌లో నిలిపించారు. ఉదయం 5:45 గంటల సమయంలో కోచ్‌లో మంటలు చెలరేగుతున్నట్లు అగ్నిమాపక, సహాయక విభాగానికి సమాచారం వచ్చింది.
వెంటనే సిబ్బంది అక్కడి చేరుకుని మంటలను అదుపు చేసి, సహాయక కార్యక్రమాలను ప్రారంభించారు. గాయపడిన రైల్వే ఆసుపత్రికి, ప్రభుత్వ రాజాజీ ఆసుపత్రి (జిఆర్‌హెచ్‌)కు తరలించారు. ఈ కోచ్‌లో లోపలి నుంచి లాక్‌ చేసి ఉండటంతో అందులో ఉన్న ప్రయాణీకులు బయటకి రావడానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రాధమిక విచారణలో ఈ కోచ్‌లోకి అక్రమంగా గ్యాస్‌ సిలిండర్‌ను తీసుకుని వచ్చారని, టీ తయారు చేయడానికి ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ మంటలు చెలరేగాయని వెల్లడయింది. ప్రమాద స్థలం వద్ద నుంచి గ్యాస్‌ సిలిండర్‌, ప్రెషర్‌ కుక్కర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మంటలకు కోచ్‌ దాదాపుగా పూర్తిగా దగ్ధమయింది. ఈ నెల 17న లక్నోలో ఈ కోచ్‌ ప్రయాణం ప్రారంభించింది. ఈ నెల 29కి మళ్లీ అక్కడకు చేరుకోవాల్సి ఉంది. శనివారం మధురైలోని మీనాక్షి ఆలయాన్ని పర్యాటకులు సందర్శించాల్సి ఉంది.ఈ ప్రమాదంపై రైల్వే శాఖ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించింది. మృతు ల కుటుంబాల ఒకొక్కరికీ రూ 10 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాల ఒకొక్కరికీ రూ 3 లక్షల పరిహారం ప్రకటించారు. మృతదేహాలను స్వగ్రామం తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
కాచిగూడ రైల్వేస్టేషన్‌లో ద.మ.రైల్వే జీఎమ్‌ తనిఖీలు
నవతెలంగాణ-హైదరాబాద్‌ బ్యూరో
దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ శనివారం కాచిగూడ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఆయన వెంట హైదరాబాద్‌ డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లోకేష్‌ విష్ణోరు, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన రూట్‌ రిలే ఇంటర్‌లాకింగ్‌ (అర్‌ఆర్‌ఐ) వ్యవస్థను తనిఖీ చేసారు. అక్కడ అనుసరించే భద్రత, సాంకేతిక అంశాలను సమీక్షించారు. సిగలింగ్‌ పరికరాలు, బాక్సులు, పాయింట్లను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. బుకింగ్‌, పార్శిల్‌ బుకింగ్‌ కార్యాలయాల్లో కలియతిరిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి రోజూ 105 రైళ్లు రాకపోకలు సాగిస్తాయనీ, సగటున 50 వేలమంది ప్రయాణీకుల ద్వారా దాదాపు రూ.70 లక్షల ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ స్టేషన్‌ వందశాతం ఎనర్జీ న్యూట్రల్‌ స్టేషన్‌గా గుర్తింపు పొందిందని వివరించారు.

Spread the love