యూత్‌ కి జోష్‌ ఇచ్చే జిమ్మిక్కైన పాట

యూత్‌ కి జోష్‌ ఇచ్చే జిమ్మిక్కైన పాటయూత్‌ కి మాంచి జోష్‌ ఇచ్చే పాటలు మన తెలుగు సినిమాల్లో చాలానే ఉన్నాయి. లైఫ్‌ని ఎంజారు చేయమని చెప్పేవి కొన్నైతే, చదువును పక్కనబెట్టి జాలీగా తిరగమని చెప్పేవి కొన్ని. అలాంటి వాటిల్లో ఈ పాట ఒకటి. ప్రేమమైకంలో పడి జిందగీని పాడు చేసుకోవద్దని, దుడుకు వయసులో అమ్మాయిల వెంట తిరిగి జీవితాన్ని బర్బాద్‌ చేసుకోవద్దని చెప్పే పాట ఇది..MAD(2023) సినిమా కోసం రఘురామ్‌ రాసిన ఈ పాటనిపుడు పరిశీలిద్దాం.
యువతను బాగా ఆకర్షించే సుతిమెత్తనైన, మత్తైన పాటలు రాసిన కవి, రాస్తున్న కవి రఘురామ్‌. MAD సినిమాలో ఆయన రాసిన పాట యూత్‌ కు మంచి కిక్‌ ఇచ్చేలా ఉంటుంది. అంతే కాని ఇది ఎవ్వరినీ కించపరిచేది కాదు. ఎవ్వరినీ నొప్పించేది కాదు. సినిమాలోని సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని రాసిన పాటగా మాత్రమే మనం పరిగణించాలి.
సినిమాకథ పరంగా చూసినట్లయితే తనకు గర్ల్‌ ఫ్రెండ్‌ లేదని, తనతోటి వారంతా ప్రియురాళ్ళతో బాగానే ఎంజారు చేస్తున్నారని ఒక కుర్రవాడు అలుగుతాడు. అతడిని ఓదార్చడానికి స్నేహితులంతా కలిసి పాడే పాట ఇది.
సింగిల్‌ గానే ఉండు. గర్ల్‌ ఫ్రెండ్‌ ఎందుకు? హైదరాబాదని, సికింద్రాబాదని నువు పోరివెంట తిరిగితే బతుకంతా ఆగమైపోతుందిరా అని హెచ్చరిస్తారు. సింపుల్‌గా, హాయిగా సాగిపోయే ఈ జీవితాన్ని పోయి పోయి సమస్యల్లో ఇరికించొద్దు. బాగా తిని, తాగి ఒంటరిగా ఈ జీవితాన్ని గడిపేరు.. ఖాళీగా ఉన్న గుండె మీద లేని పోని బరువును పెంచుకోవద్దు. ఉన్న టాలెంట్‌ని అమ్మాయిల కోసం ఆలోచిస్తూ ఖర్చు పెట్టవద్దు. అమ్మాయిలతో తిరగడమనేది ఆధారంలేని ప్రపంచం వంటిది. ఏ దిక్కూ లేని ప్రపంచమది. ఆ అయోమయ ప్రపంచంలోకి నువు ప్రవేశించవద్దు. చాగంటి ప్రవచనాలసారం కూడా ఇదేరా అంటూ వ్యంగ్యంగా, సరదాగా హెచ్చరిస్తూ ఓదారుస్తూ ఉంటారు. నీ ముందున్న ప్రపంచాన్ని గమనించు.. అంటూ సరికొత్త పద్ధతిలో ఓ సందేశమిస్తారు. నీ జీవితం, నీ భవిష్యత్తు, ఆలోచనలు, అనుభూతులు, స్వేచ్ఛ.. అంతా పోయి నీ బతుకే ప్రశ్నార్థకమవుతుంది. ఏం తోచక వ్యర్థమవుతుంది.. జాగ్రత్త అని చెబుతుంటారు.
ఒంటరివాడినని గర్వపడు. అది అదృష్టమని తలచుకో. నేను ఒంటరిని అని గట్టిగా అరువు. అదే ఒక వరమని అర్థం చేసుకో. అవకాశం దొరికినా సరే, ఏ అమ్మాయైనా తనంతతానే నీ చెంతకు వచ్చినాసరే నువు ఆహ్వానించకు. ఆమె మనసును స్వీకరించకు. వాళ్ళతో అసలే కలిసిపోకు. జీవితంలో ఇదే బెస్ట్‌ యాంగిల్‌. అర్థం చేసుకో అంటూ అనుభవంతో చెబుతున్నారు.
ఈరోజుల్లో అమ్మాయిలు ఎలా ఉన్నారంటే.. కాఫీలని, సెల్ఫీలని, గిఫ్టులని, స్వేచ్ఛలని, హాట్‌లని, టెన్షన్లని.. ఎన్నెన్నో ట్విస్టులిస్తున్నారు. స్వాతి అని, స్ఫూర్తి అని, ప్రీతి అని, కీర్తి అని టార్చర్‌ కి ఎన్ని పేర్లో. నీ జీవితం సర్వనాశనమవడానికి ఎన్నో ఎత్తులు పైఎత్తులు..అవన్నీ గమనించు సుమా!
ఒంటరిగానే ఇప్పటివరకు బతికావు. ఒంటరి జీవితానికే ఒక ప్రతీకగా నిలిచావు. కుట్లు ఊడిపోయిన దుస్తులను ఎందుకు వేసుకుంటావు. ప్రేయసి ఉన్న జీవితం అలాంటిదే మరి. ప్రవేశించడానికి రక్షణ కూడా లేని చోట పందెం ఎలా కాస్తావు. గెలుపు కాదు కదా! పోరాటమే చేయలేక అసమర్థుడిగా మిగిలిపోతావు. అమ్మాయిల మాయ అంతా ఏదో అలా.. శాంపిలంతే.. అమాయకంగా, అజ్ఞానంగా తిరిగి ఈ జీవితాన్ని జూదంలాగా మార్చుకోకు. జీవితాన్ని పాడుచేసుకోకు. ఇదంతా ఓ నాటకం. సింగిల్‌ గానే ఉందామురా! అలా ఉన్నంతమాత్రాన నీ వయసుకున్న క్రేజీ ఏమి తగ్గదురా! ఈ విషయాన్ని బాగా ఆలోచించుకో. గమనించుకో. జాగ్రత్తగా ఈ జీవితంలో అడుగు ముందుకు వేయరా! అంటూ స్నేహితులంతా ఓ సందేశమిస్తారు.
తల్లిదండ్రుల మాటలు వినక, చదువుపై శ్రద్ధపెట్టక జల్సాల్లో తిరిగే యువత ఇందులో కనిపిస్తారు. బాల్యంలో, యవ్వనంలో వేసే తప్పటడుగులు అందంగానే కనిపిస్తాయి. అవి తప్పుగా కనిపించవు. కారణం వయసే. వయసు ఏదీ అర్థం చేసుకోనివ్వదు. కాని మందు తాగాకో, అనుభవమయ్యాకో ఒప్పేదో, తప్పేదో వాళ్ళకే తెలుస్తుంది. ఆ అనుభవంతో చెప్పిన మాటలూ, సత్యాలూ ఇందులో ఉన్నాయి. కొంటెవేషాలు, వింతపోకడలు, అల్లరిపనులు.. అన్నీ మన కళ్ళముందు కనబడతాయి. వెంటనే.. అవి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తాయి కూడా. జోష్‌ ఇచ్చినట్టే ఇచ్చి ఒక ఉన్నతమైన సందేశాన్నిస్తుందీ పాట.
ఇది ఓ సరదా కోసం రాసిన పాటే అయినా ఇందులో పెడదారి పట్టిపోయే యూత్‌ కి చురకలంటించే ఓ చరుపు కూడా ఉంది. కుర్రకారుకి హుషారెత్తించే జిమ్మిక్కు ఉంది. ఇలాంటి పాటలు ఈ తరాన్ని ఉర్రూతలూపేవి. ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని పెంచేవి. వయసుకు గిలిగింతల్ని కలిగించేవి. ఈ పాటతో క్రేజీ ఉన్న పాటలరచయితగా రఘురామ్‌ పేరు సినీప్రపంచంలో నిలబడిపోయింది.
పాట:-
ఏ సింగిల్‌ గ ఉండు మామ

గర్ల్‌ ఫ్రెండ్‌ ఎందుకు?

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌

పోరెంటబడితె నువు బర్బార్‌

 

అరె సింపుల్‌ గ ఉన్న లైఫ్‌ ని

కంప్లికేట్‌ చేయకు

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌

జోర్సే చిల్లౌ పీనేకే బాద్‌

 

వేకెంటు హార్టు మీద

వెయిట్‌ వేయకు

టాలెంటు పోరి మీద

వేస్ట్‌ చేయకోయ్

 

వారెంటీ లేని వరల్డ్‌

ఎంటరవ్వకు

చాగంటి కూడా

చెప్పినాడు ఎందుకు?

 

నీ నేచర్‌..నీ ఫ్యూచర్‌..

నీ స్టేచర్‌.. సిగేచర్‌..

నీ ఫ్రీడమ్‌ పోయి ధం ధం

అయిద్ది చూసుకోరరేరు..

 

మామా ఫ్రౌడ్‌ సే బోలో

ఐయామ్‌ సింగిల్‌

ఛాన్సే దొరికినా

అవకు మింగిలు

 

మామా లౌడ్‌ సే బోలో

ఐయామ్‌ సింగిల్‌

లైఫ్‌ లో ఇదే కదా

బెస్టు ఆంగిలు

 

ఈరోజుల్లో మన పోరీలీ ఎట్లున్నర్రా అంటే?

స్పేసు కావాలంటది స్వాతి

స్పైసు కావాలంటది స్ఫూర్తి

టెన్షన్‌ పెడ్తది ప్రీతి

అటెన్షన్‌ కోర్తది కీర్తి

 

మరి కాఫీలంటు

సెల్ఫీలంటు బెస్టీలంటు

ట్విస్టులిచ్చి నెక్స్ట్‌ లెవల్లా

నిన్ను నేలనాకిచ్చి

పోతరు కొడకో

 

ఏ సోలోగ సో ఫారు

కింగులాగ బతికినావు

అరె సోలున్న లైఫ్‌ కే

స్పెల్లింగులాగ నిలిచినావు

 

నో స్ట్రింగ్స్‌ అటాచ్డ్‌ అంటే స్వాగు వేరురా

నో ఎంట్రీ కేరు చేయని స్టాగ్‌ నువ్వురా

అమ్మాయిల మాయ అంత జస్ట్‌ శాంపిలు

అమాయకంగ లైఫ్‌ చేయకు గ్యాంబుల్‌

హే రామ హై డ్రామ

సింగల్‌ గా ఉందామా!

 

నీ ఏజ్‌ గేజ్‌ ఫరకుపడదు క్రేజ్‌ తగ్గదురో

మామా ఫ్రౌడ్‌ సే బోలో ఐయామ్‌ సింగిల్‌

మామా లౌడ్‌ సే బోలో ఐయామ్‌ సింగిల్‌..

– డా||తిరునగరి శరత్‌చంద్ర,
[email protected]

Spread the love