రెజ్లర్ల కీలక నిర్ణయం

నవతెలంగాణ హైదరాబాద్:  బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా భారత అగ్రశ్రేణి క్రీడాకారులు గత కొద్ది నెలలుగా నిరసన తెలుపుతూనే ఉన్నారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ రోడ్డెక్కిన రెజ్లర్లు…తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.  ఇకపై రోడ్డుపైకి వచ్చి నిరసనలు తెలపబోమని స్పష్టం చేశారు. అయితే తమకు న్యాయం జరిగే వరకూ ఆయనపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఇకపై నాయ్యస్థానంలోనే తేల్చుకుంటామని.. రోడ్డెక్కబోమని ప్రకటించారు. ఈ విషయాన్ని రెజ్లర్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అధికార బీజేపీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చార్జీషీట్ దాఖలు చేస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నెరవేర్చుకుంది’ అని టాప్ రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, భజరంగ్ పునియా తెలిపారు. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ప్రక్రియ ముగిశాక తమకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం తెలిపిందని వారు చెప్పారు. ఆ మేరకు వేచి చూస్తామన్నారు. కానీ, బ్రిజ్ భూషణ్ పై మాత్రం తమ పోరాటాన్ని విరమించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లపాటు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్ తెలిపారు.

Spread the love