అదరం.. బెదరం…

        ఒలింపిక్స్‌లో దేశానికి పతకాలు తీసుకొచ్చిన మల్లయోధులు. న్యాయం కోసం రోడ్డెక్కారు. భారతదేశ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా ఇనుమడింప చేసిన క్రీడాకారిణులు… ‘ఇలాంటి రోజులు చూడడానికేనా మేము పతకాలు గెలిచింది?’ అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు. వీరి కంటనీరు యావత్‌ దేశాన్ని కదిలించింది. తమపై లైంగిక దాడులకు పాల్పడిన బ్రిజ్‌ భూషణ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఎండ, వాన, చలిని లెక్క చేయక 36 రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు. వారికి దేశం నలుమూలల నుండి మద్దతు లభిస్తుంది. కానీ నూతన పార్లమెంటు భవనం సాక్షిగా పోలీసులు వారిపై దమనకాండకు పాల్పడ్డారు. న్యాయం అడుగుతున్న ఆడబిడ్డలను ఈడ్చికెళ్ళి ఘోరంగా అవమానించారు.
భారత రెజర్ల సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ అయిన బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ మహిళా రెజ్లర్లను ”లైంగిక వేధిస్తున్నారంటూ” వినేశ్‌ ఫొగట్‌ ఈ ఏడాది జనవరి 18న ఢిల్లీలో నిరసనకు దిగారు. ఎముకలు కొరికే చలిలో జంతర్‌ మంతర్‌ వద్ద కూర్చుని ఆమె మూడు రోజులు నిరసన తెలిపారు. సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పూనియాతో పాటు ఇతర క్రీడాకారులు వినేశ్‌ ఫొగట్‌కు మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు.
రెజ్లర్ల డిమాండ్స్‌
బ్రిజ్‌ భూషణ్‌ తమపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడని పది మంది మహిళా రెజ్లర్లు తనతో చెప్పారని వినేశ్‌ ఫొగట్‌ చెప్పారు. 2012 నుంచి 2022 వరకూ పదేండ్లలో చాలు సార్లు మహిళా రెజ్లర్లను అతను లైంగికంగా వేధించాడు. అయితే వారి భద్రతా కారణాలను దృష్టిలో పెట్టుకొని లైంగిక దోపిడీకి గురైన యువతుల వివరాలను బయటకు చెప్పలేదు. లైంగిక వేధింపులకు గురైన బాధితుల్లో ఒక మైనర్‌ బాలిక కూడా ఉంది. నిరసన ప్రారంభించిన తర్వాత తమను కూడా మానసికంగా వేధించారని, చంపేస్తామని బెదిరించారని బజ్‌రంగ్‌, వినేశ్‌ అనేక సార్లు మీడియా ముందు బహిరంగంగా చెప్పారు. బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలి, అతన్ని అధికారిక పదవుల నుంచి తొలగించాలి, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.
విచారణ కమిటీ ఏర్పాటు
రెజ్లర్లు ఢిల్లీలో ఆందోన మొదలుపెట్టిన తర్వాత ఇది అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వెళ్ళింది. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇండియన్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మీద వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు జనవరి 23న ఆరుగురు సభ్యులతో బాక్సర్‌ మేరీకోమ్‌ అధ్యక్షతన విచారణ కమిటీని నియమించింది. ఈ కమిటీ వేసిన కొన్ని రోజుల తర్వాత వినేష్‌ స్పందిస్తూ ”నాకు ఒక విషయం అర్థం కావడం లేదు. కమిటీకి మేరీ కోమ్‌ను అధ్యక్షురాలిగా నియమించే ముందు, ఆమె అందుబాటులో ఉంటారో ఉండరో ఎందుకు అడగలేదు. ఆమె ఎప్పుడూ అందుబాటులో లేరు” అని చెప్పారు.
విచారణలో ఏం తేలింది?
బ్రిజ్‌ భూషణ్‌, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా కమిటీని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఆ గడువును తర్వాత పొడిగించారు. విచారణ పూర్తి చేసిన కమిటీ ఏప్రిల్‌ మొదటి వారంలో తన నివేదికను అందజేసింది. అయితే విచారణ కమిటీ అందజేసిన నివేదికలోని విషయాలు నేటికీ బయటికి రాలేదు. ఆ తర్వాత రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి ఎన్నికలు జరగనున్నట్లు ప్రకటించారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్‌ 21న రెజ్లర్లు పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లారు. స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ జంతర్‌ మంతర్‌ వద్ద ఏప్రిల్‌ 23న మళ్లీ నిరసనకు దిగారు. రెజ్లర్లు కేవలం రాజకీయాలు చేస్తున్నారంటూ పాలకులు వారి పోరాటాన్ని కొట్టిపారేశారు.
బాధ చెప్పడం తప్పా..?
రెండోసారి పోరాటం మొదలు పెట్టడంతో సుప్రీం జోక్యం చేసుకుంది. రెజ్లర్ల ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ ఏప్రిల్‌ 28న ఆదేశాలు జారీ చేశారు. అంతే కాదు ఈ కేసులో ఉన్న మైనర్‌ బాలికకు భద్రత కల్పించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సుప్రీం ఆదేశాలతో పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. ”ఒకవేళ బ్రిజ్‌ భూషణ్‌ బయట ఉంటే భవిష్యత్‌లో మేమెలా రెజ్లింగ్‌ ఆడగలం. మేం మా బాధను తెలిపాం. అలా తెలప కూడదా? మా కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయి. ఆయన్ని అరెస్ట్‌ చేస్తారా? లేదా? ఒకవేళ ఆయనస్థానంలో ఒక సాధా రణమైన వ్యక్తి ఉండుంటే, ఇప్పటికి ఆయన్ని అరెస్ట్‌ చేసే వారా? లేదా?” అని వినేశ్‌ ప్రశ్నించారు.
ఏ మాత్రం కుంగిపోకుండా…
లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తిని శిక్షించాలి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినంత మాత్రాన తమకు న్యాయం జరిగినట్టు కాదని తమకు న్యాయం జరిగే వరకూ జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన కొనసాగిస్తామని చెప్పారు. అలా రెజ్లర్లు తమ శాంతియుత నిరసన మొదలుపెట్టి నేటికి 37 రోజులు. ఈ మధ్య కాలంలో ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వ అండతో రెజ్లర్లతో అమానుషంగా ప్రవర్తించారు. అమ్మాయిలని కూడా చూడకుండా నానా దుర్భాషలాడారు. అయినా ఏ మాత్రం కుంగిపోకుండా తమకు న్యాయం జరిగే వరకు అక్కడి నుండి కదలమని దృఢ సంకల్పంతో ఉన్నారు. రెజ్లర్లు మళ్లీ నిరసనకు దిగడంతో రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా కార్యకలాపాల నిర్వహణకు అడ్‌హక్‌ ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఐఓఏకు లేఖ రాసింది. దీంతో ఏప్రిల్‌ 27న ఐఓఏ అడ్‌హక్‌ ప్యానెల్‌ను ప్రకటించింది.
సోషల్‌ మీడియాలో…
రెజ్లర్ల నిరసనను ఐఓఏ ప్రెసిడెంట్‌ పీటీ ఉష తప్పుబట్టారు. క్రీడాకారులు క్రమశిక్షణ పాటించాలంటూ మాట్లాడారు. అయితే దేశంలోని పలువురు ప్రముఖ క్రీడాకారులు లైంగిక వేధింపుల వివాదంపై స్పందించారు. రెజ్లర్లకు మద్దతుగా సోషల్‌ మీడియాలో తమ గళం విప్పారు. ఒలింపిక్‌ బంగారు పతక విజేత నీరజ్‌ చోప్రా, మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జా వంటి వారు వారిలో ఉన్నారు. అలాగే రైతులు కూడా వీరి పోరాటానికి ప్రత్యేక్షంగా మద్దతు ఇస్తున్నారు.
పోలీసుల దమనకాండ
ఒక పక్క ఢిల్లీ నడి వీధుల్లో అమ్మాయిలు లైంగిక వేధింపుల నుండి తమను కాపాడమంటూ ఆందోళన చేస్తున్నారు. మరో పక్క మన దేశ ప్రధాని పార్లమెంటు కొత్త భవన ప్రారంభోత్సవ వేడుకల్లో మునిగిపోయారు. అందుకే రెజ్లర్లు తమకు మద్దతుగా వచ్చిన వేలాది మంది మహిళలతో కలిసి న్యాయం చేయమంటూ నూతన పార్లమెంటు భవనం వైపు ప్రదర్శనగా బయలుదేరారు. పోలీసులు వారిని ఈడ్చుకుంటూ స్టేషన్లకు తరలించారు. రెజ్లర్ల శిబిరాన్ని కూడా నామరూపాలు లేకుండా చేశారు. అయినా అదరక, బెదరక పోలీస్‌ స్టేషన్‌ నుండి వచ్చి తిరిగి తమ పోరాటాన్ని కొనసాగిస్తామని వారు అంటున్నారు.

రేపు మాకూ జరగొచ్చు
తుగ్లకబాద్‌కి చెందిన సానియా కబడ్డి క్రీడాకారిణి. ఆమె కూడా ఢిల్లీ వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపారు. సానియా మూడేండ్లుగా కబడ్డి ఆడుతున్నారు. ”మొదట్లో కబడ్డి కేవలం నా హాబీ మాత్రమే. ఇప్పుడు దీన్ని కొనసాగించాలనుకుంటున్నాను. కబడ్డిలో జాతీయ, అంతర్జా తీయ పోటీల్లో పాల్గొనాలని ఉంది. అయితే ఈ రోజు వారికి జరిగింది, రేపు మాకూ జరగొచ్చు. అమ్మాయిలందరూ వచ్చి, ఇక్కడ కూర్చుని వారికి మద్దతు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నేను ఒక్కదాన్నే వచ్చాను. రేపు నేను నా టీమ్‌ మొత్తాన్ని తీసుకొస్తాను” అని సానియా చెప్పారు.
నియంతృత్వ ప్రభుత్వం
”రెజ్లర్లకు సపోర్ట్‌ చేసేందుకు శనివారం రాత్రి 8 గంటలకు జంతర్‌ మంతర్‌ వద్ద మీరట్‌ నుంచి మేం ఐదారుగురం మహిళలం వచ్చాం. మా ఇతర సహచరులను వివిధ పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. పోలీసులు చేసింది చాలా తప్పు. మమ్మల్ని ఈడ్చుకెళ్లారు. మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోంది. రెజ్లర్లకు న్యాయం లభించే వరకు, వారు తిరిగి ఇంటికి వెళ్లరు” అని మీరట్‌ నుంచి వచ్చిన గీతా చౌదరి చెప్పారు.
అమానుష సంఘటన – దేవి, సామాజిక కార్యకర్త
మొదటి నుండి డబ్ల్యూఎఫ్‌ఐలో లైంగిక వేధింపుల నిరోధక కమిటీ ఉందం టున్నారు. కానీ అందులో నలుగురు మగవాళ్ళే ఉన్నారు. ఒక జాతీయ స్థాయి సంస్థ చట్టపరంగా నడవాలి. ఆ రూల్స్‌ను వీరు పాటించ లేదు. పని ప్రదేశాల్లో ఇద్దరు వచ్చి తమపై లైంగిక దాడి జరిగిందని ఫిర్యాదు చేస్తే చాలా సీరియస్‌గా తీసుకోవాలి. అలాంటిది ఇక్కడ ఏడుగురు అమ్మాయిలు కంప్లెయిట్‌ ఇచ్చారు. అందులో ఒక మైనర్‌ బాలిక కూడా ఉంది. ఎప్పుడెప్పుడు ఏం జరిగిందో వాళ్ళు వివరంగా రాసి చెప్పారు. ఈ విషయాలన్నీ అందరికీ తెలుసు. అయినా ఏ చట్టం పని చేయడం లేదు. పైగా న్యాయం చేయమని అడిగిన వాళ్ళనే అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. దేశంలో కొత్త పార్లమెంటు సాక్షిగా చట్టాలు ఎలా అమలు కాబోతున్నాయో అనడానికి ఇదొక ఉదాహరణ. రాజదండాలు స్వీకరిస్తే రాజుల మాదిరిగానే వాళ్ళకు ఏంతోస్తే అదే చేస్తారు. చట్టాలను పట్టించుకోరు. లైంగిక వేధింపులు లేకుండా జీవించాలనుకునే ప్రతి భారతీయ మహిళా ఎప్పటికీ గుర్తుపెట్టుకోవల్సిన ఘటన ఆదివారం రెజ్లర్లపై జరిగిన అమానుష సంఘటన.
   – సలీమ

Spread the love