లండన్‌ వీధుల్లో కత్తితో వ్యక్తి స్వైర విహారం

– 13ఏండ్ల బాలుడు మృతి
లండన్‌ : కత్తి పట్టుకుని ఒక వ్యక్తి తూర్పు లండన్‌ వీధుల్లో స్వైర విహారం చేస్తూ పలువురిని గాయపరిచాడని, ఈ దాడిలో 13ఏండ్ల బాలుడు మరణించాడని పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు పౌరులు వున్నారు. సమురారు తరహాలోని కత్తిని పట్టుకుని దాడి చేసిన ఆ వ్యక్తి (36)ని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. ఇది తీవ్రవాదానికి సంబంధించిన ఘటనగా తాము భావించడం లేదన్నారు. గాయపడిన వారందరినీ ఆస్పత్రికి తీసుకెళ్లామని వారు చికిత్స పొందుతున్నారని చెప్పారు. గాయపడిన ఇద్దరు పోలీసు అధికారులకు ఆపరేషన్‌ చేయాల్సి వుందన్నారు.
ప్రధాని దిగ్బ్రాంతి
ప్రధాని రిషి సునాక్‌ ఈ కత్తిపోట్లపై దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. వీధుల్లో ఈ తరహా హింసకు తావు లేదని అన్నారు. అత్యవసరంగా రంగంలోకి దిగి ఆ వ్యక్తిని అరెస్టు చేసిన పోలీసులను ఆయన అభినందించారు. దేవుడిని నమ్ముతారా? అంటూ ఆ వ్యక్తి గట్టిగా అరుస్తూ ఇళ్ళ దగ్గరకు వచ్చి దాడికి ప్రయత్నించాడని, అప్పుడు తాను ఒక కిటికీ వెనక దాక్కున్నానని ఒక మహిళ తెలిపారు. ఏం జరుగుతోందో అర్ధం కాలేదన్నారు. రాజధానిలో ఇటీవల కత్తి నేరాలు పెరిగిపోవడం పట్ల సునాక్‌ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు.

Spread the love