రాష్ట్రంలో లా వర్సిటీ ఏర్పాటు చేయాలి

A law university should be established in the state– కర్నాటక తరహాలో న్యాయ విద్యార్థులకు, న్యాయవాదులకు రూ. 15,000
– ఆర్థిక సహాయం అందించాలి :ఎస్‌ఎఫ్‌ఐ న్యాయ విద్యార్థుల రాష్ట్ర కన్వెన్షన్‌లో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్‌
రాష్ట్రంలో ప్రత్యేకంగా న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి కర్పాటక తరహాలో న్యాయ విద్యార్థులకు, న్యాయవాదులకు రూ. 15 వేల స్టైఫండ్‌ అందించాలని పలువురు వక్తలు డిమాండ్‌ చేశారు. భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) న్యాయ విద్యార్థుల రాష్ట్ర కన్వెన్షన్‌ హైదరాబాద్‌ గోల్కొండ క్రాస్‌ రోడ్స్‌లోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.ఎల్‌.మూర్తి ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల మరణించిన న్యాయవాదులకు సంతాపాన్ని ప్రకటించారు. నాయకులు రమ్య, విగేష్‌, స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన కన్వెన్షన్‌కు ఐలు రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యులు కొల్లి సత్యనారాయణ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాల విభజన తర్వాత కోర్టుల్లో కేసులనేకం పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని పరిష్కరించడానికి కిందిస్థాయి కోర్టులను ఏర్పాటు చేయాలని కోరారు. దేశంలో అణగారిన వర్గాల విద్యార్థుల నుంచి న్యాయవిద్య వైపు వస్తున్న వారికి సరైన ప్రోత్సాహం లేక మధ్యలోనే ప్రాక్టీసు ఆపేస్తున్నారని, అలాంటి వారికి ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించాలన్నారు. న్యాయ విద్యలో ప్రస్తుతం సమాజంలో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కరిక్యులమ్‌ను తయారు చేసి ప్రవేశ పెట్టాలని తెలిపారు. నేడు దేశంలో 50 మిలియన్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయనీ, వాటి పరిష్కారానికి సరిపడా న్యాయ వాదులు, న్యాయ స్థానాలు రాష్ట్రంలో, దేశంలో లేవని, కావున ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళా న్యాయవాది శైలజ మాట్లాడుతూ.. మహిళా విద్యార్థులకు వారు పనిచేస్తున్న దగ్గర, చదువుకుంటున్న దగ్గర వేధింపులకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. అలాగే మహిళలకు సరైన ప్రోత్సాహం అందించాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఆర్‌.ఎల్‌. మూర్తి, టి. నాగరాజు మాట్లాడుతూ.. కేరళ, కర్నాటక తరహాలో రాష్ట్రంలో ప్రభుత్వ ఆధీనంలో న్యాయ విద్యను అందించడానికి ప్రత్యేక న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. రాష్ట్రంలో చదువుతున్న విద్యార్థులకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల తరహాలో నెలకు రూ. 15,000 స్టై ఫండ్‌ రెండేండ్ల పాటు అందించాలని డిమాండ్‌ చేసారు. ఈ సందర్బంగా రానున్న కాలంలో విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం పలు తీర్మానాలు చేశారు. ఈ సభలో ఎస్‌ఎఫ్‌ఐ హైదరాబాద్‌ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లెనిన్‌, కె. అశోక్‌ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు దమెర కిరణ్‌, దాసరి ప్రశాంత్‌, శ్రీకాంత్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, రమేష్‌, అరవింద్‌, స్టాలిన్‌, హైదరాబాద్‌ జిల్లా నాయకులు సుష్మా, సహన, నందిని, భవన, శ్యామ్‌, అనిల్‌, తేజ, తదితరులు పాల్గొన్నారు.
నూతన కన్వీనింగ్‌ కమిటీ ఎన్నిక
ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ న్యాయ విద్యార్ధుల కన్వీనింగ్‌ కమిటీని 25 మందితో ఎన్నుకున్నారు. కన్వీనర్‌ గా విగేష్‌ కో- కన్వీనింగ్‌ గా డి.ప్రశాంత్‌, శ్రీకాంత్‌, ఎం. స్టాలిన్‌ రమ్య చౌహన్‌, స్టాలిన్‌ లు ఎన్నికయ్యారు. 11 తీర్మానాలు ఆమోదించారు.

Spread the love