ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు చేజారిన అవకాశం : అమెరికన్‌ అధికారులు

రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి చర్చలు జరిగేందుకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నామని అమెరికన్‌ అధికారులు పొలిటికో వార్తా సంస్థకు చెప్పారు. ఉక్రెయిన్‌ రష్యాపైన గెలిచే అవకాశం ఏమాత్రం లేదని అమెరికా సంయుక్త దళాధిపతుల చైర్మెన్‌ మార్క్‌ మిల్లే గత సంవత్సరం చెప్పిన వాస్తవ అవగాహనను వీరు ఒప్పుకున్నారు. పశ్ఛిమ దేశాల్లో సైనిక శిక్షణ తీసుకుని అత్యాధునిక ఆయుధాలతో సరికొత్తగా ‘ప్రతిదాడి’ పేరుతో ఉక్రెయిన్‌ సైన్యం రష్యాపైన యుద్ధాన్ని ఆరంభించి రెండు నెలలకుపైగా అయింది. ఈ రెండు నెలల కాలంలో జరిగిన యుద్ధంలో చెప్పుకోదగిన విజయాలు ఏమీలేకపోగా 43000 ఉక్రెయిన్‌ సైనికులు తమ ప్రాణాలను కోల్పోయారు. 5000లకు పైగా భారీ ఆయుధాలు ధ్వంసం అయ్యాయని రష్యన్‌ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఇంత విధ్వంసం జరుగుతున్నా రష్యా ఆధీనంలో వున్న భూ భాగాన్ని యుద్ధంలో తిరిగి స్వాధీనం చేసుకుంటానని ఉక్రెయిన్‌ ప్రగల్బాలు పలుకుతూనే ఉంది. అయితే అమెరికాలో ఉక్రెయిన్‌ సామర్థ్యంపట్ల సందేహం మొదలయింది. గత నవంబర్‌లో మిల్లే న్యూయార్క్‌లో మాట్లాడుతూ రష్యాపైన ఉక్రెయిన్‌ సైనిక శక్తితో విజయం సాధించటం అనూహ్యమనీ, శీతాకాలం యుద్ధంలో అనివార్యంగా ఏర్పడే విరామ సమయాన్ని చర్చలకు ఉపయోగించుకుని నష్టాలను తగ్గించుకోవాలని సూచించాడు. ఈ అవగాహన ఉక్రెయిన్‌ కోపానికి కారణమైంది. అమెరికా అధ్యక్ష భవనాన్ని కలవరపెట్టింది. చారిత్రకంగా రష్యాలో అంతర్భాగమైన క్రైమియాను, డాన్‌ బాస్‌లోని ఇతర ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవటానికి కావలసినంత మద్దతును అమెరికా అందిస్తుందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు, వ్లాడీమీర్‌ జెలెన్‌ స్కీ కి హామీ ఇవ్వటం జరిగింది. అయితే మీడియాలో వచ్చిన వార్తలను బట్టి తెలుస్తున్నదేమంటే అమెరికా అధ్యక్షుడి నేతృత్వంలోని కార్యవర్గం ఉక్రెయిన్‌లో శాంతి చర్చలను ప్రారంభించాలా, వద్దా అనే విషయంపైన రెండుగా చీలిపోయింది. ఒకవైపు యుద్ధ నీతిలో నిష్ణాతులైన సైనిక, గూఢచార సంస్థలు ఉక్రెయిన్‌ యుద్ధానికి దౌత్య పరిష్కారం మంచిదని సూచిస్తుండగా మరోవైపు అధ్యక్షుడు, జో బైడెన్‌, విదేశాంగ కార్యదర్శి, ఆంటోనీ బ్లింకెన్‌ శాంతి చర్చలు జరగటానికే వీలులేదని పట్టుదలగా ఉన్నారు.
అమెరికాలో ఈ విభజన కొనసాగుతుండగా ఉక్రెయిన్‌ ప్రతిదాడి మొదలయింది. బైడెన్‌, బ్లింకెన్‌ లు ఎంతగా ఆశపడినా అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ, గూఢచార సంస్థ సిఐఏ లు ఊహించినదానికంటే కూడా ఉక్రెయిన్‌ ప్రతిదాడి ఘోరంగా విఫలమైంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు నిరాశలో మునిగితేలుతున్నారని పేరు చెప్పటానికి ఇష్టపడని ఒక అధికారి పొలిటికోకి చెప్పాడు. ‘కిం కర్తవ్యం’ అనే ప్రశ్న అమెరికా పాలకుడి బుర్రను తొలిచివేస్తోంది. ఈ సమస్యకు దౌత్య పరిష్కారమే మేలనే తన సూచన సజీవమని మిల్లే చెబుతున్నాడు. భౌగోళిక సమగ్రతతో ఉక్రెయిన్‌ స్వతంత్ర, సార్వభౌమాధికార దేశంగా కొనసాగాలంటే చాలాకాలం పడుతుందనీ, అయితే దాన్ని దౌత్య సాధనాలతో సాధించవచ్చని మిల్లే గత వారం వాషింగ్టన్‌ పోస్టుకు చెప్పాడు. పశ్చిమ దేశాల చేతుల్లో కీలుబొమ్మగా వున్న జెలెన్‌ స్కీతో చర్చలు జరపటంవల్ల ఉపయోగం ఏమీ ఉండదని, ఆయన యజమానులతోనే నేరుగా చర్చలు జరపటానికే రష్యా సిద్దపడుతుందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ అన్నాడు.
ఏ పరిష్కారమైనా ‘నూతన భౌగోళిక వాస్తవాన్ని’ గుర్తించేలా ఉండాలని, అంటే డోనెస్క్‌, లుగాన్‌ స్క్‌, ఖెర్సన్‌, జపొరోజ్యే ప్రాతాలను ఉక్రెయిన్‌ కు తిరిగి ఇవ్వటం జరగదని రష్యా భావిస్తోంది.

Spread the love