వీడని మిస్టరీ

A mystery that won't go away– నష్టాలు వచ్చినా విరాళాలు ఎలా ఇచ్చారు?
– దాడులు చేసిన తర్వాతే బాండ్లు ఎందుకు కొన్నారు?
– కాంట్రాక్టుల కోసమే నజరానాలు ముట్టచెప్పారా?
– దర్యాప్తు జరిపించాలని కోరుతున్న విశ్లేషకులు
న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తొలుత ఎస్‌బీఐ, ఆ తర్వాత ఎన్నికల కమిషన్‌ అందజేసిన సమాచారం ప్రధాన రాజకీయ పార్టీల ఖాతాల్లో చేరిన విరాళాలకు సంబంధించి అనైతిక ఉద్దేశాలను బయటపెట్టింది. ఈ సమాచారం ప్రజలకు బహిర్గతం చేయడం అవసరమే. అయితే ఈ వివరాలు అవినీతి, చట్టవిరుద్ధ కార్యకలాపాలపై అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. దీనిపై మరింత విచారణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాంటి విచారణను పర్యవేక్షించాల్సిన బాధ్యత సుప్రీంకోర్టు పైనే ఉంది. అది కూడా సాధ్యమైనంత త్వరగా జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏడు అంశాలపై విచారణ జరిపి, తదుపరి చర్యలకు ఉపక్రమించాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నష్టాల ఊబిలో ఉన్నా…
నష్టాలు మూటకట్టుకున్న కంపెనీలు ఎన్నికల బాండ్ల కొనుగోలు ద్వారా పెద్ద ఎత్తున రాజకీయ పార్టీలకు విరాళాలు అందించాయి. కొన్ని కంపెనీలు అయితే తాము ఆర్జించిన లాభాలకు అనేక రెట్లు ఎక్కువగా విరాళాలు ముట్టచెప్పాయి. 2013వ సంవత్సరపు కంపెనీల చట్టానికి, ఫైనాన్స్‌ చట్టానికి ప్రభుత్వం చేసిన కొన్ని సవరణలు ఈ తరహా విరాళాలకు గేట్లు తెరిచాయి. ఇలాంటి విరాళాలు రాజ్యాంగ విరుద్ధం. రాజకీయ విరాళాలు అందించడానికి వీలుగా షెల్‌ కంపెనీలను దుర్వినియోగం చేశారు. ఇది ఆయా కంపెనీల వాటాదారులను మోసం చేయడమే అవుతుంది.
కొత్త కంపెనీలు కూడా…
ఇలాంటి కంపెనీలే కాదు…కొత్తగా ఏర్పడిన కంపెనీలు, కొద్ది నెలల క్రితం మాత్రమే ఏర్పడిన కంపెనీలు కూడా ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ విరాళాలు సమర్పించుకున్నాయి. ఉదాహరణకు 2018లో లేదా ఆ తర్వాత ఆవిర్భవించిన 43 కంపెనీలు కొద్ది కాలానికే రూ.384.5 కోట్ల విలువైన బాండ్లను కొనుగోలు చేశాయి. వీటిలో నాలుగు కంపెనీలు గత సంవత్సరమే హైదరాబాదులో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే కోట్లాది రూపాయల విలువ కలిగిన బాండ్లను కొన్నాయి. కోవిడ్‌ కష్టకాలంలో అంటే 2020లో 9, 2021లో 11 కంపెనీలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకే సుమారు రూ.100 కోట్ల బాండ్లు కొనుగోలు చేశాయి. కేవలం రాజకీయ పార్టీలకు విరాళాలు అందించడానికే ఇవి ఏర్పడ్డాయా లేదా అనే దానిపై విచారణ జరగాల్సిన అవసరం ఉంది.
దాడుల తర్వాత కొనుగోళ్లు
కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్లు కొనడానికి ముందో లేదా కొనుగోలు చేసిన తర్వాతో ప్రభుత్వ కాంట్రాక్టులు దక్కించుకున్నాయి. ఈ వ్యవహారం వెనుక క్విడ్‌ప్రోకో జరిగిందా లేదా అనే విషయంపై అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరపాల్సి ఉంది. కాగా ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల దాడులు ఎదుర్కొన్న తర్వాతే కొన్ని కంపెనీలు ఎన్నికల బాండ్ల ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చాయి. ఆయా కంపెనీలపై పెట్టిన కేసులు బాండ్లు కొనుగోలు చేసిన తర్వాత నిలిచిపోయాయి. కొన్ని కేసులను ఉపసంహరించుకోవడం కూడా జరిగింది. ఫిబ్రవరిలో జరిపిన ఓ దర్యాప్తు ప్రకారం ఈడీ, ఐటీ విచారణలు ఎదుర్కొన్న 30 కంపెనీలు బీజేపీకి రూ.335 కోట్ల విరాళం అందించాయని తేలింది. సందేహాస్పద కంపెనీలుగా ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ) నిర్ధా రించిన సంస్థలు పాలక పక్షానికి గణనీయమైన మొత్తంలో విరాళాలు అంద జేశాయి. ఆ తర్వాత సందేహాస్పద కంపెనీల జాబితా నుండి వాటి పేర్లు అదృశ్యమయ్యాయి.
గడువు తీరినా సరే
ఆశ్చర్యకరమైన విషయమేమంటే గడువు తీరిన తర్వాత కూడా ఎన్నికల బాండ్లను ఓ పార్టీ నగదుగా మార్చుకుంది. కాలదోషం పట్టిన రూ.10 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను బీజేపీ సొమ్ము చేసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం అధికారిక నిబంధనలను ఉల్లంఘిం చింది. 2018లో జరిగిన కర్నాటక శాసనసభ ఎన్ని కలకు ముందు ఈ ఉదంతం చోటు చేసుకుంది.
ఈసీ పిల్లిమొగ్గలు
బాండ్ల విషయంలో ఎన్నికల కమిషన్‌ కూడా పిల్లిమొగ్గలు వేసింది. తొలుత ఈ పథకాన్ని తప్పుపట్టిన కమిషన్‌, ఆ తర్వాత అంతా బాగానే ఉందని కితాబు ఇచ్చింది.  సుప్రీంకోర్టు చారిత్రక నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత కూడా ఈసీ మౌనం వహించింది.
ఎస్‌బీఐ తీరుపై అనుమానాలు
సుప్రీంకోర్టులో సీబీఐ చేసిన వాదనలపై కూడా విచారణ జరపాల్సిన అవసరం ఉంది. తన వద్ద మ్యాచింగ్‌ సమాచారం లేదని, సమాచారాన్ని అందించడానికి జూన్‌ 30వ తేదీ వరకూ గడువు ఇవ్వాలని ఎస్‌బీఐ వాదించింది. దేశంలోనే అతి పెద్దదైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌ ఇలాంటి వాదనను ముందుకు తేవడం వెనుక ఉద్దేశమేమిటో తెలియాల్సి ఉంది. తన వద్ద ఉన్న సమాచారాన్ని ఎస్‌బీఐ ఎన్నికల కమిషన్‌కు అందజేయడానికి ముందు మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లవాసా లేవనెత్తిన ప్రశ్నలపై కూలంకషంగా విచారణ జరపాల్సి ఉంది. ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌ కూడా ఎస్‌బీఐ తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. బ్యాంక్‌ చర్య చట్టవిరుద్ధమని, దానిని ఎవరూ ఊహించలేదని ఆయన చెప్పారు. సందేహాలు, అనుమానాలకు ఎస్‌బీఐ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

Spread the love