హార్ముజ్ కిందుగా వెళ్లే ఇంటర్నెట్ కేబుళ్లపై ఇరాన్ ఆంక్షలు
అనుమతులు, వార్షిక ఫీజులు, మరమ్మతుల నియంత్రణకు పట్టు
కొత్త చట్టం ముసాయిదా సిద్ధం
చేసిన టెహ్రాన్!
• గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్
లాంటి టెక్ దిగ్గజాలపై ప్రభావం
• ప్రపంచ డిజిటల్ వ్యవస్థపై కొత్త
భౌగోళిక రాజకీయ పోరు
టెహ్రాన్ : ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇప్పటికే వ్యూహాత్మక పట్టు కలిగిన ఇరాన్.. ఇప్పుడు ప్రపంచ డిజిటల్ కమ్యూనికేషన్ వ్యవస్థపైనా ప్రభావం చూపే దిశగా అడుగులు వేస్తోంది. హార్ముజ్‌లోని సముద్ర గర్భం గుండా వెళ్లే అంతర్జాతీయ ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లపై నియంత్రణ సాధించేందుకు కొత్త చట్ట ముసాయిదాను సిద్ధం చేసినట్టు ఇరాన్ అనుకూల వార్తా సంస్థలు వెల్లడించాయి. ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్‌లాంటి టెక్ కంపెనీలతో పాటు ప్రపంచ ఇంటర్నెట్ సేవల ఖర్చులపైనా భారీ ప్రభావం పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు. ప్రపంచ ఇంటర్నెట్ ట్రాఫిక్‌లో దాదాపు 95 నుంచి 99 శాతం వరకు సముద్ర గర్భంలోని ఫైబర్ ఆప్టిక్ కేబుళ్ల ద్వారానే సాగుతోంది. ఈ కేబుళ్ల మొత్తం పొడవు సుమారు 14 లక్షల కిలోమీటర్లు. ఈ-మెయిళ్లు, బ్యాంక్ లావాదేవీలు, స్టాక్ మార్కెట్ ఆర్డర్లు, వీడియో కాన్ఫరెన్సులు, క్లౌడ్ సేవలు అన్నీ వీటిపైనే ఆధారపడి ఉంటాయి. యూరప్‌ను ఆసియాతో కలిపే కీలక డిజిటల్ మార్గాల్లో కొన్ని హార్ముజ్ జలసంధి కిందుగా వెళ్తాయి.
ఇరాన్ ప్రతిపాదించిన ముసాయిదాలో మూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. సముద్ర గర్భ కేబుళ్లను ఏర్పాటు చేయడానికి ముందుగా ఇరాన్ అనుమతి తీసుకోవాలి. ప్రతి కేబుల్‌పై వార్షిక ఫీజు చెల్లించాలి. మరమ్మతులు లేదా నిర్వహణ పనులు ఇరాన్‌కు చెందిన సంస్థల ద్వారానే జరగాలి. హార్ముజ్ జలసంధిలోని కొంతభాగం తమ ప్రాదేశిక జలాల్లోకి వస్తుందని, అందువల్ల అక్కడి మౌలిక వసతులపై తమకు హక్కులు ఉంటాయని ఇరాన్ వాదిస్తోంది. అయితే ఈ వాదనపై అంతర్జాతీయ న్యాయ నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సముద్ర చట్టాలపై ఐక్యరాజ్యసమితి ఒప్పందం (యూఎన్‌సీఎల్‌ఓఎస్) ప్రకారం అంతర్జాతీయ కమ్యూనికేషన్ మౌలిక వసతుల స్వేచ్ఛాయుత ప్రయాణాన్ని అడ్డుకునే హక్కు ఏ దేశానికీ లేదని చెబుతున్నారు. కాబట్టి ఇరాన్ ప్రతిపాదన చట్టబద్ధతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయినా కూడా ఈ చర్య ప్రభావవంతమయ్యే అవకాశాన్ని నిపుణులు కొట్టిపారేయడం లేదు. యుద్ధ పరిస్థితులు లేదా భద్రతా ఉద్రిక్తతల సమయం లో కేబుళ్ల మరమ్మతులకు ప్రత్యేక నౌకలు అవసరం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా అలాంటి కేబుల్ మరమ్మతు నౌకలు సుమారు 60 మాత్రమే ఉన్నాయి.
వాటి షెడ్యూళ్లు ముందుగానే బుక్ అయి ఉంటాయి. ఇలాంటి సమయంలో ఇరాన్ అనుమతి లేకుండా మరమ్మతులు జరపడం కష్టసాధ్యమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు గమాల్ అబ్దెల్ నాసర్ సుయాజ్ కాలువను జాతీ యీకరించిన ఘటనను పలువురు విశ్లేషకులు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు. అప్పట్లో ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన మార్గంపై ఒకే దేశం నియంత్రణ సాధించడంతో సుయాజ్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు హార్ముజ్ జలసంధి కింద ఉన్న డిజిటల్ మార్గా లపై ఇరాన్ పట్టు సాధించే ప్రయత్నం కూడా అలాంటి భౌగోళిక రాజకీయ పరిణామంగా మారే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు, నిపుణులు చెప్తున్నారు. 20వ శతాబ్దంలో చమురు సరఫరాపై నియంత్రణే ప్రపంచ శక్తి సమీకరణాలను నిర్ణయించిందనీ, 21వ శతాబ్దంలో డిజిటల్ కమ్యూనికేషన్ మార్గాలపై పట్టు కూడా అంతే కీలకమవుతోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
వినియోగగదారులపై
భారం పడొచ్చు : ఆర్థిక నిపుణులు
ప్రస్తుతం ప్రపంచ సముద్ర గర్భ కేబుల్ వ్యవస్థలో అతిపెద్ద పెట్టుబడి దారులుగా గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ నిలిచాయి. కొత్తగా వేయబడుతున్న కేబుళ్లలో సగానికి పైగా వాటి ఆధీనంలోనే ఉన్నట్టు సమాచారం. ఈ కంపెనీలు ప్రతి సంవత్సరం 250 బిలియన్ డాలర్లకు పైగా మౌలిక వసతుల పెట్టుబడులు పెడుతున్నాయి. ఇరాన్ ప్రతిపాదనలు అమలైతే అదనపు వ్యయభారం ఈ సంస్థలపై పడే అవకాశం ఉంది. దీని ప్రభావం చివరకు క్లౌడ్ సేవలు, డేటా సెంటర్లు, కృత్రిమ మేధస్సు శిక్షణ ఖర్చుల రూపంలో వినియోగదారులపై పడొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.



