వానాకాలపు సౌందర్యాన్ని కొలిచే కవిత

వానాకాలపు సౌందర్యాన్ని కొలిచే కవితకొన్ని కవితలు చదివినప్పుడు చెప్పలేని అనుభూతి కలుగుతుంది. కొత్త ఉదయంలోకి అడుగుపెడతాం. మరి ఉదయంలోని తాజాదనాన్ని కవితలో దట్టిస్తే చదివిన పాఠకుడి అనుభూతిని వర్ణించగలమా? అది మళ్ళీ తొలకరి చినుకుల వానాకాలం. కవి ఈ కవితలో భావాల జడివానను కుండపోత వర్షంగా కురిపించారు. చప్పగా సాగే జీవితానికి ఇదో స్ట్రాంగ్‌ మార్నింగ్‌ కాఫీ. ఈ కవిత చదివాక మనసు కాస్త పరుగులు పెడతది. ఉన్నచోట ఉండనీదు. ఎక్కడున్నామో అర్థం కాదు. ఇలాంటి అనుభూతినిచ్చే కవితను ఈ కాలమ్‌లోకి తీసుకోచ్చాను. వారే మానస చామర్తి. ‘పరవశ’ పేరుతో ఓ కవితాసంపుటిని ముద్రించారు.
కవిత్వమనగానే దానికో శీర్షిక ఉండాలి. ఇన్ని లైన్‌లే రాయాలి. ఇంకా వస్తువును వివరంగా రాయాలి. ఇలాంటివి చాలా మంది మాట్లాడుతుంటే విసుగొస్తుంది. కవి ఎత్తుకున్న పంథాను వదిలిపెట్టి, ఆయన ఏం రాశాడో, ఎలా కవితను నిర్మించాడో పక్కకు పెట్టి అలా రాస్తే బాగుండు, ఇలా రాస్తే బాగుండు అని అందులో మేలిమి వాక్యాలను పట్టుకోరు. వాళ్ళందరికీ ఈ కవిత ఓ సమాధానం. ఇందులో శీర్షిక లేదు. అలా అని కవితలకు శీర్షిక పెట్టొద్దన్న అభిప్రాయం కాదు. కవిత రాశాక శీర్షిక పెట్టాలా? కవితకు ముందే శీర్షిక పెట్టి రాయాలా? ఇలాంటి వివరణలు చాలా రకాల సాహిత్య వ్యాసాల్లో చూస్తుంటాం. దీనిమీద తెలంగాణ సారస్వత పరిషత్తు వారు వెలువరించిన ‘వస్తు- శిల్పాలు’ పుస్తకాన్ని చదివితే దాదాపుగా అవగతమవుతుంది. కవి మేలిమి కవిత రాసినప్పుడు ఇలా శీర్షిక పెట్టకున్నా నష్టమేమీ లేదు. మనమే ఓ శీర్షిక నిర్ణయించుకోగలిగినంత స్కోప్‌ ఇందులో ఉంది.
వస్తు విషయంలో చాలావరకు విభేదిస్తుంటారు. కవుల అభిమతాన్ని బట్టి కవితలు వస్తుంటాయి. ఈ కవితకున్న గొప్పతనం ఏంటంటే దక్పథాలతో సంబంధం లేకుండా ఇది అందరినీ మెప్పించగలదు. విషయ ప్రస్తావనకు వెళ్తే మళ్ళీ రకరకాల కోణాల్లోకి వెళ్ళాల్సి ఉంటది. కవితను కవితలా ఆస్వాదిస్తే, సజనను సజనలా చూస్తే కవిత్వానికి ఈ కవితలాగే చావుండదు.
కవి మానస తీసుకున్న ఎత్తుగడలోని విషయాన్ని పరిశీలిస్తే మనందరికి పరిచయమే. ఎన్నో వానపాటలు చూసిన వాళ్ళము. వాన వచ్చే ముందు వాతావరణంలో మార్పులు ఎలా సంభవిస్తాయో తెలుసు. మరీ ఈ కవితలో కొత్తదనమేముంది అనే ప్రశ్న మెదలొచ్చు. ఈ కవితలో ఉన్న కొత్తదనమంతా ఆమె అభివ్యక్తిలోనే ఉంది. ఇంకాస్త లోతుకెళ్ళి ఆలోచిస్తే ఏ కవి రాసిన వస్తువునయినా, అందులో కొంతలో కొంత విషయాన్నయినా అంతకు ముందు ఎవరో కవి ఏదో చోట స్పశించే ఉంటాడు. మనమే రాశాం అన్న భ్రమలో ఉండకపోవడమే మంచిది.
కవిత్వమంటే కొత్తగా చెప్పటమే కదా. కొత్తగా చెప్పాలన్న ఆలోచనతో మరీ అర్థం కాకుండా చెప్పటం కవిత్వం కాదేమో. ఈ కవితలో కొత్తదనంతో పాటు అర్థం అయ్యేలా కూడా ఉంది.
కొత్తదనాన్ని సాధించటంలో కవి వాడిన అభివ్యక్తులు కొన్ని: ‘రాతిరంతా శుభ్రపడి, విరిసీ విరియని పూవు, రెక్కలు అల్లార్చుకుంటూ, కువకువలాడే గుప్పెడు ప్రాణం’. ఈ పదబంధాలను ఉపయోగించి కవితలోకి ప్రవేశించడానికి కావాల్సిన వాతావరణాన్ని సజించి చక్కటి కవితాగూడును అల్లారు.
ఈ కవితలో కేంద్రబిందువు అంతా నిద్ర కళ్ళతో వచ్చి అమ్మను పట్టుకున్న పిల్లాడే. ఇది అందరి జీవితంలో తారాసపడే అంశం. కవి అనుభూతిలోకి పట్టుకెళ్ళి వాస్తవికత వైపుగా కవితను నడిపించి మనలో ఆ కవిత తాలూకా ముద్రను బలంగా వేశారు.
ముగింపు వాక్యాల్లో కవి వానకాలపు సౌందర్యాన్ని గాఢంగా పట్టిస్తూనే ఈ సౌందర్యాన్ని కొలవడం, సష్టించిన ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు అంటూ ప్రకతి సౌందర్యంలోని గొప్పతనాన్ని, కాలానుగుణంగా అది మారే తీరును అర్థం చేయించారు. వాస్తవంగా ఆలోచించినప్పుడు ప్రకతిని ఏడురంగుల్లో కొలవటం తప్పే అనిపిస్తుంది. ఈ కవితను చదివాక ఆ భావన నిజమనిపిస్తోంది. ప్రకతి సౌందర్యాన్ని కొలవటంలో ఈ కవి కాస్త ముందున్నారు అనిపిస్తుంది.
రాతిరంతా శుభ్రపడి తాజాగా మేల్కొంటున్న
వానాకాలపు ఉదయం
నల్లని మేఘాలతో నిర్మలంగా ఆకాశం
పల్చటి చలిగాలులు
ఇంకా జల్లుజల్లుగా కురుస్తోన్న వర్షం
తడిసిన ఆకుల మధ్య
ఓ విరిసీ విరియని పూవు
తడి తడి రెక్కలు అల్లార్చుకుంటూ
కువకువలాడే గుప్పెడు ప్రాణం
నిద్రకళ్లతో వెదుక్కుంటూ వచ్చి
నన్నల్లుకున్న నా పిల్లాడు…
ఈ ఉదయపు సౌందర్యాన్ని కొలిచి చెప్పమంటే-
నేనే కాదు, నువ్వూ కాదు
ఈ సమస్తాన్ని సష్టించినవాడుకూడా
సమాధానానికి తడబడతాడు.
– మానస చామర్తి
– డా|| తండ హరీష్‌ గౌడ్‌
8978439551 

Spread the love